Monday, November 11, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

2వ మంత్రము
స్వప్న దశానిర్వాహకుడైన వర్ణన

స్వప్నస్థానోంత: ప్రజ్ఞ: సప్తాంగ ఏకోనవింశతి ముఖ:
ప్రవివిక్తభుక్‌ తైజసో ద్వితీయ: పాద:||

స్వప్నమనగా కల. జీవుడు కంఠప్రదేశము నుండి(కలలోని)స్వప్న పదార్థములను చూచుట. కనుక స్వప్న స్థానమనగా కంఠదేశము పరమాత్మ ఈ జీవునిద్వారా ఈ కంఠప్రదేశమున ఉండి స్వప్న స్థానుడుగా వ్యవహరించబడును. వానికే ప్రద్యుమ్నుడు, తైజసుడని పేరు. జీవుడు మేల్కొని ఉన్న దశలో బాహ్యపదార్థములను అనుభవించు చుండునుకదా! ఆ అనుభవములే వానిలో కొన్ని సంస్కారములు ఏర్పరుచును. ఆ సంస్కారములను బట్టి ఈ పరమాత్మ ఆ జీవుని జీవనగమనము నిర్థేశించును.

- Advertisement -

స్వప్నస్థాన నిర్వాహకుడైన ఈ ప్రద్యుమ్నుడు పరమాత్మయొక్క రెండవ స్వరూపము. ఇతనికి అంత:ప్రజ్ఞుడని అతని వ్యాపారమునుబట్టి వచ్చిన పేరు. ఈ ప్రద్యుమ్నుడు జీవునికి స్వప్న పదార్థ అనుభవమును కల్గించును. సాధారణంగా స్వప్నంలో మనకి కన్పడే పదార్థములన్నీ చాలావరకు మనకు బాహ్య అనుభవము వ లన ఏర్పడిన సంస్కారము వలననే కనపడుచుండును అనుకొందుము. కానీ, అది సరికాదు. ఏలన, పరమాత్మ తానే స్వయముగా ఆయా జీవుని కర్మానుభవమునకు తగిన పదార్థములను, బాహ్యంగా ఆ జీవి అనుభవిం చని పదార్థములను కూడా సృష్టించి చూపించును.

ఈ విషయమును బాదరాయణులు బ్ర హ్మసూత్రములలోని సన్థ్యాధికరణములో వివరించియున్నారు. శ్రుతి కూడా ”స ఏషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ:” – పరమాత్మ, నిదురిస్తున్న జీవులందరిలోకూడా తాను మేల్కొని ఉండి, ఆయా భోగములను కలలో వారిని అనుభవింపచేయునని చెప్తున్నది.

ఇలా ఆంతరిక పదార్థములను సృజించి అనుభవింపచేయువాడు అయిన ప్రద్యుమ్నుడు కూడా ముందు మంత్రములో చెప్పబడినట్లు. ఏడు అవయవములు, పంతొమ్మిది ముఖములతో అనిరుద్ధుని వంటి రూపముకలవాడే. అయితే ఇతడు అనిరుద్ధుని కంటే విలక్షణమైన భోగములను భవింపచేస్తాడు. అనిరుద్ధుడు(వైశ్వానరుడు) కేవలము బాహ్యపదార్థములనే అనుభవింపచేయును. బయట కన్పడే పదార్థములను అన్నీ అందరూ అనుభవించవీలు కల్గినవేకదా! కానీ, ప్రద్యుమ్నుడు అలాకాక, ఏ జీవికాజీవి ఒక్కడు మాత్రమే అనుభవించి ఆనందించవీలుగా పాలలో పదార్థములను సృష్టించి అనుభవింపచేయును. బాహ్యపదార్థములు ఒకసారి అనుభవించిననూ మరికొంత కాలము, మరికొందరు జీవులు అనుభవిం చునట్లు నిలిచి ఉండును.

కానీ ప్రద్యుమ్నుడు చేయు స్వప్న పదార్థసృష్టి ఆశ్చర్యకరమైనది. ఆ పదార్థములు స్వప్నమును చూచు వ్యక్తి మాత్రమే అనుభవించవీలగును, అం తేకాక స్వప్నమున్నంతవరకే ఆ పదార్థములు ఉండును. ఇటువంటి వి లక్షణ పదార్థములను అనుభవింపచేయువాడే కనుక ప్రద్యుమ్నుని ”ప్రవివిక్త భుక్‌’ అని ఈ మన్త్రము చెప్తోంది.

ఈ విధముగా ఈ మన్త్రమున స్వప్నదశా నిర్వాహకుడైన, పరమాత్మ యొక్క రెండవ స్వరూపమైన ప్రద్యుమ్నునికి తైజసుడని పేరని, స్వప్నదశలో కంఠదేశమే అతని స్థానమని, స్వాప్న పదార్థములను తెలియచేయడమే అతని వ్యాపారమని, 7అంగములు, 19ముఖములు కల్గిన రూపమని, ఏకవ్యక్తిమాత్ర అనుభవ యోగ్యములైన స్వాప్న పదార్థములే భోగ్యమను ఐదు విషయములు ఈ మన్త్రమున వివరించబడినవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement