మహాభారత యుద్ధం పది రోజులు భీష్మా చార్యుడు, ఐదురోజులు ద్రోణుడి సార థ్యంలో జరిగింది. దృష్టద్యుమ్నుడు ద్రోణా చార్యుని సంహరించడంతో పదిహేనో రోజు యుద్ధం ముగిసింది. ఇరు సేనలు వారివారి శిబిరాలకు చేరు కున్నాయి. ఆ సమయంలో యుద్ధ రంగంలో స్వేచ్ఛాయుతంగా సంచరిస్తూ వేద వ్యాసుడు అర్జు నుని వద్దకు వచ్చాడు. ఆయనకు సభక్తి పూర్వకంగా అంజలి ఘటించి తన సందేహ నివృత్తికి తగిన సమ యం ఆసన్నమయినదని భావించి ”స్వామీ! నేను రణరంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు నా కంటే ముందు ఒక మహా దివ్య కాంతిమయుడు అగ్ని శిఖలతో ప్రజ్వరిల్లుతూ శత్రువులను నాశనం చేస్తు న్నాడు. అతని చేతిలో త్రిశూలం ఉంది. దాని నుండి అనేక కిరణ రూప త్రిశూలాలు జనించి శత్రు సంహా రం చేస్తున్నాయి. ఆ మహా పురుషుని అగ్నియుత పాదాలు భూమిని తాకడం లేదు. విచిత్రమేమిటంటే చూసేవారికి నా శరపరంపర మాత్రమే కనబడు తోంది. నాకు తప్ప ఆయన వేరెవరికి కనబడుట లేదు. ఆ మహా పురుషుడెవరు?” అని ప్రశ్నించాడు. అంత వ్యాస భగవానుడు ”అర్జునా! జగత్తుకంతటికీ ఈశ్వరుడైన సాక్షాత్తు మహేశ్వరుడు నీ ముందు నడుస్తున్నాడు. ఆ శంకరునే నీవు ప్రతి రోజూ దర్శిస్తు న్నావు. సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు సగుణ, నిర్గుణ రూపాలతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ తన లయ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. ధ్యానంలో తన ద్వి నేత్రాలను బంధించి త్రినేత్రమును జనింప చేసు కున్న త్రినేత్రుడు. అది నిత్య కాలాగ్నితో రగులుతుం టుంది.
సర్వసాక్షి, జటాధారి, జగదుత్పత్తి కారకుడు, విశ్వాత్మ, విశ్వ విధాత, కర్మాధికారి, కర్మ ఫలదాత, సర్వ కళ్యాణ కారకుడు, స్వయంభువు, భూతపతి, శశాంకధారి, భవుడు, సనాతనుడు, సర్వవాగీశ్వరే శ్వరుడు, నీలకంఠుడు, సూక్ష్మరూపుడు, మహా తేజస్వి, తీర్థ ప్రదాత, సూర్య స్వరూపుడు, సహాస్రా క్షుడు, సహస్ర బాహుడు, సహస్ర పాదుడు, వరదా యకుడు, భువనేశ్వరుడు, భోళారూపి, ధర్మ స్వ రూపుడు, బ్రహ్మాండధారి, శరణాగత వత్సలుడు అయిన శివ దేవుడు నీ ముందు నడుస్తున్నాడు. నీవు పుణ్యాత్ముడవు. భాగ్యశాలివి యుద్ధం ముగిసే వర కూ ఆ దేవాది దేవుని భక్తిశ్రద్ధలతో స్మరించు. సకల దేవ గణాలు ఆయనను నిత్యం పూజిస్తూ ఉంటాయి. ఆ మహా దేవుని విజయాలు అనంతం. అందులో ఒకటి నీకు చెబుతానంటూ వ్యాస భగవా నుడు చెప్పసాగాడు. పూర్వం కమలాక్షుడు, తారకాక్షుడు, విద్యు న్మాలి అను ముగ్గురు రాక్షసులు వరుసగా బంగారు, వెండి, ఇనుముతో మూడు ఆకాశ నగరాలను నిర్మిం చుకొని విమానాల వలే వాటిలో విహరించసాగారు. బ్రహ్మ వరగర్వంతో ఆముగ్గురూ దేవతలను, మాన వులనూ సకల జీవులనూ బాధించసాగారు. వారి అకృత్యాలకు తట్టుకొనలేక విలవిలలాడ సాగారు. ఇంద్రుడు వారిపై యుద్ధం చేసి విఫలుడైనాడు. చివరకు సకల గణాలు శంకరుని శరణు వేడారు. దేవతల ప్రార్థనను మన్నించి పరమేశ్వరుడు గంధ మాదనం, వింధ్యాచలం అను రెండు పర్వతా లను ధ్వజాలుగా చేసుకుని భూ మండలాన్ని రథము గా మార్చివేసాడు. శేషుడు ఇరుసుగాను, సూర్య చంద్రులు చక్రాలుగాను, ఏల ప్రత, పుష్ప దంతు లను రథ చక్రపు చీలలుగాను, మలయాచలాన్ని రథ కాడిగాను, సర్ప రాజు తక్షకుని త్రాడుగాను, చతుర్వే దాలు అశ్వములు, గాయత్రీ సావిత్రులను ప్రధాన సూత్రాలుగాను, సమస్త ప్రాణులను అశ్వముల కళ్ళెములుగాను, బ్రహ్మదేవుడు సారథిగా ఓంకార మును చెర్నాకోలగా చేసుకుని రథం తోలుతూ వుంటే పరమ శివుడు ఆ మహారథాన్ని అధిరోహిం చి యుద్ధానికి బయలుదేరాడు. మందరాచలాన్ని ధనస్సుగా వంచి చేత ధరించాడు. సాక్షాత్తు విష్ణువు అగ్నిని శిఖరాగ్రం చేసుకుని దివ్యాస్త్రంగా మారాడు. ఆ అస్త్రానికి వాయువు రెక్కలు, వైవస్వతుడు అస్త్ర వాలంగా మారి బలం చేకూర్చారు.
మేరువును ప్రధాన ధ్వజంగా చేసుకొని ఆ దివ్య రథంపై వేయి సంవత్సరాలు పరమ శివుడు ప్రయా ణించాడు. చివరకు ఆ మూడు పట్టణాలు ఆకాశం లో ఒకేచోటికి వచ్చినప్పుడు దివ్యాస్త్రంతో వాటిని నాశనం చేసాడు. ఆ పట్టణాలతోబాటు ముగ్గురు అసురులు భస్మమైపోయారు. అవి అగ్నిలో కాలి పోతున్నప్పుడు పార్వతీదేవి కూడ చూడడానికి వచ్చింది. బ్రహ్మాది దేవతలందరూ మహేశ్వరుని వేనోళ్ళ కీర్తించారు. భూ మండలం శాంతితో వర్ధి ల్లింది. త్రికాలజ్ఞులైన రుషులు పరమేశ్వరునికి శివము, ఘోరము అను రెండు ప్రధాన రూపము లున్నాయని భావిస్తారు. ఘోరరూపం అగ్ని, సూర్య రూపాలలో ప్రకాశిస్తూ ఉంటుంది. శివ రూపము మాత్రము సౌమ్యముగా నుండి జల, నక్షత్ర , చంద్ర రూపాలతో దర్శనమవుతుంది. సమస్త సనాతన వాఙ్మయంలో నున్న పరమ రహస్యమంతా ఆ మహాశివుడే! అటువంటి శివ మహాదేవుడు నీ ముందు నడుస్తూ ధర్మ రక్షణ చేస్తు న్నాడు. నీకు పాశు పతాస్త్రాన్ని ప్రసాదించినప్పుడే శివానుగ్రహం లభించింది. శంకరున్ని నిష్కల్మష హృదయంతో స్మరించిన వారికి ప్రతికూల గ్రహాలు కూడ అనుకూలంగా మారతాయి. శివ నామ స్మరణ సర్వ పాపహరణం. శివ కటాక్షంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. కానీ సృష్టి ధర్మానికి, ప్రకృ తి కి విరుద్ధంగా ప్రవర్తించే వారి పట్ల కుపితుడై సంహ రిస్తాడు. శంకరుడే రుద్రుడు, శివుడు, అగ్ని, సర్వజ్ఞుడు, ఇంద్రుడు, వాయువు, అశ్వినీకుమారులు, మెరుపు, మేఘం, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, కాలు డు, మృత్యువు, యముడు, రాత్రి, పగలు, మాస ము, పక్షము, ఋతువులు, సంవత్సరం, సంధ్య, ధాత, విధాత, విశ్వాత్మ, విశ్వకర్మ.
నిరాకారుడైనా సర్వ ఆకారాలు ధరించగలడు. లింగ రూపుడైనా అనంతమును ఆక్రమించగలడు. సకల భోగాలకు కారకుడు. సహస్రాక్షాలతో సకల భువనాలను వీక్షిస్తాడు. ఆయనను కొలిచే వారంద రికీ శుభాలను కలిగిస్తాడు. సర్వేశ్వరుడు అందరికీ అభయాన్నిస్తాడు. అందుకే శివుడైనాడు. స్థితికి కారణుడు కావున స్థితుడైనాడు. సకలోద్భవుడు అయినందున భవునిగా నిలిచాడు. అనంత రూపాలు, నామాలు కల శంకరుని వేదాలు శత రుద్రీయము, అనంత రుద్రీయము అను మహిమాన్విత బీజములతో ఉపాసిస్తున్నాయి. ఈ విధంగా అత్యంత మహిమగల, రహస్య మైన శివలీలను వ్యాస భగవానుడు అర్జునునికి చెప్పి అంతర్థానమయ్యాడు. శివ యోగం అత్యంత స్వచ్చమైన దీక్షతో గానీ పొందలేరని ప్రతీతి. ఫలాపేక్ష రహితమైన అనన్య భక్తితో గానీ శివానుగ్రహం లభించదు. అటువంటి నిర్మల ధ్యానంతో పరమ శివుని కరుణా కటాక్షాల కోసం ప్రయత్నిద్దాం.
ఓం నమ: శివాయ,
హరహర మహాదేవ శంభో శంకర.
– వారణాశి వెంకట
సూర్యకామేశ్వరరావు
8074666269