Sunday, November 10, 2024

గీతాసారం.. (ఆడియోతో ..)

అధ్యాయం 6, శ్లోకం 46

తపస్విభ్యోపి యోగీ
జ్ఞానిభ్యోపి మతోధిక: |
కర్మిభ్యశ్చాధికో యోగీ
తస్మాద్యోగీ భవార్జున ||

తాత్పర్యము : యోగియైనవాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మరతుని కన్నను అధికుడైనట్టివాడు. కనుక ఓ అర్జునా! అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము.

భాష్యము : ‘యోగము’ అనగా మన చైతన్యాన్ని పరమ సత్యముతో జతపరచుట. అటువంటి జతపరచే సంబంధము ప్రముఖముగా ఫలాసక్తితో కూడుకొని ఉంటే దానిని ‘కర్మ యోగము’ అందురు. ఆ సంబంధము ప్రముఖముగా తాత్విక ఆలోచనలతో కూడుకొని ఉంటే దానిని ‘జ్ఞానయోగము’ అందురు. ఇక ఆ సంబంధము ప్రముఖముగా భగవత్సేవతో కూడుకొని ఉంటే దానిని ‘భక్తియోగము’ అందురు. భక్తి యోగము లేదా కృష్ణచైతన్యము అన్ని యోగముల పరిపక్వ స్థితియే ఉన్నది. తపస్సు, త్యాగములు అనేవి ఆత్మజ్ఞానము లేనిదే అసంపూర్ణము. అలాగే ఆత్మజ్ఞానము, భగవంతుని శరణాగతికి దారి తీయనట్లయితే అదియునూ అసంపూర్ణమే. అలాగే కృష్ణున్ని స్మరించకుండా కేవలమూ ఫలాసక్తితో చేసే కార్యాలు వృధా ప్రయాసలు మాత్రమే. కాబట్టి అన్ని యోగపద్ధతులలోకీ అత్యుత్తమమైనది భక్తియోగమని ఇచ్చట కొనియాడబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement