Thursday, November 14, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

తృతీయఖండము

1వ మంత్రము:
సోయమాత్మా అధ్యక్షరం ఓంకారో అధిమాత్రం పాదా
మాత్రా: మాత్రాశ్చ పాదా: అకార ఉకారో మకార ఇది||

ఇంతవరకు సమస్త ప్రణవముచేత ప్రతిపాదించబడునట్టి పరమాత్మత్త్వాన్ని వైశ్వానర, తైజస, ప్రాజ్ఞ, తురీయ(అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ) స్వరూపములుగా వివరించడం జరిగింది. ఈ ఖండములో పరమాత్మ యొక్క ఆ నాలుగు స్వరూపములు, వ్యస్త్రప్రణవములోని ఒక్కొక్క మాత్రచేత ప్రతిపాదించబడునని తెలిపి, ఆ స్వరూపజ్ఞానంతో ఉపాసన చేసినవారిని, ఆయా స్వరూప పరమాత్మ ఎట్లనుగ్రహించునో వివరిస్తోందీ ఉపనిషత్‌.

- Advertisement -

”ఓమ్‌ ఇత్యేకాక్షరం”, ఓమిత్యేతదక్షరం” మొదలైన శ్రుతులలో ఒకే అక్షరంగా చెప్పబడుతున్న ఓంకారము, సమస్త ప్రణవము. దానినే ”అధ్యక్షరం”అక్షరములలో శ్రేష్ఠమైనది అంటూ ఈ మన్త్రంలో చెప్పారు. ఇక ”అధిమాత్రం” – అకార, ఉకార, మకార నాదములనే మాత్రల రూపంలో ఉన్న వ్యస్త ప్రణవమును చెప్పారు. ఈ సమస్త ప్రణవముగాని, నాలుగు మాత్రలుగా విభజించబడిన వ్యస్తప్రణవ ముగాని, పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీమన్నారాయణునినే పరమాత్మగా ప్రతిపాదించుచున్నవి.

ఓంకారములో అకార, ఉకార, మకారములనే అక్షరములు మూడేకాక, దానిని ఉచ్చరించినపుడు మనము వినగలిగే నాదము మరొకటి ఉన్నది. ఇదియే నాల్గవమాత్ర. కనుక ప్రణవమును మొత్తము నాలుగు మాత్రలుగా విభజించవచ్చు. ఈ ఓంకారమే పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడని ముందు 1వ ఖండములోనే తెలుసుకున్నాంకదా! ఆ పరమాత్మకున్న అంశములు లేదా స్వరూపములు కూడా నాలుగేనని అని ఏమిటో 2వ ఖండములో తెలుసుకున్నాం. ఆ పరమాత్మ అంశలైన అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవులని ఓంకారములోని నాలుగుమాత్రలు ప్రతిపాదించునని, ఏతావతా సమస్తప్రణవము, వ్యస్త ప్రణవమూ పరమాత్మనే ప్రతిపాదించునని ఈ ఉపనిషత్‌ వ్యాఖ్యానిస్తున్నది. ఈ ఖండములో పరమాత్మ యొక్క ఏ స్వరూపము, ఓంకారములోని ఏమాత్రచేత, ఎట్లు ప్రతిపాదించబడునో ముందు మంత్రాలలో వివరిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement