Monday, January 27, 2025

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 61
61

తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పర: |
వశే హి యస్యేంద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

తాత్పర్యము : ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును.

భాష్యము : యోగములో పరిపూర్ణత్వస్థితి కృష్ణచైతన్యమేనని ఈ శ్లోకము నందు వివరించుట జరిగినది. కృష్ణచైతన్యవంతులు కానిదే ఇంద్రియములను నిగ్రహించుట సాధ్యము కాదు. గొప్ప యోగి అయిన దుర్వాసముని అంబరీష మహారాజుతో తగాదా పెట్టుకుని కోపోద్రిక్తుడై గర్వముతో ఇంద్రియ నిగ్రహము కోల్పోయెను. అయితే భక్తుడైన అంబరీష మహారాజు దుర్వాసముని అంతటి గొప్పవాడు కాకపోయినా తన ఇంద్రియాలన్నింటినీ అద్భుతముగా భగవంతుని సేవలో వినియోగించుట ద్వారా ఆత్మ సంయమును పాటించి అన్ని అవమానాలను సహించి చివరికి విజయుడుగా నిలిచెను. ఈ శ్లోకమునందలి ‘మత్‌ పర’ అను ముఖ్యమైన పదమునకు అంబరీష మహారాజే ఉదాహరణ. వివిధ శాస్త్రాలు మరియు యోగసూత్రాల ప్రకారము యోగమనగా మనస్సుు విష్ణువుపై నిలుపుట. యోగి హృదయములో ఉన్న విష్ణువు పాపమును దగ్ధము చేసి హృదయమును పవిత్రము చేయును. శూన్యము మీద ధ్యానము చేయుట నిరర్దకము. భగవంతుని ధ్యానించుటయే యోగము యొక్క లక్ష్యము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement