Wednesday, November 27, 2024

నర్మదాయైనమ:

తే. అంబ నీదివ్యనామధేయముఁజతుర్థి
నమరఁజేసినమ:పదాంతముగనుభయ
సంధ్యలందునుదప్పకస్మరణసేయు
నతనికెన్నఁడువిషమెక్కదహుల వలన.
(శ్రీవిష్ణుపురాణము, పంచమాశ్వాసం, 215)

నర్మదానది నామస్మరణ ప్రభావాన్ని గురించి ఈ పద్యంలో చెప్పబడింది. నర్మద పేరును చతుర్థీ విభక్తిలో చివరన నమ: చేర్చి ‘నర్మదాయైనమ:’ అని ప్రతి రోజు ఉభయ సంధ్యలలో స్మరణ చేస్తే అహుల వలన అనగా సర్పముల వలన కలిగే విష ప్రభావాన్నుండి రక్షించబడతాడని పురాణవచనం. భోజన సమయంలో నర్మద పేరును స్మరించుకుంటే విషాహారం తినడం వలన కలిగే ప్రమాదాన్నుంచి కూడా రక్షణ లభిస్తుందని ఈ పద్యం తరువాత వచ్చిన వచనంలో చెప్పబడింది.
పురాణ ప్రఖ్యాతి వ‌హించిన ఇక్ష్వాకు వంశంలో మాంధాత తరువాత, అంత పేరు పొందిన రాజు పురుకుత్సుడు. ఒక సందర్భంలో అంగిరసులనే ఆరుకోట్ల గంధర్వులు ఒక్కుమ్మడిగా వెళ్ళి నాగలోకాన్ని ముట్టడించారు. వారి సంపదలో భాగమైన అనేకానేక దివ్యరత్నములను, ఆ రత్నములకంటె విలువలో మిన్నలనిపించుకునే సౌందర్యవతులైన నాగనారీరత్నములను అపహరించి నాగలోకాన్ని ఆక్రమించి, నాగులు అక్కడినుండి పారిపోయేలా చేసారు. ఊహించని ఆ పరిణామానికి భయంతో వణికిపోయిన భుజగతతులు, మరి వేరే దారి కనపడక, వెంటనే విష్ణుమూర్తి వద్దకువెళ్ళారు. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిని బహువిధాలైన గాంధర్వ గానాలతో కీర్తించారు. ఆ గానానికి ఆనందించి, యోగనిద్రనుండి కనులు విచ్చి చూసిన విష్ణుమూర్తికి, నాగముఖ్యులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అంతా విన్న విష్ణుమూర్తి, వారిని వెంటనే వెళ్ళి భూలోకంలో తన అంశతో విరాజిల్లుతున్న ఇక్ష్వాకు చక్రవర్తియైన పురుకుత్సుడిని కలవమని, అతడి వలననే వారికి మేలు జరుగుతుందని చెప్పి పంపించాడు. తిరిగి తమ లోకానికి చేరుకున్న నాగ ప్రముఖులు ఒక చోట సమావేశమై, శ్రీమహావిష్ణువు చెప్పినట్లు పురుకుత్సుడిని కలిసే ప్రయత్నంలో ఉండగా, సంగతి తెలిసిన ఒక మునిపుంగవుడు వారి వద్దకు చేరి, పురుకుత్సుడు నర్మదానదియందుబద్ధానురాగుడై ఉన్నాడు కాబట్టి, నర్మదానదికి కూడా పురుకుత్సుడిపై వలపు ఉన్నది కాబట్టి, ఆమెను ఆశ్రయించి ఆమెద్వారా కార్యం సాధించుకొమ్మని ఉపాయంచెప్పాడు. దైవవశంగా సరిగ్గాఆ సమయానికి నాగలోకానికి వచ్చిన నర్మదతో, నాగప్రముఖులు అప్పటి వరకు జరిగినదంతా చెప్పి ‘నీవు మాకు ఈ ఉపకారం చేస్తే, మేము కూడా నీకు దీనికి సాటిదైనప్రత్యుపకారం చేస్తాము’ అని మాట ఇచ్చి ప్రార్థించారు. అంగీకరించిన నర్మద మానవ రూపంలో భూలోకానికి వచ్చి, తన అనురాగంతో పురుకుత్సుడిని ఆనందపరిచి, తనతోపాటు నాగలోకాని తీసుకుని వెళ్ళింది. నాగ ప్రముఖులు పురుకుత్సుడిని తగిన విధంగా పూజించి, ఆరాధించారు. సంతోషించాడు పురుకుత్సుడు. ఆ తరువాత జరిగిన యుద్ధంలో పురుకుత్సుడి చేతిలో గంధర్వులు పరాజయం పాలయ్యారు. నాగలోకం ఊపిరి పీల్చుకుని, పూర్వ వైభవాన్ని తిరిగి పొందింది. ఆ ఆనందంలో, ముందుగా మాట ఇచ్చిన ప్రకారంగా, భుజగప్రముఖులు నర్మదకు పైన చెప్పిన రెండు వరాలను ఇచ్చారు. వెన్నెలకంటి సూరనరచనయైన శ్రీవిష్ణుపురాణం, పంచమాశ్వాసంలో 18 పద్యాలు, 2 గద్యలలో చెప్పబడిన ఆసక్తికరమైన విషయానికి ఇది వచనరూపం.

  • భట్టు వెంకటరావు
Advertisement

తాజా వార్తలు

Advertisement