Wednesday, January 8, 2025

గీతాసారం(ఆడియోతో…)

గీతాసారం… (ఆడియోతో…)
అధ్యాయం 2, శ్లోకం 41
41

వ్యవసాయాత్మికా బుద్ధి:
ఏకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ
బుద్ధయో వ్యవసాయినామ్‌ ||

తాత్పర్యము : ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా ! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును.

భాష్యము : వ్యవసాయాత్మికా బుద్ధి అనగా కృష్ణచైతన్యమును పాటించినట్లయితే జీవితపు లక్ష్యాన్ని సాధింగలమనే దృఢమైన విశ్వాసమును కలిగి ఉండుట. అటువంటి విశ్వాసము వాసుదేవుడైన కృష్ణుడే సర్వమునకు మూలము అను జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది. మొదలుకు నీరుపోస్తే చెట్టులోని అన్ని భాగములకు నీరు అందినట్లు కృష్ణున్ని సేవిస్తే అందరికీ అత్యుత్తమ మేలు చేసిన వారమవుతాము. మనకు, మన కుటుం బానికి, సమాజానికి, దేశానికి చివరికి మానవాళికంతటికి ! భౌతిక కార్యాలలో ఉండే మంచి, చెడు ఫలితాలకు కృష్ణ చైతన్యము అతీతమైనది. అయితే ఈ కృష్ణచైతన్యము, కృష్ణుని శుద్ధ ప్రతినిధి యొక్క వాక్కులను జీవత ధ్యేయముగా పాటించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి గురువు మన స్వభావాన్ని అర్థము చేసుకుని తగిన సూచనలను ఇవ్వగలిగి ఉంటాడు. అట్టి గురువు ప్రసన్నుడైనట్లయితే దేవాది దేవుడైన శ్రీ కృష్ణుడు మనపట్ల ప్రసన్నుడగుతాడు. కాబట్టి శరీర భావనకు అతీతముగా ఆత్మజ్ఞానములో స్థిరుడైన వానికే ఇది సాధ్యమగుతుంది. లేనట్లయితే మనస్సు వేర్వేరు ఫలితాలనాశించి భౌతిక కార్యాలకు పురిగొల్పుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement