Thursday, November 21, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 02
02

శ్రీ భగవాన్‌ ఉవాచ
కుతస్త్వా కశ్మలమిదం
విషమే సముపస్థితమే |
అనార్యజుష్టమస్వర్గ్యమ్‌
అకీర్తికరమర్జున ||
తాత్పర్యము : శ్రీ కృష్ణ భగవానుడు పలికెను : ఓ అర్జునా ! నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినద ? జీవితపు విలువనెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు. పైగా అపకీర్తిని కలిగించును.

భాష్యము : శ్రీ కృష్ణుడు ఇక్కడ భగవంతుడిగా సంభోదించబడ్డాడు. వ్యాసదేవుని తండ్రియైన పరాశరముని ప్రకారము భగవంతుడు అనకా సంపూర్ణ సంపదను, సంపూర్ణ శక్తిని, సంపూర్ణ కీర్తిని, సంపూర్ణ సౌందర్యాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని, సంపూర్ణ వైరాగ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి. సంపూర్ణముగా ఈ షడ్‌ ఐశ్వర్యాలను కలిగి ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనకు సమానుడు కాని అధికుడు కాని ఉండడు. ఆయన పరమాత్మకు, బ్రహ్మమునకు కారణభూతుడు, ఆ విధముగా సర్వమునకు మూలము. శ్రీమద్భాగవతము, శ్రీ బ్రహ్మసంహితల ప్రకారము శ్రీ కృష్ణుడే ఆ స్వయం భగవానుడు అని తెలియుచున్నది.

అలాంటి భగవంతుని సమక్షములో అర్జునుడు రోదించుట కృష్ణునికి ఆశ్చర్యాన్ని కలిగించినది. ఆర్యులు అనగా మానవ జీవితము యొక్క విలువను తెలుసుకుని, ఆత్మజ్ఞానమే లక్ష్యముగా జీవించేవారు. అర్జునుడు అటువంటి కుటుంబములో క్షత్రియుడిగా జన్మించి, శిక్షణ పొంది నేడు అనార్యుడుగా ప్రవర్తించుట, కేవలము భౌతికమైన భావనలను కలిగి ముక్తి గురించి ఆలోచించకుండుట ఆశ్చర్యకరము. స్వధర్మాన్ని వదిలివేసినట్లయితే ముక్తిగాని, కీర్తిగాని లభించదు. కాబట్టి కృష్ణుడు దానిని అభినందించలేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement