Home భక్తిప్రభ నిత్యం ప్రముదితా మూఢా!

నిత్యం ప్రముదితా మూఢా!

0
నిత్యం ప్రముదితా మూఢా!

భూలోకంలో మనుషులు చేసే పుణ్యకర్మలన్నీ కూడా మరణం తరువాత స్వర్గలోక ప్రాప్తి కోసం ఉద్దేశించబడినవిగా చెప్పబడుతుంటాయి. మరణం శరీరానికే తప్ప ఆత్మకు లేదనేది ఒక బలమైన భావనగా మన ఆలోచనలలో స్థిరపడి ఉంది. ఈ జన్మలో పుణ్యకర్మల ఫలితంగానే మరు జన్మలో ఒక ప్రాణి పొందే ఉన్నత స్థితి లేదా ఈ జన్మ కంటే నీచమైన స్థితి ఆధారపడి ఉంటుందన్నది కూడా అంతే స్థిరమైన ఆలోచనగా ప్రాచుర్యం పొంది ఉంది. ఈ నేపథ్యంలో, ఈ భావనలకు పూర్తిగా భిన్నమైన ఆలోచనను వ్యాస భగవానుడు, మహాభారతం శాంతిపర్వంలోని ఒక శ్లోకం ద్వారా చెప్పడం ఆలోచనను రేకెత్తిస్తుంది. స్వర్గంలో దేవతలు అనుభవించే సుఖాలను పోలిన సుఖాలు తెలివిగల మనిషి కోరుకునేవి కావని, కేవలం మూర్ఖ మానవులు మాత్రమే ప్రతిరోజు, రోజులో ప్రతి క్షణము, స్వర్గంలో దేవతలవలె, సుఖంలో మునిగి తేలుతూ కాలం గడపాలని ఆలోచిస్తారని, అలా కోరుకుంటారని, ఏమాత్రమూ సందేహానికి తావులేని మాటలలో స్పష్టంగా చెప్పాడు ఈ క్రింది శ్లోకంలో…
”నిత్యం ప్రముదితా మూఢా దివి దేవగణా ఇవ|”
(వ్యాసభారతం, శాంతిపర్వం, 174వ అధ్యాయం, 37వ శ్లోకం పూర్వార్ధం)
‘మూర్ఖ మానవులు స్వర్గంలోని దేవగణాల వంటి వారు. నిత్యం విషయ సుఖాలలో మునిగి తేలుతూ అందులోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు’ అని పై శ్లోక భాగం భావం. నిత్యం స్వర్గసౌఖ్యం అన్నది మూర్ఖులు మాత్రమే కోరుకునేది అన్న భావనను సామాన్య మానవుడి ముందుకు తెచ్చి అతడి ఆలోచనకు వదలాలంటే, అందులో ఒక సమస్య ఎదురౌతుంది. మనిషి పుణ్యకర్మల అత్యుత్తమ ఫలితమైన మోక్షానికి, స్వర్గలోకవాసానికి సంబంధం ఉన్నది కాబట్టి, దేవతలు నిత్యం సుఖసంతోషాలలో తేలియాడే స్వర్గలోకవాస సౌఖ్యం మూర్ఖుల చిత్తవృత్తితో సమానమైనదిగా చెప్పడం ఎంతవరకు సరైనది అనే ఆలోచనను ఇది రేకెత్తిసుంది. అంతేకాకుండా, మనిషి మరి పుణ్యకర్మలను ఆచరించడం ఎందుకు? అనే ప్రశ్నను కూడా ఈ ఆలోచన ముందుకు తెస్తుంది.
”అవలేపేన మహితా పరిభూత్యా విచేతస:|”
అనే మాటలతో పై శ్లోకం ముగించబడింది. ఈ భూమి మీద నిత్యం ఆనందోల్లాసాలలో మాత్రమే తేలియాడుతూ రోజులు గడిపే, స్వర్గలోక సౌఖ్యంతో పోలిన, సౌఖ్యం మూర్ఖులు మాత్రమే కోరుకుంటారని అన్నది ఎందుకంటే వారి చిత్తం భోగలాలసత్వం అనే బురదలో చిక్కుకుని మో#హ శృంఖలాలలో జీవిత పర్యంతం బంధించబడి వుంటుంది గనుక అని సమధానంగా చెప్పాడు వ్యాసుడు. ఈ ఆలోచన సరైనదే అయినప్పటికీ, నిత్యం ఆనందంలో మునిగితేలే వ్యక్తుల చిత్తవృత్తి స్వర్గలోకవాసుల మనసుల వలె మూర్ఖమైనది అని చెప్పే ధైర్యాన్ని ఎవరూ చేయరని అనిపిస్తుంది. స్వర్గంలో భోగాలమాట ఎలా ఉన్నా, ఈ భూమి మీద మాత్రం నిత్యం సుఖాల లోనే తేలియాడుతూ కాలం గడిపే భోగ లాలసత్వంలో చిక్కుకోవడం మనిషికి చేటును కలిగిస్తుందని చెప్పడం ఇందులో వ్యాసభగవానుడి ఉద్దేశంగా గ్రహించాల్సి ఉంటుంది.

  • భ‌ట్టు వెంక‌ట‌రావు
Exit mobile version