మన చిన్నప్పుడు అమ్మమ్మో,బామ్మో కథలు చెపుతూ రాజుగారు ఏడు చేపల కథ చెప్పేవారు. ఆ రోజుల్లో
మనం కథగానే గ్రహించాము. ఇప్పుడు మరో కోణంలో అంటే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే కొత్త భాష్యం గోచరిస్తోంది. ఎలాగో చూద్దాం…
అనగా అనగా ఒక రాజు. అంటే ఈ జీవుడు. రాజుగారికి ఏడుగురు కొడుకులు. అంటే జీవుడిని ఆశ్రయించుకొన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు… ఆరు మనసుతో ఏడు. కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలను తెచ్చారు. అంటే మనల్ని అంటి పెట్టుకొని ఈ గుణాలు వల్ల ఏడు గుణాలు సప్త వ్యసనాలు అనే ఏడు చేపలు తెచ్చారు. ( సప్త వ్యసనాలు అంటే తాగుడు, జూదం, వ్యభిచారం, దొంగతనం, అసత్యం చెప్పడం, అహంకారం)
అందులో అ#హంకారం ఎండలేదు. దానికి కారణం మనస్సు. ఆరు వ్యసనాలు ఏదోవిధంగా తగ్గించుకోగలిగినా, మనసు అనే ఏడవ చేప ఎండలేదు. ”చేపా! చేపా! ఎందుకు ఎండ లేదు? అంటే గడ్డి దుబ్బు అడ్డొచ్చింది” అంది. అంటే మనసులో చెత్త పేరుకు పోయింది. గడ్డి దుబ్బు అజ్ఞానానికి చి#హ్నం. దుబ్బూ! దుబ్బూ! ఎందుకు అడ్డొచ్చావు? అంటే… ఆవు మేయలేదు అంది. ఆవు పవిత్రత్రకు చిహ్నం. దేవతలందరూ గోవును ఆశ్రయించి ఉన్నారు. గోవు మల మూత్రములలో లక్ష్మీ దేవి కొలువై ఉంది. ఆవు, ఆవు… ఎందుకు మేయలేదు అని అడిగితే, ” కాపు వాడు మేపలేదు అంది. అంటే జీవుడు లోని అజ్ఞానం తొలగలేదు. సంస్కారం లేదు. కాపువాడా, కాపువాడా… ఎందుకు మేపలేదు? అంటే అవ్వ బువ్వ పెట్టలేదు అంది. అంటే మంచి బుద్ధి పెట్టలేదు అని. అవ్వా, అవ్వా… నువ్వు ఎందుకు బువ్వ పెట్టలేదు? అని అడిగితే, ”పాపకు చీమ కుట్టింది” అంది. అంటే సంసార తాపత్రయ పెరిగిందని. చీమా, చీమా… ఎందుకు కుట్టావు? అంటే ”నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది. బంగారు పుట్ట లాంటి తాపత్రయంలో నీవు కొట్టుకొంటుంటే, వివేకం కోల్పోతాం… స్వార్థం పెరుగుతుంది. అపుడు నువ్వు మంచి జ్ఞానం పొంది, బుద్ధి నశించకుండా తామరాకు మీద నీటి బొట్టులా మనగలిగితే, మోక్షానికి మార్గం సుగమం అవుతుంది అని అర్థం.
మరో కథలో నల్లమేక, బ్రాహ్మణుడు, ముగ్గురు దొంగలులో బ్రా#హ్మణుడు యజ్ఞం చేయడానికి నల్లమేక ను తీసుకుని వెళ్ళడం అంటే అజ్ఞానంతో ఉన్నాడని. నలుపు అజ్ఞానానికి చి#హ్నం. ముగ్గురు దొంగలు మనలోని అంతర్గతంగా ఉన్న మూడు గుణాలు. మొదటి దొంగ ప్రశ్నించగానే, అంటే మనలోని ఆత్మ పరిశీలన చేసి కుక్క కాదు, మేకే అని కొనసాగాడు. ఇలా ముగ్గురు ప్రశ్నించగానే ఆత్మ ప్రేరణ పొంది కావలసింది దైవ గుణం. అంటే ఆధ్యాత్మిక చింతన, అని మేకను అంటే అజ్ఞానం వదిలి జ్ఞానం వైపు నడుస్తాడు.
ఇలా ప్రతీ పాత కథకు అంతరార్థం ఉంది.
అనంతాత్మకుల రంగారావు