Wednesday, November 20, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

5వ మంత్రము:

నాంత: ప్రజ్ఞం న బహి:ప్రజ్ఞంనోభయత: ప్రజ్ఞ ం న ప్రజ్ఞానఘనం
న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టమవ్యవహార్యం అగ్రాహ్యమలక్షణమ్‌
అచింత్యమవ్యపదేశ్యం ఐకాత్మ్య ప్రత్యయసారం ప్రపంచోపశమం
శాన్తం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ:

పరమాత్మ యొక్క ఈ నాల్గవ స్వరూపము వాసుదేవుడుగా పేర్కొనబడుతుంది. వాసుదేవుడు అనగా వసు వ్యాప్తో దివ్‌ దీప్తో అనుధాతువులను బట్టి అన్ని పదార్థములలో వ్యాపించి ప్రకాశించువాడు అని అర్థము. స్వప్నదశలో నిర్వాహకుడైన ప్రద్యుమ్నమూర్తి ఈ వాసుదేవుని యొక్క స్వరూపమే. ఆ ప్రద్యుమ్న స్వరూపముతో కేవలం స్వప్న పదార్థములనే అనుభవింపచేయును అయితే తాను వాసుదేవుడిగా ఉన్నప్పుడు స్వప్నపదార్థ అనుభవములను కలిగింపక ఉంటాడు. కనుక ఈ వాసుదేవ స్వరూపము అంత: ప్రజ్ఞయైన ప్రద్యుమ్న స్వరూపము కంటే విలక్షణమైనది.

- Advertisement -

అట్లే జాగ్రత్‌ ద శా నిర్వాహకుడైన అనిరుద్ధమూర్తి కూడా వాసుదేవుని యొక్క అంశయే. ఆ అనిరుద్ధ స్వరూపములో జాగ్రత్‌ దశలో కేవల బాహ్యపదార్థ జ్ఞానమును కల్గించి, అనుభవింపచేయును. అయితే తాను వాసుదేవ స్వరూపముతో బాహ్య పదార్థానుభవమును కల్గింపక ఉంటాడు. కనుక ఈ వాసుదేవ స్వరూపము బహి:ప్రజ్ఞయైనది కాదు. ఇక జీవుడు జాగ్రత్‌ దశ నుండి స్వప్నదశకు చేరుటకు మధ్య మరొకదశ ఉంటుంది. ఈ దశలో బాహ్యార్థ జ్ఞానము కొంత కలుగుతూ, మరికొంత స్వాప్న పదార్థ జ్ఞానముకూడా కలుగుచుండునట. ఇట్టి దశకు అనిరుద్ధ, ప్రద్యుమ్నులిరువురూ నిర్వాహకులు. ఈ వాసుదేవ స్వరూపము ఈ దశను కూడా అనుభవింపచేయునదికాదు. ఈ అనిరుద్ధనికంటెను, ప్రద్యుమ్నుని కంటెను వాసుదేవుడు అత్యంత విలక్షణుడని తాత్పర్యము.

ఇక సుషుప్తిదశా నిర్వాహకుడైన సంకర్షణుడునూ వాసుదేవుని అంశయే. ఆ సంకర్షణుడు సుషుప్తిలో జీవస్వరూపమును మాత్రమే ప్రకాశింపచేస్తూ, ఆనందానుభవమును కల్గించును. ఈ సంకర్షణునికి ప్రాజ్ఞుడని పేరు. సుషుప్తి సమయమున ”ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్యక్త:…”అని జీవుడు చెప్పబడతాడు. ఆ జీవుని తన పరిష్యంగంలోకి తీసుకున్న ప్రాజ్ఞపురుషుడే ఇచట ప్రజ్ఞుడిగా పేర్కొనబడినాడు. వాసుదేవమూర్తి ప్రజ్ఞుడైన ఈ సంకర్షునికంటే విలక్షణమైనవాడని ”న ప్రజ్ఞం” అంటూ ఈ మంత్రము చెప్తోంది.

ప్రజ్ఞుడనగా బాగా తెలిసినవాడు. ప్రజ్ఞుడు కాడు అంటే అప్రజ్ఞుడు కావలసివస్తుందికదా! అనే శంక వస్తుందేమోనని , వెంటనే ”న అప్రజ్ఞం” అంటూ మరోపదంతో వివరిస్తోందీ మన్త్రము. కనుక వాసుదేవమూర్తి సుషుప్తిదశా నిర్వాహకుని కంటెను వేరైనవాడు అని తాత్పర్యము.

ఈ విధంగా జాగ్రత్‌, స్వప్న, సుషుప్తిదశలకంటే విలక్షణమైన నాల్గవదశ తురీయదశ(ముక్తి). ఈ దశకు నిర్వాహకుడు అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణులకంటే వేరైన వాసుదేవుడు. అంటే జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అనే ఆరు గుణములతో ప్రకాశించే పూర్ణుడు. అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణమూర్తులు వరుసగా వీర్యతేజస్సులు. బలఐశ్యర్యములు, జ్ఞానశక్తులు అనునట్టి రెండేసి గుణములు ప్రధానముగా కలవారు. ఈ ముగ్గురూ కూడా వ్యూహ వాసుదేవుని స్వరూపములే.

”ఏత్‌ నానావతారానాం నిధానం బీజం అవ్యయమ్‌’ ఈ వాసుదేవ స్వరూపమే ఇతర అవతారములన్నింటికీ మూలకందము వంటిది. ఈ వాసుదేవుడే వ్యూహ స్వరూపుడని ఆగమాలలో పేర్కొనబడుచుండును. షాడ్గుణ్య పరిపూర్ణుడైన నారాయణుడే ఇతడు ముక్తులచే పొందబడు శ్రీమన్నారాయణుడితడు. ”న చక్షుషా పశ్యతి కశ్చనైనం” ఈ పరమాత్మను కంటితో ఎవరూ చూడలేరు అని శ్రుతి చెప్తున్నది.

కంటితో మాత్రమేకాదు జ్ఞానేంద్రియములు వేటికీ గోచరము కాడు. ఈ పరమాత్మ అని ”అదృష్టం”అంటూ ఈ మన్త్రం చెబుతోంది. కంటితో చూడలేకున్నా కర్మేంద్రియములైన హస్తాదులు చేత గ్రహిద్దాం అంటే అందేవాడుకాడు, ”అగ్రాహ్యం” అంటోందీ మన్త్రము. పోనీ, వాక్‌ ద్వారా ఈ పరమాత్మతత్త్వాన్ని చెప్తే ప్రయత్నం చేద్దాము అంటే వాగింద్రియముకూడా ఆ పరిపూర్ణ తత్త్వాన్ని చెప్పలేదు. పైకి చెప్పలేకపోయినా, మనసులో ఇలాంటివాడు పరమాత్మ, ఇంతటివాడు అంటూ అతని స్వరూపమునుగాని, గుణములనికాని ఊహించవీలుకానంతటి పరతత్త్వము పరమాత్మది.

కనుకనే ”అలక్షణం” అంటూ పరమాత్మ తత్త్వము జ్ఞానకర్మేంద్రియాలకు ప్రత్యక్షంగా అందనిదేకాదు, ఆంతర ఇంద్రియమైన మనుసుతో(ఊహించి) అనుమాన ప్రమాణముతో తెలుసుకోవడానికి కూడా వీలుకానిది అంటోందీ మంత్రము. ఎవరూ మనసులో కూడా అతని స్వరూప, ప్రకారములను పరిపూర్ణంగా స్మరించలేరు.

అందుకనే ఈ పరమాత్మతత్త్వము ‘అచిన్త్యము”. ఎవరికీ కూడా ప్రత్యక్షానుమాన ప్రమాణములద్వారా తెలియని విషయాన్ని తెలిపేది శబ్దప్రమాణము అంటారు. కానీ, ఈ పరమాత్మ విషయంలో శబ్దప్రమాణము కూడా ఆయన గుణగణాలనికాని, విభూతినికాని, స్వరూపమునుకాని సమగ్రంగా చెప్పజాలదని ”అవ్యపదేశ్యం” అంటోందీ మన్త్రము.

ఈ పరమాత్మ తానొక్కడుగానే ప్రకాశమానుడై దు:ఖమనునది ఏ మాత్రములేక మహానందస్వరూపుడై ఉండును. తాను ఆనందమయుడై ఉండడమేకాకా ఎవరెవరైతే తనని ఆశ్రయిస్తారో, వారికి దు:ఖకరమైన ప్రకృతిసంబంధరూపమైన ఈ ప్రపంచమును శమింపచేయును. ఆయన ఆకలిదప్పులు, జరామృత్యువులు, శోకమోహములేవీ లేని శాంతస్వరూపుడు. ఒకనాడు జన్మించడం, ఒకనాడు వినాశం చెందడమనేవేవీ ఉండనివాడు కనుక సదా మంగళస్వరూపుడుగా తానుండును. ఇంతటి వైలక్షణ్యం కల్గినవారు మరొకరెవరైనా ఉన్నారా? అంటే ”న తత్సమశ్చ అభ్యధికశ్చ శ్రూయతే” ఈ పరమాత్మతో సమానమైనవాడుకాని, అధికుడుకాని లేడని శ్రుతి చెప్తున్నది. కనుక ”అద్వైతం”అని ఈ మంత్రం పేర్కొనుచున్నది. తనవంటి రెండవ వస్తువు లేనివాడని తాత్పర్యము.

ఇన్ని లక్షణములు విశేషమైనవి కల్గిన నాల్గవ స్వరూపము వాసుదేవ స్వరూపము. ఈతనినే తురీయుడు అంటారు, వ్యూహరూపి అంటారు, ముక్తప్రాప్యుడైన శ్రీమన్నారాయణుడు అని కూడా అంటారు. ఈ పరమాత్మయే సర్వదేశకాల వస్తువులందును లోపల, వెలుపల కూడా వ్యాపించి ఉండును. సంకర్షణాదులకూ ఈతడే ఆత్మ. ఈతడే మోక్షం కోరువారిచే తెలుసుకోనదినవాడు, ధ్యానం చేయతగినవాడు. అనంతరం ముక్తిపొందిన దశలో అనుభవించతగినవాడు అని ఈ మంత్ర తాత్పర్యము.

Advertisement

తాజా వార్తలు

Advertisement