Saturday, November 23, 2024

నాగనాథ జ్యోతిర్లింగము

శ్లో॥ యామ్యే సదంగే నగరేతి రమ్యే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః”
సద్భక్తిముక్తి ప్రదమీశమేకం
శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే ॥

భావము: దక్షిణదిక్కున (యామ్యే) ఉన్న అతిరమ్యమైన నగరములో అనేక పడగలతో అలకరింపబడిన శరీరమును కలిగి, మంచి భక్తి ముక్తులను యిచ్చు నాగనాథుని శరణుపొందుచున్నాను. (అమ్మవారు నాగేశ్వరి)

పురాణగాధ: (శివపురాణమునుండి)
ఒకప్పుడు దారుకుడనే రాక్షసుడు దారుక అను తన భార్యతో పశ్చిమ తీరములో పదహారు యోజనముల వనమును సకలవసతులతోను నిర్మించుకొని సుఖముగా జీవిస్తూ వుండేవాడు. ఆ దంపతుల పేరుతో ఆ వనము దారుకావనమని పిలువబడేది. దారుక దేవీ భక్తురాలు ఆమె దేవికై తపస్సుచేసి వరములను పొందింది. ఆ వర ప్రభావంతో వారి నివాసమైన దారుకావనమును వారు ఎక్కడకు వెళ్ళాలనిపిస్తే అక్కడకు తీసికొని పోతూవుండేవారు. రాక్షస సహజమైన యజ్ఞయాగాదులను ధ్వంసముచేయుట, ప్రజలను నానారకములుగా హింసించుటయనునవి వరగర్వంతో విచ్చలవిడిగా చేసేవారు. వారి బాధలను భరించలేక ప్రజలు, మునులు ఔర్వమహర్షి వద్దకు వెళ్ళి తమను రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్థించారు. మనసు ద్రవించిన ఔర్వమహర్షి “భూమిపై గల మునులను, ప్రజలను హింసిస్తే ఆ రాక్షసులు వెంటనే నశిస్తారు”. అని శపించాడు. ఆ శాపము విషయము తెలిసిన ఆ రాక్షదంపతులు తమ దారుకావనమును సముద్రములో ఒక ప్రాంతమున స్థాపించుకొని, భూమిపై నున్న వారిని హింసించ వలనుపడదు కావున సముద్రముపై ప్రయాణించు వారిని హింసించ మొదలు పెట్టారు. ఓడలను కొల్లగొట్టి అందలి మనుష్యులను తినగలిగినందరిని తిని మిగిలిన వారిని తమ బందీలుగా చెరసాలలోనుంచేవారు. అందుచేత వారి ఆహారమునకెట్టి లోటును కలుగుటలేదు. పడమటి సముద్రము (అరేబియా మహాసముద్రము) లో ఓడలలో ప్రయాణించు వారికే ఆపదయెప్పుడు వస్తుందోనని భయముతో గడగడ లాడేవారు.

ఒక రోజు ఆ రాక్షస దంపతులకు చిక్కిన ఓడలో చాలామంది వ్యాపారులు (వైశ్యుల), సరంగులు, ఇతర పనివారు ఉన్నారు. వారందరినీ చెరసాలలో వుంచారు. వారిలో ‘సుప్రియుడు’ అనే వైశ్యుడు గొప్ప శివభక్తుడు. అతడు తనకు వచ్చిన ఆపదకు చింతించక పరమేశ్వర ధ్యానంలో గడుపసాగాడు. చేయునదిలేక, తమ ప్రాణాలు నెప్పుడు తీస్తారో తెలియక మిగిలిన ఖైదీలు కూడ సుప్రియునితోబాటు ఈశ్వర నామ జపం, భజనలు చేయడం మొదలు పెట్టేరు. చెరసాలకు కాపలాగా నున్న రాక్షసులు గోల చేయవద్దని, భజనలను మానమని యెంత చెప్పినా వారు వినక పోవడంచేత ఆ కావలివారు వెళ్ళి ఆ విషయమును రాక్షస దంపతులకు చెప్పేరు. దానికి వారు కోపంతో వచ్చి ఖైదీలను నానారకములుగా హింసించడం మొదలు పెట్టేరు. ‘సుప్రియుడు’ అదేమీ పట్టించుకొనక శివనామమందే జపిస్తున్నాడు. ఉన్నట్లుండి అక్కడ నాలుగు దిక్కులకు నాలుగు ద్వారములతో, మధ్యన ఒక లింగముతో నున్న దేవాలయములాగా మారిపోయింది. ఆ జైలు గది-శివలింగమును చూడగానే సుప్రియుడు అమితానందముతో వెళ్ళి దానిని కౌగలించుకొని శివనామ జలో తన్మయుడైపోయాడు. అపుడా శివలింగము నుండి శివుడు వచ్చి ఆ రాక్షసులను సంహరించి భక్తులను కాపాడాడు. “ఇక నుండి ఈ దారుకావనం వర్ణాశ్రమ ధర్మాలతో వర్ధిల్లుతుంది” అని వరమిచ్చాడు.

దేవీ భక్తురాలైన దారుక దేవిని ప్రార్థించి తనను, తన (రాక్షస) వంశమును కాపాడమని ప్రార్థించింది. ఈ సందర్భంగా పార్వతీపరమేశ్వరులలో అభిప్రాయ భేదాలు తలయెత్తాయి. చివరకు ఆ పురాణ దంపతులు సమాధానపడి, “ఆ దారుకా వనం ఒక యుగ కాలము రాక్షసుల అధీనములో నుండేటట్లును, ఈ లోపల వర్ణాశ్రమ ధర్మాలను పాటించువారెవరు వచ్చినా వారికి ఆపద కలుగకుండునట్లును, నాగేశ్వరుడు (నాగనాథుడు) అనే పేరుతో అక్కడ వెలసిన ఆ జ్యోతిర్లింగమును అర్చించిన వారికి రాజసమాన భోగభాగ్యములు కలుగునట్లును వరమిచ్చారు.

- Advertisement -

ఆ యుగాంతంతో ‘వీరసేనుడు’ అనే రాజు అక్కడకు చేరి, భక్తితో శివుని అర్చించి నాగేశ్వరుని ప్రసాదముగా పాశుపతాస్త్రమును సంపాదించి, దానితో దారుకా (రాక్షస) వంశమును నాశనం చేశాడు. ఆ వీర సేనుని కుమారుడే నలచక్రవర్తి. ఈ పవిత్ర క్షేత్రము నేడు ‘నాగనాథ్’, ‘నాగేశ్వర్’ అను పేర్లతో పిలువబడుతూ గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ సముద్రతీరంలోని ‘ద్వారక’కు సమీపంలో ఒక చిన్న దీవిలో వున్నది.

చరిత్ర: ఈ క్షేత్రమును గూర్చిన చారిత్రక విశేషాలేమీ అంతగా లేవు. చాళుక్యులు, గూర్జరులు మొదలగు వారి పాలనలో అభివృద్ధి చెందినా, మత ఛాందసుడైన ఔరంగ జేబు దాడులతో శిధిలమయ్యింది. తర్వాతి కాలంలో భక్తుల నిరంతర కృషితో పునరుద్ధరింపబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement