శమీపూజ అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి, నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని దుర్గాదేవిని ప్రార్థించారు. అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు ‘విజయదశమి’. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు శమీవృక్షాన్ని దర్శించి, పూజిస్తారు.
పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింపచేసేది లేదా నిగ్రహింపచేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధిప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి. విజయదశమిని దశహరా అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది . పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమినాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైనది ‘శమీ వృక్షా’న్ని దుష్టఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.
శమీ శమయతే పాపం
శమీ నాశయతే రిపూన్
శమీ విత్తంచ పుత్రంచ
శమీ దిత్సతి సంపదమ్
అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని శమీవృక్షం వద్ద పఠించాలి. శమీవృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సం కేతం. మంచి బుద్ధి కలిగి తద్వారా లోకకళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.
– శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్య..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి