Thursday, November 14, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

ద్వితీయఖండము
1వ మంత్రము :
3). జాగ్రత్‌ దశాజీవాంతర్యామి వర్ణన

జాగరితస్థానో బహి: ప్రజ్ఞ: సప్తాంగ ఏకోనవిశంతిముఖ:
స్థూలబుక్‌ వైశ్వానర: ప్రథమ పాద:

ద్వితీయఖండములోని ఈ మొదటి మంత్రము, నాలుగు స్వరూపాలతో ఉన్న పరమాత్మ ఏయే స్థానములలో ఉంటాడో, ఏయే వ్యాపారములు (కార్యము) చేస్తూ ఉంటాడో, ఎటువంటి రూపాన్ని కలిగి ఉంటాడో, భోగ్యములేమిటో, ఏయే పేర్లతో వ్యవహరింపబడుతూ ఉంటాడో వివరిస్తున్నది.

- Advertisement -

ప్రథమపాదమనగా మొదటి స్వరూపము అని అర్థము. ఈ మొదటి స్వరూపమునకు పేరు ‘వైశ్వానరుడు’ అని. ఇతనినే ‘అనిరుద్ధుడు’ అనికూడా అందురు. ఈయన చక్షురీంద్రియము నందు ఉంటాడు. చక్షువు అనగా కన్ను. ఈ కంటిలోని నల్లగుడ్డుపై మనకు ఆకారాన్ని కన్నింపచేసే ఇంద్రియముంటుంది. దానినే చక్షురీంద్రియమంటారు. ఆ ఇంద్రియాన్ని స్థానంగా కలిగి ఉంటాడు. వైశ్వానరుడు లేదా అనిరుద్ధుడు అని పిలవబడే పరమాత్మ యొక్క మొదటి స్వరూపము. జాగ్రత్‌ దశలో (మేల్కొని ఉన్నపుడు) జీవుడు చక్షురీంద్రియము ద్వారా బాహ్య విషయములను గుర్తించి, వాటిని అనుభవించుచుండును. ఆ జాగ్రత్‌ దశలోని జీవునికి అంతరాత్మగా ఉండి ఆయా విషయములను అనుభవించిపచేస్తూ ఉండే స్వరూపమే వైశ్వానరుడిది.

వైశ్వానరుడు అంటేనే (విశ్వాన్‌ – నరాన్‌ నయతి ఇతి వైశ్వానర:) జీవులను నడిపించువాడు (పొందించువాడు) అని అర్థము. ఈ వైశ్వానరుడు చక్షురీంద్రియమును స్థానంగా చేసుకొని జీవునిలో ఉండి బాహ్యములయిన పదార్థములను (రూప, రస, స్పర్శ, గంధ, శబ్దాలు) తాను తెలిసికొనుచుండును, ఆ పదార్థజ్ఞానమును జీవునికి కల్గింపచేయును. ఇది వాని వ్యాపారము (కార్యము). ఇక
వాని రూపము నాలుగు భూజములతో, రెండు పాదములతో, తొండముతోను ఏడు అవయవములు కలిగి, 19 ముఖములు కలిగి ఉండును. మధ్యముఖము గజముఖముగా తొండము క ల్గి ఉండి, అటు తొమ్మిది, ఇటు తొమ్మిది ముఖములు పురుష ముఖ ఆకారము కలిగి ఉండును. ఇదీ ఆయన రూపము.

మరొకచోట వైశ్వానర విద్యలో వైశ్వానరుని రూపము మరొకలా వర్ణించబడి ఉంది. ఆ విద్యలో కూడా వైశ్వానరుడికి 7 అంగములు, 19 ముఖములు చెప్పబడి ఉన్నాయి. ద్యులోకుడు వైశ్వానరుడి మూర్థస్థానమునే ఒక అంగముగాను, సూర్యుడు చక్షువనే అంగముగాను, వాయువు వైశ్వానరుడి ప్రాణముగాను, ఆకాశమంతా ఆయన శరీరమధ్యభాగముగాను, జలము ఆయన మూత్రాశయముగాను, పృథివీ ఆయన పాదములుగాను, జాగ్రత్‌ దశలో ఉన్న జీవుడు వైశ్వానరుడి 7వ అంగముగాను వర్ణించబడినాయి.

ఇక ఆ వైశ్వానర విద్యలోని వైశ్వానరుడికి గల 19 ముఖములు ఏమిటంటే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, ప్రాణవృత్తులు (వ్యాన, ఉదాన, సమానాదులు) ఐదు, అంత:కరణ వృత్తులు (మనస్‌, చిత్త, అహంకార, బుద్ధులు) నాలుగు.

ఇక్కడ మాండూక్యోపనిషత్‌లోనూ వైశ్వానర నామధేయంతో, 7 అంగములు, 19 ముఖములు గల రూపము వర్ణించబడింది. వైశ్వానరవిద్య ఛాందోగ్యోపనిషత్‌లోనూ వైశ్వానరుడికి 7 అంగములు, 19 ముఖములే చెప్తూ వేరే వర్ణించబడిన ఆ అవయవములను ప్రస్తుతము కూడా అన్వయించుకోవచ్చును. ఇక ఇట్టి విలక్షణ రూపము కలిగి జాగ్రత్‌ దశా జీవునిలో ఉండు వైశ్వానరుడు స్థూల భుక్‌ అని ఈ మొదటి మంత్రము చెప్తోంది. స్థూలములు అంటే బాహ్యముగా ఆయా ఇంద్రియములచేత గ్రహించబడునట్టి విషయములు. రూపముకలిగిన పదార్థములు, రుచి కల్గినవి, శబ్ధించునవి, స్పర్శ కల్గినవి, గంథము కల్గిన వి అన్నీ స్థూలములనబడును. ఈ స్థూలపదార్థములను జీవునికి అనుభవింపచేయువాడు కనుక వైశ్వానరుడు స్థూలభుక్‌.

అయితే స్థూభుక్‌ అంటే నిజానికి స్థూలములైన బాహ్య పదార్థములను అనుభవించువాడు అనికదా అర్థము చెప్పవలసింది. అని సందేహము రావచ్చును. పదార్థానుభవము తద్వారా సుఖదు:ఖాది అనుభవమనునది కర్మనుబట్టి ఏర్పడుచుండును. ఆ కర్మఫల అనుభవమునది జీవునికే కానీ, పరమాత్మకి ఉండదు. కానీ శ్రుతి, కర్మఫల అనుభవ, కర్తృత్వాన్ని జీవ, పరమాత్మలిద్దరికీ చెప్పి, అది ఏ విధంగానో సమర్థిస్తుంది.’ బుతం పితంబౌ సుకృతస్య లోకే..’ అనే మంత్రంలోని కర్మఫలమును జీవుడు, పరమాత్మ ఇద్దరూ అనుభవిస్తున్నారని శ్రుతి చెప్తున్నది. అయితే జీవుడిలాగే పరమాత్మ కర్మ అనుభవించాల్సివస్తే ఇక తేడా ఏముంటుంది? ఆయనా జీవుడితోపాటు ఈ శరీరంలో ఉంటూ సుఖమో, దు:ఖమో పొందవలసివస్తుంది.

అందుకని శ్రుతి మరొక మంత్రములో ‘ద్వాసుపర్ణా సయుజా సఖాయా, సమానంవృక్షం పరిషస్వజాతే తయోరన్య: పిప్పలం స్వాదు అత్తి, అనశ్నన్‌ అన్యో అభిచాకశీతి’ అని జీవపరమాత్మలిరువురూ శరీరంలో ఉన్నా, జీవుడు మాత్రమే కర్మఫలాన్ని అనుభవిస్తాడని, పరమాత్మేమో జీవునిచేత ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తూ ఉంటాడని జెప్పింది. కనుక పరమాత్మకి ప్రయోజన కర్తృత్వము, జీవునికి ప్రయోజ్యకర్తృత్వము సిద్ధిస్తాయి. ప్రస్తుతమున బాహ్యపదార్థముల అనుభవ విషయములోకూడా ఆయా పదార్థాలని అనుభవించేదీ, సుఖమో-దు:ఖమో పొందేదీ ప్రయోజ్యకర్త అయిన జీవుడే, పరమాత్మ కేవలము కూడా ఉండి ఆయా పదార్థాలని అనుభవింపచేస్తూ ప్రయోజక కర్త తానవుతున్నాడు. కనుక, వైశ్వానరుడు స్థూలభుక్‌ అయ్యాడు. ఇదియే భోగ్యము.

ఈ విధంగా ఈ మన్త్రమున జాగ్రత్‌ దశలో ఉండు జీవునికి అన్తర్యామిగానుండి శాసించువాడు అనిరుద్ధ, వైశ్వానర నామములకల పరమాత్మ యొక్క మొదటి స్వరూపమని, వాని స్థానము చక్షురీంద్రియమని, వాని వ్యాపారము బాహ్యపదార్థముల యొక్క జ్ఞానము జీవునికి కల్గించడమని, 7 అంగములు, 19 ముఖములు కల్గినది వాని రూపమని, స్థూలపదార్థములన్నీ వాని భోగ్యములను ఐదు విషయములు వివరించబడినవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement