Saturday, November 23, 2024

ముక్తిదాయకం… పుష్కర స్నానం

ప్రతి నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులపాటు పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దేవగురువు బృహస్పతి మేషరాశిలో ఉన్నప్పుడు గంగానదికి, వృషభరాశిలో- నర్మదా నదికి, మిధునరాశిలో- సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో – యమునా నదికి, సింహ రాశిలో- గోదావరి నదికి, కన్యా రాశిలో- కృష్ణా నదికి, తులారాశిలో- కావేరి నదికి, వృశ్చిక రాశిలో- తామ్రపర్ణి నదికి, ధనూరాశిలో – బ్రహ్మపుత్రకు, మకరరాశిలో- తుంగభద్రా నదికి, కుంభరాశిలో- సింధు నదికి, మీనరాశిలో- ప్రణీతానదికి పుష్కర శోభ చేకూరుతుంది. శుభకృత్‌ నామ సంవత్సర చైత్రశుద్ధ ద్వాదశి బుధవారము 13.04.2022 నుండి 24.04.2022 వరకు ప్రణీత నదికి పుష్కర కాలము ఆచరించబడుతుంది. గోదావరి ఉపనదుల్లో ప్రాణహిత ప్రముఖమైనది. ఈ నది మహారాష్ట్రలోని విదర్భ, సత్పురాశ్రేణుల దక్షిణ వాలుల్లో ప్రవహిస్తోంది. వైన్‌ గంగ, పైన్‌ గంగా, వర్ణానది మూడు నదులు మహా రాష్ట్రలోని ఆస్తి అనే గ్రామం గుండా ప్రవహించి తెలంగాణలోని ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హట్టి గ్రామంలో ప్రాణహిత జన్మించింది. బెజ్జూర్‌ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి, వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి, కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరిదారం, దేవల మర్రిచెట్టులో వెలిసిన వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రమైన తోగుల వెంకటాపూర్‌ మీదుగా రేగుంట, కొత్తూర్‌, తేకడా, గిలాస్పేట, రాయి పేట, రంగాయపల్లి మీదుగా భూపాలపల్లి జిల్లా పరమేశ్వరుని పుణ్యక్షేత్రమైన కాళే శ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. ఈ తీరంలో ప్రణీత మహర్షి తపస్సు చేయడం వల్ల ప్రణీత అనీ, తీరం వెంబడి అడవిలో ప్రాణు లు ఏ కొరతా లేకుండా మనుగడ సాగిస్తుండటంతో ప్రాణహిత అనీ పిలుస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు.. గడ్చి రోలి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫా బాద్‌ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి.
పుష్కరాలకు వేదిక కాళేశ్వరం
కాళేశ్వర క్షేత్రం గోదావరి, ప్రాణహిత, సరస్వతి (అంతర్వాహని) నదులు కలిసే ప్రాంతమైనందున త్రివేణీ సంగమంగా ప్రసిద్ధి చెందింది. బహువిధ ప్రత్యేకతలకు నిలయం కాళేశ్వరంలో పుష్కర శోభ వెల్లివిరుస్తోంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ”తెలుగు” పదం రూపు దిద్దుకున్నదని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు మహారాష్ట్ర ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేలోని శైవక్షేత్రాలైన శ్రీశైలం మల్లికార్జు నుడు, ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు, కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వరులు మహమాన్వితులు. దేశంలో సరస్వతీ ఆల యాలు మూడు మాత్రమే ఉండగా, ఆదిలాబాద్‌ జిల్లాలోని ‘బాసరలో జ్ఞాన సరస్వతి, ‘కాశ్మీర్‌స‌లో బాలసరస్వతితో పాటు ‘కాళేశ్వరం’లో మహా సరస్వతి ఉన్నాయి. అలాగే సూర్య దేవాలయాలు మూడే ఉంటే వాటిల్లో ఒరిస్సాలో ‘కోణార్క్‌’, శ్రీకాకుళంలో ‘అరిసెవెల్లి’ కాళేశ్వ రం’ ఒకటిగా ఉంది. కాళేశ్వరం బ్రహ్మతీర్ధం, నరసింహ తీర్థం, హనుమత్‌ తీర్థం, జ్ఞాన తీర్ధం, వాయు తీర్థం, సంగమ తీర్థాదులకు నెలవై ఉంది. కాళేశ్వర ప్రధానాలయంలో ఒకే పానవట్టం పైన కాళేశ్వర, ముక్తీశ్వరులు వెలసి ఉండగా, ముక్తీశ్వరునికి రెండు నాసి కా రంధ్రాలున్నాయి. ఈ రంధ్రాలలో ఎంత నీరు పోసినా, పైకి రాదు త్రివేణీ సంగమంలో కలుస్తుంది. కాళేశ్వరుని ముందు పూజించి, తర్వాత ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

  • రామకిష్ణయ్య సంగనభట్ల
Advertisement

తాజా వార్తలు

Advertisement