Saturday, November 23, 2024

విగ్రహారాధనలేని మాధవేశ్వరి శక్తిపీఠం

అష్టాదశ శక్తిపీఠాలలో 14వ శక్తిపీఠంగా పేరుపొందిన క్షేత్రం శ్రీ మాధవేశ్వరీదేవి శక్తిపీఠం. విలక్షణమైన ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్‌లోని త్రివేణిసంగమ ప్రాంతమైన ప్రయాగలో వుంది. అందుకే ప్రయాగను మాతృక్షేత్రం అంటారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి మాధవేశ్వరీదేవిని అర్చించినట్లు చెబుతారు. ఈ శక్తిపీఠంలో విగ్రహం ఉండదు. ఉయ్యాల మాత్రమే వుంటుంది. దానినే ఆరాధిస్తారు. భారతదేశంలో ఇలా విగ్రహారాధనలేని ఏకైక శక్తపీఠం ఇది ఒక్కటే. పౌరాణికంగానేకాక చారిత్రకంగా కూడా పేరు పొందిన ప్రదేశం ఇది.

హిందూ పురాణాల ప్రకారం దక్షుడుతన కుమార్తె అయిన దాక్షాయని, అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించకుండానే యాగం చేయాలని భావిస్తాడు. అయితే పుట్టింటిపై మమకారం వీడని దాక్షాయణి ఆహ్వానం లేకపోయినా యాగానికి వెళ్లి అవమానించబడుతుంది. దాన్ని తట్టుకోలేని దాక్షాయణి యజ్ఞ గుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు రుద్రుడైపోయి తన జఠాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. దక్షయాగాన్ని నాశనం చేసి దక్షుడిని సంహరించాల్సిందిగా సూచిస్తాడు.
వీరభద్రుడు ప్రమథగణాలను తీసుకువెళ్లి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడిని సంహ రిస్తాడు. పరమేశ్వరుడు దాక్షాయణి శరీరాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం చేస్తుం టాడు. దీంతో సృష్టికార్యం ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. సమస్య పరిష్కారానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలు చేయటం, అవి 18 ముక్కలుగా భారతదేశం లోని వివిధ ప్రాంతాల్లో పడి కాలక్రమంలో శక్తిపీఠాలుగా మారాయి. భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాయి. ఈ క్రమం ఇక్కడ దాక్షాయణి చేతివేలు పడిందని చెబుతారు. వేళ్ళు పడిన స్థలంగా చెబుతారు. ఈ క్షేత్రంలో విగ్రహారాధన వుండదు. ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది. దానికింద ఒక ఊయల ఉంటుంది. భక్తులు తాము తీసుకువెళ్ళినె కానుకలు ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకుంటారు. శ్రీహరి పాదాల చెంత పుట్టిన గంగానది నీరు స్వచ్ఛంగా ఉంటుంది. యమునా నది యముని పుత్రిక. గంగా, యుమునా కలిసే ఈ క్షేత్రం మాధవ క్షేత్రంగా పేరు పొందింది. అందుకే ఇక్కడి అమ్మవారినే మాధవేశ్వరీ దేవిగా పూజిస్తారు. ఈ అమ్మవారినే అలోపీమాతా, అలోపీ శాంకరీ అని పిలు స్తారు. ఇక్కడ విగ్రహారాధన ఉండదు. గర్భ గుడిలో కేవలం ఒక ఉయ్యా ల మాత్రం ఉంటుంది. దీనికే ప్రజలు పూజలు చేస్తారు.
శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడు, భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొన్నిరోజులు ఉన్నాడు. ఆ సమయంలో ఈ మాతను కొలిచాడని చెబుతారు. ఇలా శక్తి పీఠాల్లో విగ్రహారాధన లేని ఏకైక ఆలయాన్ని ఇక్కడ మాత్రమే చూడవచ్చు.
ఇక్కడికి వచ్చిన భక్తులు సంగ మ స్నానం చేసి తల నీలాలు సంగమ తీర్థంలో సమర్పిస్తుం టారు.
చనిపోయిన పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహి స్తారు. పూర్వం బ్రహ్మ దేవుడు ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో అనేక యజ్ఞా లు చేసాడు. కనుక ఈ చోటును ప్రయాగ అంటారు. ‘ప్ర’ అనగా గొప్ప అని ‘యా’ అనగా యాగము అని అర్థం. ఇక్కడి పితృ దేవతలకి ఆబ్దికాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి అమృత తీర్థం అని పేరు ఉంది. ఇక్కడి అమ్మవారిని మోహిని స్వరూపంగా కొలుస్తారు. ఈ క్షేత్ర దర్శనానికి దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. లక్షలాది మంది సాధువులు, సన్యాసులు; యాత్రికులు వచ్చి ఈ కుంభమేళా సమయంలో ప్రయాగలో స్నానం చేసి శ్రీ మాధవేశ్వరీదేవి ని దర్శించుకుంటారు.
చూడవలసిన ఆలయాలు

ఇక్కడకు 3 కి.మీ దూరంలో గంగా, యమునా, సరస్వతి నదుల త్రవేణి సంగమ క్షేత్రం ఉంది. మూడు నదులు వ్యక్తిగతంగా ఉంటాయి. అందువల్ల ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. సరస్వతీ నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. సమీ పంలోనే హనుమాన్‌ మందిరం, కంచివారి మఠం ఇంకా అనేక ఆలయాలు వుంటాయి. ప్రయాగ క్షేత్రంలో వటవృక్షం ఉంది. దీనినే అక్షయ వటం అని కూడా అంటారు. ఈ వృక్షమును విష్ణుమూర్తి గొడుగుగా భక్తులు భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement