చంద్రవంశంలోని అవాంతర వంశకర్తలలో ఒకడైన కురు మహారాజు దిగ్విజ యార్థం కురుక్షేత్రంలో సర్వస్వ దక్షిణతోడి విశ్వజిద్యాగాన్ని చేశాడు. వసిష్ఠ మహర్షి సరస్వతిని ఆవాహన చేశాడు. ఆ దేవి ”ఓఘవతి” పేరిట నైమిశానికి నిమ్న గా రూపంలో వచ్చి ప్రవహంప సాగింది. సకల ధర్మతత్త్వకోవిదుడైన కురు పితామహు డు భీష్ముడు భారత యుద్ధంలో శస్త్రాస్త్ర సన్న్యాసం చేసి నేలకొరిగి నచోటు ఇదే.
”పితామహా! ఎటువంటి ధర్మాన్ని చేయడం వలన మామూలు గృహస్థు కూడా మృత్యువును జయించవచ్చని?” యథాతథంగా వివరించమని భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. దానికి భీష్ముడు- ”ధర్మజా! గృహస్థు కేవలం ధర్మాన్నే ఆశ్రయించి మృత్యు వును జయించిన ఒక పురాతన కథను తెలియజేస్తాను’ విను.
”ప్రజాపతియైన మనువుకు ఇక్ష్వాకుడనే పుత్రుడు కలిగాడు. సూర్యతేజస్సు కలిగి న ఇక్ష్వాకుడికి వందమంది పుత్రులు కలిగారు. వారిలో పదవవాడైన దశాశ్వుడు, ఎంతో ధర్మాత్ముడు, మాహష్మతీ పురాన్ని పరిపాలించేవాడు. అటువంటి దశాశ్వునికి ఒక పుత్రు డు జన్మించాడు. అతడు పరమధార్మికుడు. ఈ భూమండలంలో అతడు మదిరాశ్వుడ నే పేరుతో ప్రసిద్ధి జెందాడు. అటువంటి మదిరాశ్వుని కుమారుడే ద్యుతిమంతుడు. ఇత డు మహాతేజస్వి, బలశాలి. ద్యుతిమంతుడి పుత్రుడు సమీరుడు. ఇతడు సర్వలోకాలలో ప్రసిద్ధుడు. మరొక దేవేంద్రుడి వలె ధనసంపన్నుడు, ధర్మాత్ముడు కూడా. ఈ సమీరుడి కి దుర్జయుడు జన్మించాడు. ఇతడు అన్ని యుద్ధాలలో ఇతరులకు నిజంగా దుర్జయుడే. ఇంద్రుడి వంటి దుర్జయుడికి అశ్వినీదేవతలవంటి తేజస్సుతో, ఇంద్రుడితో సమానమైన పరాక్రమంగల దుర్యోధనుడనే రాజర్షి శ్రేష్ఠుడు పుత్రుడిగా జన్మించాడు. యుద్ధాలలో ఎప్పుడూ వెనుతిరగని ఆ రాజు రాజ్యంలో, ఇంద్రుడు చక్కగా వర్షాలు కురిపించేవాడు.
ఆ దుర్యోధన మహారాజు పరాక్రమశాలి, వేదవేదాంగ పారంగతుడు, యజ్ఞకర్త, బ్రాహ్మణ భక్తుడు. దుర్యోధనుడిని, చల్లనినీటితో ప్రవహంచే పరమపావనియైన నర్మ దానది మానవ రూపం ధరించి, ప్రేమించి పెళ్లి చేసుకుంది. దుర్యోధన నర్మదా దంపతు లకు పద్మాక్షియైన సుదర్శన అనే పుత్రిక కలిగింది. పేరుకు తగినట్లు నిజంగా ఆమె సుద ర్శనయే. ఆ సుదర్శనను అగ్నిదేవుడు ప్రేమించాడు. అగ్ని బ్రాహ్మణ రూపం ధరించి, ఆ అమ్మాయిని ఇమ్మని రాజును అడిగాడు. ఇతడు సవర్ణుడు కాదని భావించిన రాజు తన కుమార్తెను విప్రుడికి ఇవ్వలేదు. దాంతో, రాజు చేస్తున్న యజ్ఞం నుండి అగ్ని అంతర్ధాన మయ్యాడు. అప్పుడు బాధపడిన రాజు ‘బ్రాహ్మణోత్తములారా! జరిగిన పొరపా టు ఏమిటి? అగ్నిదేవుడు ఎందుకు అదృశ్యమయ్యాడు? ఏమి జరిగిందో తెలియజే యండని ప్రార్థించాడు దుర్యోధనుడు. బ్రాహ్మణులు రాజుగారి ఆజ్ఞతో, అగ్నిహోత్రుడి శరణువేడగా, బ్రాహ్మణుల ముందు ప్రత్యక్షమయ్యాడు అగ్నిదేవుడు. అప్పుడు మహా త్ముడైన అగ్నిహోత్రుడు బ్రాహ్మణులతో ‘నేను దుర్యోధనుడి పుత్రికను వరిస్తున్నానని’ చెప్పాడు. బ్రాహ్మణులు మహారాజుకు అగ్నిదేవుడి అభిప్రాయాన్ని తెలియజేశారు. మహారాజు వివాహాన్ని ఆమోదించాడు. దుర్యోధనుడి అభ్యర్థనను అగ్నిదేవుడు ఆమో దించాడు. పాండవులలోని సహ దేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రకు వెళ్లినప్పుడు మాహష్మతీపురంలో అగ్నిని ప్రత్యక్షంగా చూశాడు. తరువాత, తన కూతురు సుదర్శన ను మహానుభావుడైన అగ్నిహోత్రు డికి సమర్పించాడు దుర్యోధనుడు. అగ్నిహోత్రుడు సుదర్శనను స్వీకరించాడు. అలా, సుదర్శన వలన అగ్నిదేవుడికి ఒక పుత్రుడు కలిగాడు. అతడికి సుదర్శనుడు అని పేరు పెట్టారు. రూపంలో పూర్ణచంద్రుడిని పోలిన సుదర్శను డు బాల్యంలోనే సనాతన పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. అప్పట్లో, నృగమహారాజు పితామహుడైన ఓఘవంతుడనే రాజు రాజ్యం చేస్తుండే వాడు. ఆయనకొక కూతురు, ఒక కొడుకు ఉండేవారు. కూతురి పేరు ఓఘవతి, కొడుకు పేరు ఓఘరధుడు. ఓఘవంత మహారాజు కుమార్తె ఓఘవతిని సుదర్శనుడికిచ్చి వివాహం చేశారు.
‘నేను గృహస్థాశ్రమంలో ఉండగానే మృత్యువును జయిస్తానని’, అందులో భాగం గా, తన భార్యతో ‘సుందరీ! గృహస్థులకు అతిథే భగవంతుడు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మన ఇంటికి వచ్చిన అతిథికి ప్రతికూలంగా ప్రవర్తించరాదని, అతి థి దేనివలన సంతోషిస్తాడో దానిని అర్పించాలని, చివరకు నిన్ను నువ్వు అర్పించుకుం దుకు కూడా సందేహంచవద్దని’, ఓఘవతితో మాట తీసుకుంటాడు సుదర్శనుడు.
దానికి ఓఘవతి అంగీకరించింది. గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్న సుదర్శనుడిని జయించాలనుకున్న మృత్యువు, అతడిలో లోపాలను వెతుకుతూ అతడి వెన్నంటే తిరు గుతూంది. కొంతకాలానికి, సుదర్శనుడు సమిధలకు అడవికి వెళ్లాడు. అప్పుడు, ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ‘ఈరోజు ఆతి థ్యాన్ని స్వీకరించడానికి వచ్చానని’ ఓఘ వతిని అడిగాడు. ఆ రాజకుమారి అతడికి అర్ఘ్య పాద్యాదులను అర్పించి, భక్తితో ‘మీకేమి కావాలి?’ అడిగింది. ఆమె అందానికి ముగ్ధుడై న అతిథి, ‘నీవే కావాలి, సందేహంచకు. నీకు గృహస్థాశ్రమ ధర్మం సమ్మతమైతే, నా ముచ్చట తీర్చమన్నాడు’ బ్రాహ్మణుడు. ”మహా నుభావా! తమరు వేరే కోరిక ఏదైనా కోరండి” అంది. వచ్చిన అతిథి, ఆమె శరీర దానాన్ని తప్ప మరే వరాన్ని కోరుకోలేదు. అలాగే ఆలోచిస్తూ, భర్త మాటలు గుర్తుకు తెచ్చుకొని, సంశయిస్తూనే భగవంతుడిపైన భారం వేసి అతడి కోరికకు అంగీకరించింది.
అగ్నిపుత్రుడు సుదర్శనుడు సమిధలను తీసుకొని ఇంటికివచ్చాడు. తప్పు చేస్తే అం తం చేద్దామని, నిరంతరం అతడి సమీప బంధువు వలె వెంటనంటే ఉంది మృత్యుదేవ త. సుదర్శనుడు- ఓఘవతిని పిలిచాడు ఆ సమయంలో ఓఘవతిని బ్రాహ్మణుడు చేతు లతో పట్టుకొని ఉన్నాడు. అందువలన, భర్త పిలుస్తున్నా నోరు విప్పలేకపోయింది. సుద ర్శనుడు మళ్లిd- పర్ణశాలలోకి తొంగిచూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. అప్పుడు పర్ణ శాలలోని ఆ అతిథి సుదర్శనుడితో- ‘అగ్నిపుత్రుడా! సజ్జన శ్రేష్ఠా! నీ భార్య అతిథి సత్కా రాల ద్వారా నా కోరిక తీర్చడానికి సిద్ధపడింది. ఇప్పుడు నీకు మరేదైనా పని ఉంటే, దాని ని చేసుకొనవచ్చని’ అన్నాడు అతిథి. మాట తప్పితే, సుదర్శనుడిని అక్కడే అంతంచేద్దా మని ఆలోచిస్తూ లోహదండాన్ని చేతిలో పట్టుకుని సుదర్శనుడిని వెన్నంటే ఉంది మృ త్యుదేవత. సుదర్శనుడు మనస్సులో, చేతలో, చూపులో, మాటలో ఈర్ష్యను, కోపాన్ని ప్రదర్శించకుండా నవ్వుతూ- వచ్చిన అతిథిని పూజించడమే గృహస్థుడికి ప్రథమ ధర్మం. గృహ స్థుడి ఇంటికి వచ్చిన అతిథిని పూజించుటకంటే, ఉత్తమ ధర్మము ఇంకొక టిలేదని’ విజ్ఞులు చెప్పారు. బ్రాహ్మణా! నేను చెప్పిన ఈ మాటలలో ఎలాంటి సందేహం లేదు, సత్యప్రమాణంగా చెప్తున్నాను. పృథివి, వాయువు, ఆకాశం, నీరు, నిప్పు, బుద్ధి, ఆత్మ, మనస్సు, కాలం, దిక్కులు- ఈ పదిప్రాణులు శరీరంలో ఉంటూ, వారాచరించు పుణ్యకర్మలను పరిశీలిస్తుంటాయి. ఈరోజు నేను చెప్పిన మాటలు సత్యమైతే దేవతలు నన్ను తప్పక రక్షిస్తారని, అనుకున్నాడు సుదర్శనుడు. అప్పుడు అన్ని దిక్కులలో, ‘ఇది సత్యం, అబద్దం కాదు, ఇది సత్యం’ అని ఆకాశవాణి పలికింది. ఇంతలో, పర్ణశాలలో నున్న బ్రాహ్మణ అతిథి వెలుపలికి వచ్చి, అద్భుతమైన తేజంతో సాక్షాత్కరించా డు.’సుదర్శనా! నేను ధర్మదేవతను. నీకు మేలు కలగాలి. నీ మనసు ఎలాంటిదో తెలు సుకోవడానికి వచ్చాను. నీ సత్యాన్ని తెలుసుకొని ఎంతో ప్రసన్నుడనయ్యాను. నువ్వు ఎప్పుడు ధర్మం తప్పుతావో! అప్పుడు నిన్ను అంత మొందించాలని మృత్యువు నీ వెంటనే పొంచి ఉంది. అయితే, నువ్వే మృత్యువును జయించావు. ఈ రాజకుమారి ఓఘ వతి కూడా నీ శుశ్రూషతో మోహాన్ని గెలిచిందని’ చెప్పి ధర్మదేవత అంతర్ధానమయింది.
ఈవిధంగా సుదర్శనుడు అతిథి సేవతో మృత్యువును, లోకాలను, తనను, పంచభూతాలను, బుద్ధినీ, కాలాన్ని, మనస్సును, ఆకాశాన్ని, కామక్రోధాలను జయిం చాడు.” చెప్పి ముగించాడు భీష్మ పితామహుడు.
నదీమతల్లి…ఓఘవతి
Advertisement
తాజా వార్తలు
Advertisement