Thursday, January 16, 2025

అమ్మ మనసు

‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ’ అని వేదం చెబుతున్నది. ఐతే ఇలా ప్రబోధించే మువ్వురిలో తొలి ప్రాధాన్యతను మాత్రం అమ్మకే ఇవ్వడం విశేషం. ఎందుకంటే, నవమాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి ఓ బిడ్డకు జన్మనిచ్చిన అపర సృష్టికర్త అమ్మ గనుక. మాతృత్వం స్త్రీకి వరం. అమ్మలా భౌతికంగా పంటిబిగువున బాధను అనుభవిస్తూ సృష్టి నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆ బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. అందుకే దేవుడైనా, మరెవరైనా అమ్మకే ముందుగా పట్టం కట్టి అగ్రతాంబూలం ఇస్తారు.
అమ్మ లాలిస్తుంది, పాలిస్తుంది. అమ్మ ఆడిస్తుంది, పాడిస్తుంది. అమ్మ తినిపిస్తుంది, మురిపిస్తుంది. అమ్మ బుదరిస్తుంది, బుజ్జగిస్తుంది. అమ్మ అనిపిస్తుంది, అదలిస్తుంది. అందుకే అమ్మ ఎంతో మంచిది. అమ్మ కన్నా అపురూపమైనది, ప్రియమైనది లోకంలో ఏదీ లేదు. అమ్మ శ్రమజీవి. తెల్లారింది మొదలు నిద్రకు ఉపక్రమించేటంత వరకు యంత్రంలా పనిచేస్తుంది. తన ఆకలిదప్పులను పక్కన పెట్టి మన ఆకలి తీర్చుతుంది. మనకి ఏ లోటూ రానివ్వకుండా అల్లారుముద్దుగా పెంచుతుంది. మనకు విద్యాబుద్ధులు అందివ్వడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. నాన్నకు అన్నివేళలా చేదోడు వాదోడుగా నిలుస్తుంది. నాన్న కష్టసుఖాలలో అరమరికలు లేకుండా పాలుపంచుకుంటుంది. అమ్మ గడుసైనదే. గడుసైనది కాబట్టే ఇంటిని చక్కదిద్దగలిగింది. అమ్మకు స్వార్థం లేదు. అమ్మకు జాలి, దయ ఎక్కువ. అమ్మకు గంపెడు సంతానం. వారిలో కొడుకులు, కూతుర్లు ఉన్నారు. అందర్నీ సమానంగానే చూస్తుంది. కానీ మనమే ఆమె మనసును ఎరుగం. ఆమె అన్నకు ఒకలాగా, చెల్లికి ఒకలాగా చూస్తున్నదని ఈర్ష్యపడతాం. నన్ను పట్టించుకోవటంలేదని ఏడుస్తాం. కానీ నిజానికి అమ్మ ప్రేమలో వీశమెత్తంత తేడా ఉండదు. అమ్మను అపార్థం చేసుకోవడంలో మనమే ముందుంటాం. అందుకే సంసార జంజాటనలో పడి అమ్మను దూరం పెడతాం. తన పిల్లలను కాకుండా సోదరి పిల్లలను అమ్మ ప్రేమగా చూస్తున్నదని అపోహ పడతాం. అంతవరకూ అవ్యాజానురాగబంధాలను పెనవేసుకున్న అమ్మతో గొడవకు దిగుతాం. కానీ అమ్మ అమ్మే కదా! అందుకే అమ్మ ఎన్నడూ ఇతరుల దగ్గర కొడుకును చులకన చెయ్యదు. కొడుకు పెట్టినా, పెట్టకపోయినా నా కొడుకే మంచివాడని కితాబిస్తోంది. పట్నంలో ఉద్యోగం చేస్తున్న కొడుకు దగ్గర అమ్మ పట్టుమని పది రోజులు కూడా ఉండలేదు. ఊర్లోకి వచ్చాక అమ్మ అందరితో ఇలా చెబుతుంది. నా కొడుకు చాలా మంచోడు. నా కోడలు అంతకన్నా మంచిది. వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ నాకే పోయేకాలం. నేను అక్కడ ఉండలేను. నేనే సర్దుబాటు కాలేను. వాళ్లు నన్ను బలవంతంగా పంపేసారని! మీరు అనుకోకండి. పెరిగిన ఊరు మీద నేనే బెంగతో వచ్చేసాను. ఎంతైనా మెట్టినింట అడుగుపెట్టిన ఊరు కదా! నా భర్త పోయినా, తన జ్ఞాపకాలు నన్ను వదిలిపెట్టవు కదా! అని తనకు తాను సర్దిచెప్పుకుంటూ, ఇతరులు దగ్గర సానుభూతి పొందుతుంది. అమ్మ తన పిల్లల మీద ఈగనైనా వాలనివ్వదు. అంతలా కుటుంబ గౌరవాన్ని కాపాడేది అమ్మే. అందుకే దేవుడైనా అమ్మకు కొడుకుగానే పుట్టాలంటారు. ఇది పాత మాటే కావచ్చు. అమ్మను మించిన దైవం లేదు. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఇంకొకటి లేదు. అందుకే సి.నా.రె తన గజల్‌లో ‘అమ్మ ఒక వైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు’ అని అంటారు.

  • జానకి
Advertisement

తాజా వార్తలు

Advertisement