Sunday, November 17, 2024

మంచి మాటే మార్గదర్శకము

మాట అంటే వాక్కు. భగవద్దత్తమైన వరం వాక్కు. ఈ వాక్కు మానవులకే నలువరాణి శ్రీ సరస్వతీదేవి వర్రపసాదం. మానవులు జన్మించిన పిదప బాల్యం నుండే చిలుక పలుకులుగా మాటలను పలుకుట మనం సమాజంలో తిలకిస్తూనే ఉంటాము. మంచి మాటలలోనే మానవత్వం పరిమళిస్తూ ఉంటుంది.
ఆంధ్ర వాజ్మయంలో శతక వాజ్మయం ఎంతో గొప్పది. కవులు తమ శతక రచనలలో మృదుమధురమైన నీతులను పద్యరూపంలో తెలిపినారు. చెవులూరించే మాట తీరే మనోధర్మంగా వర్ణించి, ఆ మాటల విలువ సమాజానికి ఎంతో హితవును చేకూర్చుతుందనీ, ఆ మాటలు పలికే తీరులో ఎంతో వైశిష్ట్యం, ప్రభావముందనీ, మంచి మాటలే మార్గదర్శకములనీ వివరించారు. జనజాగృతిని కలిగించారు.
ప్రాచీన శతకకవి బద్దెన సుమతీ అనే మకుఠంతో, కంద పద్యములు రచించి ప్రసిద్ధి కెక్కినవాడు. ఆ బాలగోపాలం వీరి పద్యములను వల్లె వేయనివారుండరు. సమాజహితకారిణి సుమతీశతకం. బద్దెన కలిమానవులు ఇంటా, బయటా, ఇంతులతో, పలికలతో, కొలువులలో, పూజ్యులతో, గురువులతో, ఆత్మీయులతో, బంధువులతో, తల్లిదండ్రులతో, సహోదరులతో ఎలా మెలగాలో తెలుపుచూ, ఎన్నో సూచనలు చేశారు. అందుకే కవి తన శతకంలో ఆదిలోనే దారాళమైన నీతులు- నోరూరుగ జవులు పుట్ట-నుడివెద సుమతీ అని చెప్పుట మంచి సమసమాజ నిర్మాణం కొఱకే. కవి ఒక పద్యంలో ఇలా తెలిపారు.
కం|| నీరే ప్రాణధారము
నోరే- రసభరితమైన- నుడువులకెల్లన్‌
నారియెనరులకు రత్మము
చీనయె శృంగారమండ్రు- సిద్ధముసుమతీ అన్నారు.
మానవుల ప్రాణములకు నాల్గువిధములైన ఆధారాలున్నాయి అంటూ ఓ సుమతీ! నరుల ప్రాణాలకు జలమే ఆధారము. రసవంతములైన మాటలన్నింటికీ ఆధారం నోరు. అన్నింటిలో శ్రేష్టమైనది స్త్రీయే. అలంకారాదులలో శ్రేష్టమైనది వ్రస్తమే. ఇది శాస్త్ర జ్ఞానం వల్లనూ, అనుభ వం వల్లనూ వెల్లడైన విషయం. మనిషి ఏ ఆహారం స్వీకరించకపోయినా, నీరు త్రాగితే చాలా రోజులు జీవించగలడు. నీరు త్రాగకపోతే ఎక్కువ కాలం జీవించలేడు. కవి అందుకనే నీరే ప్రా ణాధారం అన్నారు పద్యం ప్రథమ పాదంలో. దానికే జీవనం అంటే బ్రతుకు అని అర్థం. ఇక రెండవ పాదంలో రసవంతములైన మాటలన్నిటికీ నోరే ఆధారమన్నారు. మనం పలికే మా టలు రసవంతంగా వుండాలంటే నోటిలో ఉండే నాలుక ప్రధానం. మాట్లాడే ఒక అవయవం యిది. ఒక సాధనం. అది దానంతట అది పలుకలేదు కదా! దానిని ఉపయోగించే వారు ఏది చేయిస్తే అది, ఎలా చేయిస్తే అలానే చేస్తుంది. నోరు శరీరంలో ఒక ప్రధాన భాగం కదా! సజీవ సాధనం. మనిషి అవయవాలు అలవాటు చేయడాన్ని బట్టి నడుస్తుంటాయి. ప్రవర్తిస్తుంటాయి.
నడవడం- పనిచేయడం- చూడడం- పలకటం కూడా అలవాటును బట్టే ఉంటాయి. సమాజంలో ఒక సామెత వుంది. ఏగూటి చిలక ఆగూటి పలుకు పలుకుతుంది అని, అలాగే నోరు మృదువుగానైనా, పరుషంగానైనా, అనుచితంగానైనా, సముచితంగానైనా, సమయోచి తంగానైనా, అసంధర్భముగానైనా మాట్లాడడం మనం అలవరచుకొన్న దానిని బట్టే ఉంటుంది. కాలు జారితే తీసుకోగలం గానీ నోరు జారితే తీసుకోలేము అంటారు. నోటికీ, పలుకులకు అంత ప్రాధన్యత ఉంది. కనుక మానవులమైన మనం మాటతీరు ప్రయత్నించి అల వరచుకోవాలి. కొందరు నామాట తీరే అంత అంటుంటారు. అది మంచి పద్ధతి కాదు. సమ ర్థనీయమైనదీగాదు.
మంచి మాటలు పల్కుటకు మనసే ఆలంబన. ఆధారం. మానవులకు మంచి మనసుంటే మం చి మాటలు వస్తాయి. ఆంధ్ర మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఒక పద్యంలో యిలా ఉంది.
కం|| ఎదిరికి హితమును బ్రియమును
మదికింపునుగాగ – బలుకుమాటలు పెక్కై,
యొదవినను లెస్స – యటుగా
కిది, మన యూరకునికి- యెంతయునొప్పన్‌||
మరో పద్యంలో ఎలా పలకాలో తెలిపారు.
కం|| చెలిమియు- బగయును- దెలివియు
గలకయు- ధర్మంబు- బాపగతియును, బెంపుం
దులువతనంబును వచ్చును
కానపొసగ బలుకగ వలయున్‌| అంటూ పరులకు బాధ కల్గించునట్లుగా పలుకరాదు. మంచి పలుకులు పలుకుట అలవరచుకొనమనే నీతి యిమిడియున్నది.
మధురకవి దీపాల పిచ్చయ్యశాస్తిగారు ఈ మాటల ప్రభావాన్ని ప్రశంసించారు. జనులకు హితముగా మంచి మాటలు పలకడం నేర్పమన్నారు. ఒక పద్యంలో
ఉ|| మాటలచేత దేవతలు- మన్నన చేసి వరంబులిత్తు, రా
మాటలచేత భూపతులు- మన్నన చేసి పురంబులిత్తు, రా
మాటలచేత గామనులు- మన్నన చేసి సుఖంబులిత్తు, రా
మాటలు నేరకున్న- నవమానము-న్యూనము-మానభంగమున్‌ అన్నారు.
ప్రయత్నమే ప్రాధాన్యమని తెలిపారు. సుమతీ! నారియె నరులకు రత్నము అన్న వాక్య మును మన సంప్రదాయము మహిళలకు సముచిత స్థానమిచ్చినది. రత్నమన్నమాట శ్రేష్టమ యినది. మానవ జాతిలో శ్రేష్టమయినది మగువ. మగువలకు చీరయె శృంగారమని రచించా డు. స్త్రీలు ధరించేది చీర- కోక- వస్త్రము అని, స్త్రీలకు పూవులు మైపూతలు- నగలు లేకున్ననను యిబ్బంది లేదు. కానీ వలువలు అనగా వస్త్రములు లేకపోతే కుదరదు. చీరల వలన అందం ఇనుమడిస్తుంది. వకార పంచకంలో ప్రధానమైనది వస్త్రం. స్త్రీలకు చీరలు ముఖ్యం అని తెలిపా రు కవి బద్దెన. కావున ఆ|| మిట చేత మనిషి- మన్నననొందును
మాటవలన ప్రేమ- మధురమగును
మాటవలన జీవి- మనుగడసాగును
మంచిమాటలాడి- మసలవలయు||
సభలలో- ప్రసంగాలలో వక్తలు వాక్చాతుర్యమును ప్రదర్శించి మన్ననలు పొందాలని సమాజం కోరుకుంటుంది. మానవుని మంచి చెడులు వారి మాటల ద్వారానే తెలుస్తాయి. అయితే సత్యం లేని మాటలు శవాల వంటివి. అవి పలికినా ఒకటే పలుకకపోయినా ఒకటే అన్నారు. మానవులకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి కొని పోయేది మాటలే. మాటకు నిజం ప్రాణం వంటిది. కీర్తిని అందించేది మాటయెె. మానవులు మాటలాడే వి షయంలో జాగరుకులై వర్తించాలి. అని కవి సమాజానికి దివ్య సందేశాన్ని పద్యం ద్వారా అందించడం ఎంతో అదృష్టం. కనుక మాట తీరు విషయంలో మృదువుగా- మధురంగా పలికి గౌరవం పొందాలి. శాంతి, సుఖాలు అనుభవించాలి.
శుభం భూయాత్‌

పి.వీ.సీతారామమూర్తి
9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement