Wednesday, November 20, 2024

తమలపాకులో ముగ్గురమ్మలు!

ఆ దేవదేవునికైనా, మన ఇంటికి వచ్చిన అతిథి దేవునికైనా తాంబూలం ఇవ్వనిదే వారికి చేసిన సకలోపచారాలూ సంపూర్ణం కావు. ఈ తాంబూల సమర్పణ వెనుక ఉన్న మన పూర్వుల అసామాన్యమైన ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన దూరదృష్టి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. లేత తమలపాకులు, తాజా సున్నము, సుగంధభరిత వక్కపొడి, పచ్చ కర్పూరం, యాలకులు, కుంకుమపువ్వు, కస్తూరి, కొబ్బరి తురుము వంటివి తాంబూలంలో ఉండే ప్రాథమిక వస్తువులు. ఇవి కాకుండా యథాశక్తి దక్షిణ, పండ్లు, వస్త్రాలు వంటివి కూడా చేర్చబడుతూ ఉంటాయి. ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో రవికెల గుడ్డ, గాజులు, సౌభాగ్య ద్రవ్యాలు (కాటుక, దువ్వెన, అద్దము, పసుపు కుంకుమల వంటివి) ఉంచుతారు. శుభకార్యాలలో నారికేళం(కొబ్బరి కాయ)తో తాంబూలం ఇవ్వడం సంప్రదాయంగా పాటించబడుతూ ఉంది. ఎముకలకు మేలుచేసే కాల్షియం, ఫోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ ‘ఎ’ మరియు ‘సి’ వంటివి తాంబూల సేవనం ద్వారా మనకు పుష్కలంగా లభిస్తాయి.
భగవంతునికి సమర్పించే తాంబూలంలో మూడు తమలపాకులు, రెండు వక్కలు, సున్నం ఉంచాలి. అతిథులకిచ్చే తాంబూలంలో రెండు తమలపాకులు, మూడు వక్కలు, సున్నం ఉండాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకుల తొడిమలు మనవైపు ఉండేలా అమర్చుకొని ఇవ్వాలి. ఒంటి వక్క, ఒంటి పండు తాంబూలంలో పెట్టరాదు. రెండు లేదా మూడు వక్కలు, పండ్లు అందులో ఉంచాలి. తమలపాకులను నీటిలో కడిగి, తుడిచి శుభ్రపరచి ఉంచాలి. లక్ష్మి, పార్వతి, సరస్వతి అనే ముగ్గురమ్మలు తమలపాకులో నివసిస్తారని, తాంబూలం ఇచ్చేవారిని, పుచ్చుకొనే వారిని కూడా ఆ ముగ్గురమ్మలు దీవిస్తారని ఒక నమ్మకం.
ప్రతి శుభకార్యంలో తొలుత కలశ స్థాపన చేస్తారు. కలశానికి మూడు లేదా ఐదు తమలపాకులను కలశం యొక్క అగ్రభాగంలో ఉంచుతారు. తమలపాకులను కంకణాలుగా కూడా కట్టుకొంటారు. తమలపాకులను సంస్కతంలో నాగవల్లి అని, అమృతవల్లి అని అంటారు. ఆంజనేయస్వామికి ఆకు పూజ చాలా ప్రీతికరం. శతపత్ర పూజ పేరుతో వంద తమలపాకులతో భగవంతుని అర్చిస్తారు. వివిధ వ్రతాలు, నోములు, పూజలు, శుభకార్యాలలో నిర్ణీత సంఖ్యలో తాంబూలాలు ఇచ్చే సంప్రదాయమూ ఉంది.
తమలపాకుకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గొంతునొప్పి, శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఈ ఆకుల రసం గొప్ప ఔషధం. మూర్ఛ వ్యాధి, పచ్చ కామెర్ల వ్యాధుల నివారణకు ఈ ఆకుల రసాన్ని పాలలో కలిపి త్రాగిస్తారు. నెయ్యి, ఇతర నూనెలను తమలపాకు వేసి కాచినట్లయితే ఆ నూనెలు చాలాకాలం చెడిపోకుండా ఉంటాయి. తాంబూలాలు పుచ్చుకోవడమంటే ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడమని అర్థం. అందుకే సంబంధ బాంధవ్యాలు కలుపుకొనే సందర్భాలలో తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొంటారు.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
Advertisement

తాజా వార్తలు

Advertisement