Saturday, November 23, 2024

బ్రహ్మ స్వరూపిణి ప్రకృతి!

త్రిలోక సంచారి అయిన నారదమహర్షి ఒకసారి కైలాసమునకు వెళ్ళి పర మ శివుని పరిపరి విధముల కీర్తించెను. అంత త్రినేత్రుడు సంతసించి, తన దివ్యదృష్టితో నారదుని ఆగమమును గ్రహించి అనుగ్రహించెను. బ్రహ్మతత్త్వమును గూర్చి కొన్ని ప్రశ్నలు అడుగుటకు అనుజ్ఞకోరి అత్యున్నతమై న ప్రశ్నలను అడిగెను. సర్వేశ్వరా బ్రహ్మము సాకారమా? నిరాకారమా? ఆయ నకు ఏమైనా విశేషణములు కలవా? లేక ఆయన నిర్విశేషుడా? బ్రహ్మమును కన్నులో చూడగలమా? బ్రహ్మము సమస్త దేహధారులయందు లిప్తుడా? లేక నిర్లిప్తుడా? ఆయన యొక్క సర్వలక్షణములను వర్ణించి చెప్పుము. వేదములం దు బ్రహ్మ ఎటుల నిరూపించబడెను? ప్రకృతి బ్రహ్మము కంటే అధికమా? లేక ప్రకృతి బ్రహ్మ స్వరూపిణియా? వేదముల యందు ప్రకృతి లక్షణములు ఏ విధ ముగ వర్ణింపబడెను? సృష్టికార్యమున బ్రహ్మ, ప్రకృతి ఇరువురిలో ఎవరు ప్రధానులు? అని వినయముగా అడిగి అంజలి ఘటించి నిలిచెను.
పరమశివుడు పరమాద్భుతమైన నారదుని సందేహములు విని పంచము ఖుడై దరహాసము చేసి తన ప్రవచనమును ప్రకటించెను. నారదా! నిగూఢమైన, జ్ఞానవంతమైన ప్రశ్నలను అడిగితివి, వేదములందు కూడా నీ ప్రశ్నలకు సూటి గా జవాబులు లభించవు. శ్రుతులను అన్వేషించి, శోధించి, మధించిన గాని నీ సందేహములు తీరవు. కావున నీకు జ్ఞానమును ప్రసాదింతును. నేను, బ్రహ్మ, విష్ణువు, ఆదిశేషుడు, ధర్మదేవత, మహా విరాట్‌ పురుషుడు, వేదములు ఈ ప్ర శ్నలకు నిరూపణ చేసితిమి. వేదములయందు దృశ్యతత్త్వములను నిరూపణ చేసితిమి. ఒకసారి వైకుంఠములో నేను, బ్రహ్మ, ధర్మదేవత శ్రీహరిని ఈ ప్రశ్న లనే అడిగితిమి. అంత శ్రీమహా విష్ణువు సర్వజ్ఞాన తత్త్వమును నివేదించెను.
సనాతన పరబ్రహ్మము పరమాత్మ స్వరూపము. ఆయన దేహధారుల కర్మములకు సాక్షీ రూపమున సమస్త శరీరములందు విరాజమానుడై నిలిచి యున్నాడు. ప్రతి ఉపాధియందు పంచప్రాణ రూపములో విష్ణువు విద్యమా నుడై ఉన్నాడు. మనోరూపమున ప్రజాపతియగు బ్రహ్మ నిలిచియున్నాడు. బుద్ధి రూపమున సంపూర్ణ జ్ఞానవంతుడనై స్వయముగా నేను ఉన్నాను. శక్తి రూపమున ఈశ్వరీ ప్రకృతి నిలిచియున్నది. మేమందరమూ పరమాత్మకు ఆధీనులమే! శరీరములందు పరమాత్మ ఉన్నంత కాలము మేము ఉండెదము. ఆయన వెడలిపోయిన మేము కూడా సేవకుల వలె ఆయనను అనుసరించి ఉపాధులను వీడిపోయదము. జీవుడు పరమాత్మ యొక్క భాగము, ప్రతిబింబ ము. జీవుడే కర్మఫలమును అనుభవించును. అనేక జలపాత్రల యందు సూర్యచంద్రులు ఎటుల అనేకములుగా కనబడునో, అటులనే జీవులయందు పరమాత్మ కనబడుచున్నాడు. పాత్రలయందు జలము తొలగినచో తిరిగి సూర్యచంద్రులు ఒక్కటిగా మిగిలియుందురు కదా! అటులనే సృష్టికాలమం దు పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపముగా జీవులు ఉద్భవించును. జీవుల వివిధ ఉపాధులు అనగా దేహములు పంచభూతమయము కాగా తిరిగి జీవులు పరమాత్మయందు లీనమగును.
మాతోగూడ ప్రళయకాలమున సర్వచరాచర విశ్వములు పరమాత్మ యందే లీనమగును. ఆ పర్రబహ్మము మండలాకార జ్యోతి:పుంజ స్వరూప ము. కోటానుకోట్ల సూర్యుల ప్రకాశమునకు అది సమానము. ఆ జ్యోతి:పుంజ ము మహావిస్తృతము, సర్వవ్యాపకము, నిత్యము. యోగులు మాత్రమే ఆ తేజ మును దర్శించి భరించగలరు వారు దానిని సనాతన పరబ్రహ్మముగా భావిం చి పూజించుచున్నారు. అది అనగా ఆ పర్రబహ్మ స్వరూపము సర్వమంగళక రమైనది, సత్యస్వరూపమైనది. ఆ పరమాత్మ నిరాకారుడు, నిరీహుడు, సర్వే శ్వరుడు. ఆయన ఇచ్ఛానుసారము రూపములను ధరించగలడు. ఆయన సర్వస్వతంత్రుడు, సర్వకారణకారణుడు, పరమానంద స్వరూపుడు, ఆనంద మునకు ఏకైక ప్రాప్తి హేతువు, సర్వోత్కృష్ణుడు, ప్రధాన పురుఫుడు, పురుషోత్త ముడు, ప్రాకృత గుణరహితుడు, ప్రకృతికి అతీతుడు, సర్వబీజ స్వరూపిణి అయిన ప్రకృతి ప్రళయ సమయమున ఆయనయందే లీనమగును. త్రిగుణ ప్రకృతి ఆ పరమాత్మయందే ఉత్కృష్ట ఛాయరూపిణిగా అంగీకరించబడియు న్నది. బ్రహ్మము ప్రకృతితోనే సృష్టి నిర్మాణ సమర్థుడు కాగలడు. ఏ విధముగ కుమ్మరి మట్టిని సృష్టి చేయలేడో, ఏ విధముగ స్వర్ణకారుడు సువర్ణమును సృష్టించలేడో అదేవిధముగ సృష్టియందు బ్రహ్మమునకు, ప్రకృతికి సమాన ప్రాధాన్యత కలదు. మట్టి, సువర్ణములు లేకుండా కుమ్మరి, స్వర్ణకారుడు లేన ట్లు బ్రహ్మము, ప్రకృతి ఇరువురు పరస్పర ఆధారులు. కానీ బ్రహ్మము లేకుండా ప్రకృతికి ఆకృతి ఏర్పడదు. అందువలన బ్రహ్మము ప్రకృతికి అతీతుడని నిర్ణ యించినాడు. బ్రహ్మమే సర్వుల యొక్క ఆత్మ, నిర్లిప్తము, సర్వసాక్షి, సర్వవ్యా పకము, ఆదికారణముగా ఉన్నది. సర్వబీజ స్వరూపిణి అయిన ప్రకృతి బ్రహ్మ ము యొక్క శక్తిగా భావించుము. వీరిరువురూ అభిన్నులు. అయితే బ్రహ్మము తేజస్వరూపుడై వెలుగొందుచున్నాడు. మండలాకార తేజ:పుంజము మధ్య పరమాత్మ అనిర్వచనీయమైన విస్తృతితో నెలకొని ఉన్నాడు. అచ్చటి నుండియే పరమాత్మ అనేక అవతారరూపములతో ఈ సృష్టి ప్రహేళికలో పాల్గొనుచున్నా డు. అల్పజీవులు సంసార సాగరములో పరిభ్రమించుచుందురు. యోగులు మాత్రము సత్యరూపమును దర్శించి తరించుచున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement