Monday, November 25, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

సుషుప్తిస్థాన నిర్వాహకుని వర్ణ న

3వ మంత్రము:
యత్రసుప్తో న కంచన కామం కామయతే, న కంచన స్వప్నం
పశ్యతి తత్‌ సుషుప్తం, సుషుప్తస్థాన ఏకీభూత: ప్రజ్ఞానఘన
ఏవ ఆనందమయో హి ఆనందభుక్‌ చేతోముఖ: ప్రాజ్ఞ: తృతీయ:పాద:||

జీవుడు ఎక్కడ గాఢనిద్రలో ఉంటూ రాగద్వేషాధి దోషములు లేనివాడయి, బాహ్య పదార్థనుభవము నందు కోరిక లేనివాడై అలాగే కలలోని పదార్థ అనుభవం కూడా లేకుండా ఉండునో అది సుషుప్తిస్థానము అనబడును. అటువంటి గాఢనిద్ర జీవునికి పరమాత్మ ఒడిలోని లభించునని, పరమాత్మయే సుషుప్తిస్థానమని ఛాందోగ్యశ్రుతి చెప్తున్నది. ”ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్త: న బాహ్యం కించన వేద నాంతరమ్‌” అనగా ప్రాజ్ఞుడైన పరమాత్మలో గాఢాలింగనము చేసికొనబడినవాడై జీవుడు ఏ మాత్రము బయటి విషయములనుగాని, లోపలి స్వాప్న పదార్థములనుగాని తెలుసుకొనలేడు. అదే నిజమైన గాఢనిద్ర లేదా సుషుప్తి స్థితి. ఈ సుషుప్తికి స్థానమైనవాడు, సుషుప్తి దశా నిర్వాహకుడు పరమాత్మయే. అతనికి సంకర్షణుడు అని పేరు. వానికే ప్రాజ్ఞుడనికూడా పేరు. సంకర్షణుడే సుషుప్తిస్థానము.

- Advertisement -

ఈ విషయమునే వేదవ్యాసులవారు, బ్ర హ్మసూత్రములలో ”తదభావో నాడీషు తఛ్చ్రుతేరాత్మని చ” అనే సూత్రంలో నిరూపించియున్నారు. ”యత్రైతత్పురుష: స్వపతి నామ సతాసోమ్య తదా సంపన్నో భవతి” ఎప్పుడు ఈ జీవుడు సుషుప్తిని పొందునో అప్పుడు అతడు నిత్యుడగు పరమాత్మతో చేరి ఉండును- అంటూ పరమాత్మయే సుషుప్తి స్థానమని తెలుపుతోంది శ్రుతి. అట్టి పరమాత్మ సుషుప్తిస్థితిలో జీవస్వరూపమును తెలియచేయుచుండును.

”ప్రజ్ఞానఘన:” అనుచోట ”ఘన: ప్రజ్ఞాన:” అనురీతిలో విపరీత సమాసము చేయవచ్చును. సుషుప్తివేళలో ఘనమైనది జీవస్వరూపం. దానిని తెలియచేయువాడు ఘనప్రజ్ఞానుడు. అతడే ఇచట ప్రజ్ఞానుఘనుడుగా పేర్కొనబడుచున్నాడు. అతడే ప్రాజ్ఞుడు. అనవధికాతిశయ ఆనందస్వరూపుడు. కనుక అతడీ జీవునికి బాహ్యభోగాలనో, స్వాప్న భోగాలనో కాక, కేవలం ఆనందస్వరూపుడయిన తననే అనుభవింపచేయుచుండెను. ఇట్టి పరమాత్మ స్వయంప్రకాశములైన సర్వావయవములతో విరాజిల్లుచుండును.

ఇక్కడ ఒక సందేహము రావచ్చును. సుషుప్తి అనగా గాఢనిద్ర. అనగా సర్వేంద్రియ వ్యాపార ఉపరతి జరుగును. ఇంద్రియాల ద్వారా జ్ఞానప్రసారము లేక ఆయా ఇంద్రియములన్నియు తమ తమ పనులు మాని మనసుతో సహా జీవునిలోచేరి ఉండునుకదా! అపుడు ఆనందానుభవము ఎట్లు కలుగును? జాగ్రత్‌ , స్వప్న దశలలో ఇంకా పూర్తిగా ఇంద్రియ వ్యాపారాలు మాని ఉండవు కనుక ఆయా పదార్థాల అనుభవముంది. కానీ, సుషుప్తిలో ఎలా ఆనందానుభవం కలుగుతుంది? అంటే, సమాధానంగా ”ప్రజ్ఞానఘన ఏవ, ఆనందమయో హి” అని ఈ మన్త్రం చెప్తున్నది. అంటే జీవుడు జ్ఞానానంద స్వరూపుడయినందున, సుషుప్తిదశలోనూ ఆనందానుభవము ఉండును.

అంతేకాక పరమాత్మను చూద్దామా ఆనందమయుడు ”రసోవైస: రస హ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి” పరమాత్మే రసమని, అతనిని పొందియే ఆనందమును పొందును అని శ్రుతి చెప్తోంది. మరొకచోట తైత్తిరీయములో ”ఏషహ్యేవ ఆనందయాతి” అంటూ ఈ పరమాత్మయే ఆనందింపచేయువాడు అంటూ చెప్తోంది. కాబట్టి జీవుని స్వరూపమునుబట్టిగాని, పరమాత ్మ స్వరూపమునుబట్టిగాని, సుషుప్తిదశలో పరమాత్మ స్వయం ప్రకాశముతో ఆనందింపచేయునని, జీవుడు ఆనందానుభవమును పొందునని చెప్పడంతో ఎటువంటి సందేహము అవసరంలేదు, అని ఈ మంత్రము చెప్తోంది.

ఇంతకుముందు మంత్రములలో చెప్పినట్లు అనిరుద్ధ, ప్రద్యుమ్న స్వరూపాలలో ఉన్న 7అంగములు, 19ముఖములు కల రూపము, ప్రాజ్ఞుడైన ఈ సంకర్షణునికి లేవు. ”ఏకీభూత:” అంటూ స్వయంప్రకాశమైన అవయవసముదాయము కలిగి ఉండుట ఈయన స్వరూమని ఈ మంత్రము వర్ణిస్తున్నది.

ఈ విధముగా ఈ మంత్రమును సుషుప్తిస్థాన నిర్వాహకుడైన పరమాత్మ 3వ స్వరూపమునకు ప్రాజ్ఞుడు లేదా సంకర్షణుడని పేరని, సుషుప్తియే స్థానమని, జీవస్వరూపము ప్రకాశింపజేయుచుండుట వ్యాపారమని, ఆనందప్రచురుడిగా స్వయంప్రకాశమైన అవయవ సముదాయము క లిగి ఉండుట రూపమని, నిరతిశయ ఆనందమే భోగ్యమను ఐదు విషయములు వివరించ బడినవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement