అధ్యాయం 2, శ్లోకం 01
01
సంజయ ఉవాచ
తం తథా కృపయావిష్టమ్
అశ్రుపూర్ణాకులేక్షణమ్
విషీదంతమిదం వాక్యమ్
ఉవాచ మధుసూదన: ||
తాత్పర్యము :
సంజయుడు పలికెను : చింతాక్రాంతుడై, కనుల యందు అశ్రువులను దాల్చి, కృపాపూర్ణుడైనట్టి అర్జునుని గాంచిన మధుసూధనుడు (శ్రీకృష్ణుడు) ఈ క్రింది వాక్యములను పలికెను.
భాష్యము : కరుణ అనేది శరీరము పట్ల మాత్రమే ఉన ్నప్పుడు అది భౌతికమవుతుంది. తత్ఫలితముగా కన్నీరు, బాధ మరియు నిరుత్సాహాన్ని పొందుతాము. అదే కరుణ అనేది ఆత్మపట్ల కనబరచినట్లయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చును. ఇక్కడ అర్జునుని స్థితి భౌతికమైన కరుణచే వచ్చినదని అర్థమవుతుంది. సముద్రములో మునిగిపోయే వాడి దుస్తులను రక్షించినంత మాత్రాన మనము ఆ వ్యక్తికి మేలు చేయలేము. వ్యక్తిని రక్షించవలసి ఉంటుంది. అలాగే మనము ఈ భౌతిక సంసారము నుండి బయట పడవలెనన్న ఆత్మజ్ఞానము అనవసరము. కాబట్టి అర్జునుని పరిస్థితి ద్వారా శ్రీకృష్ణుడు మననందరినీ ఉద్దేశించి భగవద్గీతా జ్ఞానమును పంచిపెట్టెను. ప్రత్యేకించి ఈ అధ్యాయమున ఫలాపేక్షలేని కర్మను ఒనరించుట ద్వారా ఆత్మజ్ఞానమును ఎలా పొందవచ్చుననేది చర్చించటం జరిగినది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..