Tuesday, November 26, 2024

నవరాత్రి రహస్యాలు – నవరాత్రి దీక్షలు(ఆడియోతో…)

నవరాత్రి రహస్యాలు – నవరాత్రి దీ క్షలు గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

దీక్షా అనగా దా, ఇ, క, ష, అ అని అయిదు అక్షరాలు. దా అంటే ఇచ్చేది, ఇ అంటే లక్ష్మీ అనగా సంపద, క అంటే బ్రహ్మానందము, ష అంటే సమృద్ధి, అ అంటే పరమాత్మ, పరబ్రహ్మ. ఇలా బ్రహ్మానందము, సంపద, సమృద్ధి, పరమాత్మని ఇచ్చేది దీక్ష. అనగా పరమ జ్ఞానాన్ని ఇస్తుంది. పాప పరంపరలను పోగొట్టి సంసార పాశ బంధాలను ఛేదించి, తత్త్వ చింతనను కలిగిస్తుంది. పాపపరిహారం జరిగి జ్ఞానం కలగడం దీక్షకు ప్రయోజనం. దీక్ష అనగా నియమబద్ధ ప్రవృత్తి. మనస్సును, శరీరాన్ని, వాక్కును అన్ని అవయవాలను, అన్ని ఇంద్రియాలను నియమించి పరమాత్మను ఆరాధనకు అనుగుణంగా ప్రవర్తింప చేయుటయే దీక్ష. కావున దీక్షకు మించిన పవిత్రమైనది, జ్ఞానము, తపస్సు లేదు.

ఆణవీ, శాక్తేయీ, వైష్ణవి అనునవి మూడు రకాల దీక్షలు. ఆణవీ అనగా మంత్రము, అర్చన, ఆసనము, ధ్యానము, స్థాపన, ఉపాసన అను ఆరు అంగములు కలిగిన దీక్ష. శాక్తేయీ అనగా శక్తిని ఆరాధించుట. మనకు కావలసిన శక్తిని కోరుట, మన శక్తిని మనం చూసుకొనుట, జగన్మాతను కూడా శిశువు అవస్థ నుండి తొమ్మిది అవస్థలుగా ఆరాధించుట, దీనినే నవరాత్రి దీక్ష అంటారు. ఇక వైష్ణవి దీక్ష అనగా గురుశిష్యులు ఇద్దరు ఎలాంటి ఫలమును ఆశించకుండా ప్రవర్తించుట. శిష్యున్ని మంచి దారిలో ప్రవర్తింపచేసి, తత్త్వమును, హితమును, పరమార్థమును బోధించుట. శి ష్యుడు గురువుగారి అనుగ్రహమే పరమాత్మని పొందింపజేస్తుందని గురువునే పరమాత్మగా ఆరాధించుట. అనగా శరీరము, ధనము, ప్రాణములు, ఇష్టములు అన్ని గురువుగారికే అర్పించుట. దీనినే వేదములో బ్రహ్మచర్య దీక్ష అంటారు. గురువు గారిని దర్శించుట, స్పృశించుట, మాట్లాడుట వలనే తత్త్వ జ్ఞానము కలుగును. గురువు జ్ఞాన మార్గముతో శిష్య దేహంలో ప్రవేశించి శి ష్యుని జ్ఞాన నేత్రమును తెరిపించి పరమాత్మ స్వరూపన్ని సాక్షాత్కరింప చేయుట వైష్ణవి దీక్ష లేదా జ్ఞాన దీక్ష లేదా బ్రహ్మచర్య దీక్ష అంటారు.

ప్రతి దీక్షలోను కలశ స్థాపన ప్రధానం. క అనగా పరబ్రహ్మ, ల అంటే లక్ష్మీ, శ అంటే శాంతి, శక్తి అని అర్థము. లక్ష్మీనారాయణులు, వారి దివ్య శక్తి అన్నీ వారి రూపాలే కావున బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు కలశంలో ఉంటారని, కలశం బ్ర హ్మాండానికి, అందులో ఉన్న జలము సకల దేవతల కు, పల్లవములు సకల ప్రాణులకు ప్రతీకలని, కొబ్బరికాయ మన స్థిరమైన సంకల్పమని, దానిపై వస్త్త్రము మన శరీరమని, ఈ విధంగా త్రికరణముతో త్రిమూర్తులను, త్రిలోకములను, తత్త్వ త్రయమును ఆరాధించుటయే కలశ స్థాపన, కలశారాధన. ఈ విధంగా కలశ స్థాపనతో స్వీకరించే దీక్షను క్రియావతి అని, మంత్రములతో చేస్తే మాంత్రి అని అంటారు.

అంతేకాక ఈ దీక్షను క్రియావతి, కళావతి, వర్ణమయి, బోధమయి అని నాలుగుగా చెప్పారు. కలశ స్థాపనాథులు చేసేది క్రియావతి, ఆ కలశంలో దేవతాకళలను ఆవాహన చేయుట కళావతి. మంత్రములు చదువుట, ఉపదేశించుట వర్ణమయి, తత్త్వ జ్ఞానమును బోధించుట బోధమయి. ఈ దీక్షలతో బ్రహ్మను, విష్ణువును, రుద్రుణ్ణి, శక్తినీ ఆరాధించే సంప్రదాయం మన శ్రుతి, ఇతిహాసపురాణాలలో ఉంది. జగత్‌స్వరూపాన్ని తెలుసుకొనుటకు బ్రహ్మను, జ్ఞానం కొరకు రుద్రుణ్ణి, మోక్షం కొరకు విష్ణువుని, భక్తిని, రక్తిని కలిగించుటకు శక్తిని ఆరాధించాలని శాస్త్రవచనం శరత్‌ కాల నవరాత్రుల్లో ఎక్కువగా శక్తి ఆరాధనే ఉంటుంది కావున ఈ నవరాత్రి దీక్ష నవదేవుడిగా నవ రూపాలతో నవ అలంకారాలతో నవ నామములతో నవ ద్రవ్యములతో ఆరాధిస్తారు.

- Advertisement -

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement