Thursday, December 12, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 17
17

అవినాశి తు తద్విద్ధి
యేన సర్వమిదం తతమ్‌|
వినాశమవ్యయస్యాస్య
న కశ్చిత్‌ కర్తుమర్హతి ||

తాత్పర్యము : శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మ నశింపు లేనటువంటిదని నీవు తెలిసికొనుము. అట్టి అవినాశియైన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు.

భాష్యము : ఆత్మ ఉండుట వలన చైతన్యము శరీరమంతా వ్యాపించి ఉంటుంది. దానివలన శరీరములో ఎక్కడ బాధ కలిగినా అది మనకు తెలియుచున్నది. అయితే వేరే వారి శరీరానికి జరిగే బాధ మకు తెలియదు కాబట్టి ప్రతి శరీరములోనూ ఒక ఆత్మ ఉంటుందని మనము అర్థము చేసుకొనవచ్చు. వెంట్రుకను పదివేల భాగాలు చేస్తే అందు ఒకభాగము, ఆత్మయొక్క పరిమాణమని ఉపనిషత్తులందు తెలుపబడినది. మనము ఒక మందుగుళిక తీసుకుంటే దాని ప్రభావము శరీరమంతా ఉన్నట్లు ఈ చిన్న ఆత్మయొక్క ప్రభావము శరీరమంతటా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరము నుండి వేరు చేయబడుతుందో, శరీరము చలనము లేక మృత్యువు పాలవుతుంది. మనము ఎటువంటి ప్రయత్నము చేసినా ఆ శరీరములో తిరగి చైతన్యాన్ని తీసుకురాలేము. అనగా భౌతిక మూలకాల సమ్మేళనము ద్వారా ఆత్మను సృష్టించలేము. ఈ ఆత్మ, ప్రతి వ్యక్తి యొక్క హృదయమునందు పరమాత్మతో పాటు ఉంటుంది. కాబట్టి శాస్త్రజ్ఞులు కూడా హృదయమునుండే శరీరానికంతటికీ శక్తి పంపిణీ అవుతుందని గుర్తించగలిగారు. అయితే ఆత్మను భౌతికమైన పరికరాలతో కొలవలేము లేదా చూడలేము. అందువలన వారు ఆ శక్తి ఆత్మ నుండే వచ్చుచున్నదని గ్రహించలేకున్నారు. ఈ ఆత్మలు సూర్యకిరణాలైతే, ఆ కిరణాలకు మూలమైన సూర్యుడు భగవంతుడు. అందువలన వేదాలలో ఆత్మను భగవంతుని శక్తిగా వివరించటం జరిగినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement