Tuesday, November 26, 2024

నవరాత్రి రహస్యాలు (ఆడియోతో..)

తత్త్వము, వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

తమస్సు మాటలకు చేతలకు అందనిది. తమస్సు అనుపాఖ్యము, అనిరుక్తము, నిరుక్తము అని మూడు విధములుగా ఉండును. తెలుపునపుడు నిరుక్త క్రమము అనగా ప్రకాశము, వెలుగు, కనులు తెరుచుట. రాత్రి, చీకటి, నలుపు, కనులు మూసుకొనుట ఇది అనిరుక్త క్రమము. ఇదంతా ప్రత్యక్షమే కానీ నిర్వచించజాలము. విశ్వాతీతమైన అనుపాఖ్యమైన ఈ తమస్సు జ్ఞాన చక్షువుతో కూడ అతీత ము కావున ‘అసత్‌’ అంటారు. ‘అసత్‌ ‘ అనగా మనకి కనబడనిది కాని లేనిది కాదు. కనబడనిది కనపడినది అనగా ‘అసత్‌’ నుండి ‘సత్‌’ వచ్చింది. ‘అసత్‌’ అనగా ప్రళయం, ‘సత్‌’ అనగా సృష్టి. దీని నుండే బ్రహ్మాండము ఆవిర్భవించింది. కాలపురుషుడు మహామాయతో కలిసి ఉన్నప్పుడు అసత్‌ ఏర్పడును అలాగే కాలపురుషుడు మహామాయను అధిగమించినపుడు సత్‌ ఏర్పడును. సత్‌ అంటే పరిమితి, అసత్‌ అంటే అపరిమితి. కనులు తెరిస్తే కనపడతాయనేది అజ్ఞానం, కన్నులు మూస్తే కనిపించేది జ్ఞానం, సత్యం అదే ధ్యానము. విశ్వాతీతుడని కన్నులు మూసుకునే చూసుకోవాలి విశ్వాన్ని కన్నులు తెరుచుకుని చూడాలి. ‘ఏకోహం బహుస్యాం’ అంటే ఒక్కడిగా ఉన్న పరమాత్మ తన మాయతో అనగా ప్రకృతితో ప్రపంచరూపంగా ఏర్పడతాడు. పురుషుడు ప్రకృతితో కూడి ఉంటే కామన అనగా మనస్సుని తలకిందులు చేస్తే నమస్సు. చంద్రుడి కళలలో హెచ్చుతగ్గులు ఉన్నట్టే మన మనస్సులోని కోరికలకు కూడా హెచ్చుతగ్గులుంటాయి. సృష్టికి మూలం కోరిక.

కామనతో పంచజనాదిక్రమముతో మొదటి వేద నామంతో పురంజనుని పుట్టుక జరుగును. ఋక్‌, యజుర్‌, సామ వేదములు అను అన్ని వేదములను స్వాయంభువ బ్రహ్మ అని అంటారు. అధర్వము సామవేదము, దీనిని పారమేష్ట్య సుబ్రహ్మ అని అంటారు. స్థితి గతి తత్త్వము యొక్క సమిష్టి రూపమే యజుర్వేదము. . ఋక్‌, సామ, యత్‌జూ అనే బేధము తోటి అగ్ని వేదము నాలుగు కళలుగా ఉండును. ఆపోమయమైన సామ వేదము అనగా అధర్వవేదము బృగు, అంగీర అను బేధములతో రెండు భాగములుగా విభజించబడును. భృగు మూడు అవస్థలలో అంగీర మూడు అవస్థలలో మారగా ఈ రీతిలో ఆపోవేదము ఆరు కళలుగా ఉంటుంది. అగ్నివేదము నాలుగు బేధాలు, ఆపోవేదము ఆరు బేధాలు కలిసి పదింటిని దశమహావిద్యలుగా చెబుతారు. తొమ్మిది రాత్రులు, ఒక పగలు ఆ పగలను ‘దశహరా’ అనగా పదిపాపాలు పోగొట్టేది (కామంతో నాలుగు, వాక్కుతో మూడు, మనస్సుతో మూడు) వాక్కు అగ్ని, మనస్సు సోమము. ఈ రెంటి సమన్వయమే శరీరము. అదేవిధంగా అగ్ని పురుషుడు, సోమము స్త్రీ. ఆ రెండింటి కలయికే జగత్తు సృష్టి. దశహరా అనగా పదిపాపాలను పోగొట్టి పది కర్తవ్యాలను అందించేది. ఆరుకళల సుబ్రహ్మ సౌమ్యము కావున స్త్రీ, చతుష్కళమైన త్రయీబ్రహ్మ ఆగ్నేయము కావున పురుషుడు. వీరి సమన్వయంతోనే విరాట్‌ పురుషుడు ఆవిర్భవించును. ఈయననే యజ్ఞపురుషుడు, కాలపురుషుడుగా కూడా వ్యవహరిస్తారు. ఈ యజ్ఞపురుషుడి నుండే మానవుడు సృష్టించబడెను

…శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement