Saturday, November 23, 2024

రావణుడు సంస్కారానికి అర్హుడన్న శ్రీరాముడు

ముల్లోకాలను భయపెట్టిన రావణుడు శ్రీరామచంద్రమూర్తి చేతిలో మరణించడంతో లోకాలన్నీ సంతోషించాయి. దేవతలు దుందుభులు మోగించారు. వారి వాక్యాలు స్తోత్రా లయ్యాయి. సమస్త జనవిరోధైన రావణుడు దేవలోకానికి వెళ్ళడం తో దేవతలు శాంతచిత్తులై సంతోషించారు. ఆకాశం నిర్మలమై ప్రకా శించింది. భూమి వణకడం ఆపుచేసింది. మందమారుతం సువా సనతో వీచింది. సూర్యుడు భయం లేకుండా ప్రకాశించాడు. నిర్భ యంగా జనులు వీధులవెంట తిరిగారు. యాగాల పొగలు ఆకాశా న్ని తాకాయి. లోకులంతా దిగులు మాని నిద్రించారు.
విభీషణుడు రావణుడి కళేబరాన్ని చూసి ఏడుస్తూ ఇలా ”ఎన్నో యుద్ధాలను జయించి, వీరుడని కీర్తి సంపాదించి, శాస్త్రా లెన్నో పఠించి, పండితులతో పొగడ్తలందుకుని, స్థిరంగా సౌఖ్యం ఇచ్చే పానుపు మీద పడుకునుండాల్సిన వాడివి అన్నా! ఇవ్వాళ ఇలా నేలమీద పడాల్సిన వాడివయ్యావు కదా! ఇలా జరుగుతుందని నీకు ఎన్నిసార్లు చెప్పినా కామాతిశయంతో నా మాటలు వినలేదు. కుంభకర్ణుడైనా, ఇంద్రజిత్తయినా, ప్రహస్తుడైనా, నరాంతకుడైనా, అతికాయుడైనా బలంకలవారిమని ప్రవర్తించారే కాని ధర్మం శ్రేయ స్కరమని, అధర్మం హానికరం అన్న నీతిని పాటించలేదు కదా? నువ్వు కూడా ఆలోచించలేదు. దాని ఫలమే ఇప్పుడు ఇలా ప్రాప్తిం చింది. కాలాన్ని ఎవరు తప్పించగలరు?” ఏడుస్తున్న విభీషణుడిని ఓదారుస్తూ శ్రీరామచంద్రమూర్తి ”విభీషణా! ఎందుకు ఏడుస్తున్నావు? బలహనుడై యుద్ధం చేయలేక అవమానపడి చావలేదితడు. ఓడిపోతానని ఏమాత్రం సందేహం లేకుండా, చస్తానేమోనన్న భయం లేకుండా, అపరిమితమైన ధైర్యంతో చేతనైనంత దాకా యుద్ధం చేసి చనిపోయాడు. యుద్ధంలో క్షాత్ర ధర్మంతో వీరమర ణం పొందినవారికోసం ఏడవడం న్యాయమా? యుద్ధంలో అస మాన బలంతో పోరాడి వీరులు పోయే స్వర్గానికి పోయాడు. ఇలాంటివాడి కోసం ఏడవడం తగునా? క్షత్రియ ధర్మం ఇదీ అని నిశ్చయించుకుని, వాస్తవం అర్థం చేసుకుని, తరువాత జరగాల్సిన పనికై త్వరపడు. విభీషణా! పగ అనేది జీవిత కాలంలోనే కాని చచ్చినవాడి మీద కాదు. ఇప్పుడు మనం ఏం చేసినా అతడేమి చేయ గలడు? ఆ విధంగా ప్రతీకారం ఏమీ చేయలేనివాడి విషయంలో మనం ఏదీ చేయకూడదు. అతని మీద పగ అతని మరణంతోనే ముగిసింది. కాబట్టి ఇక చేయాల్సిన సంస్కారాలు చేయి. రావణుడు నీకు ఎలాంటివాడో నాకూ అలా గే. నీకెలా తోడబుట్టిన వాడు అన్న ప్రేమకలదో నాకూ అలాగే వుంది. నీకు తోడబుట్టినవాడైనప్పుడు, నువ్వు నాకు తోడబుట్టిన వారిలో ఒకడివైనప్పుడు అతడు మాత్రం అలా కాడా? కాబట్టి అన్నకు కర్మలు చేసే విషయంలో నేను అన్యధా భావిస్తానని అనుకోవద్దు” అన్నాడు.
ఇలా శ్రీరాముడు విభీ షణుడితో అంటున్న సమ యంలోనే రావణుడి భార్యలు, రాక్షస స్త్రీలు అంత:పురం వదిలి ఏడ్చుకుంటూ వచ్చారక్కడికి. ”హా రాజనందనా! హా జీవితేశ్వరా! హా ప్రాణ నాయకా! హా మదీశ! హా నాథా! హా పతీ!” అనుకుంటూ ఏడ్చారు. ముల్లోకాలను జయించిన వీరుడివి ఒక మనిషి చేతిలో చచ్చావా? అని ఏడ్చారు. సీతను రాముడికి ఇచ్చి వుంటే ఇంత జరిగేది కాదు కదా? అని ఏడ్చారు. ”నీ ఒక్కడి మూర్ఖత్వం వల్ల నువ్వు, మేము, వూరివారంతా చెడిపోయాం కదా? నీ మృతికి కామం కారణం కాదు. అంతా దైవ వశం. దైవం తప్పుగా చూస్తే ఏదైనా జరుగవచ్చు. నీ నాశనానికి దైవమే కారణం. విధి సంకల్పం తప్పించడం ఎవరి తరం కాదు” అని ఏడ్చారు.
రావణుడి పెద్ద భార్య మండోదరి యుద్ధభూమికి చేరుకొని దు:ఖం ఆపుకోలేకపోయింది. మండోదరి వీరపత్నికదా! వీరపత్ని అంటే భర్త గెలిచినపపుడు ఎంత సంతోషపడాలో, వీరమరణం పొందినప్పుడు కూడా తన వీరపత్నీత్వానికి హానిరాలేదు కదా అని సంతోషించాల్సి వుండగా పామరురాలిలాగా ఇలా ఏడవవచ్చా? మండోదరి రావణుడి మరణానికి ఏడవలేదు. ”రావణుడు తన కంటే అధములని భావించే మనుష్యుల చేతిలో చచ్చి, తన వీరపత్నీ త్వానికి హాని కలిగించాడు కదా! ఇదెంత లజ్జావ#హం? ఎవరైనా నీ భర్త మనుష్యుడి చేతిలో చచ్చాడే, ఇది నిజమా? అంటే తానేమి చెప్పాలి? ముల్లోకాలను గెలిచిన నిన్నొక మనుష్యు డు చంపాడంటే నమ్మలేక పోతున్నాను. మనిషి మనుష్యులను తినేవాడిని చంప డంలో ఏం న్యాయం వుందో చెప్పు. ఇది అవమానకరం కదా! సకల శస్త్రాస్త్రాలను పరిపూర్ణంగా తెలిసిన యుద్ధకోవిదుడివైన నిన్ను యుద్ధంలో రాముడు చంపడమా? నమ్మలేకపోతున్నాను ప్రాణ నాథా!” అంటూ విలపించింది మండోదరి.
”ప్రాణశ్వరా! నువ్వు సీతాదేవిని ఏమని అనుకున్నావు? ఆమె వల్లే కదా, వసుధకు వసుధ అన్న పేరు వచ్చింది. శ్రీ, శ్రీ అయింది. అలాంటి స్త్రీరత్నమైన పతివ్రత సీత. అలాంటి దాన్ని నువ్వు భక్తితో ఆశ్రయించి వుంటే ఎంతో బాగుపడేవాడివి. ఆ మార్గాన్ని వదిలి మహారణ్యంలో, ఏమూలనో, ఎవరూలేని చోట ఆమె వున్నప్పుడు మోసగించి ఏడుస్తున్నా ఎత్తుకు వచ్చావు. ఇది నిన్ను నువ్వు నాశ నం చేసుకునే కార్యక్రమం కాదా? అపహరించడం తప్ప ఆమెవల్ల నువ్వు అనుభవించిన సుఖం ఏమైనా వుందా? సుఖానికి బదులు ఆమె పాతివ్రత్యంలో కాలిపోయావు. వాస్తవానికి నువ్వామెను తాకిననాడే భస్మం కానందుకు నిన్ను చూసి దేవతలు భయపడ్డారు. నువ్వు చేసిన పని పాపకార్యం అయితే అప్పుడే పాపఫలం ఎందుకు అనుభవించలేదు అని అడగవచ్చు నువ్వు. దానికి కారణం వుంది. విత్తనం వేయగానే ఫలం నోటికి రాదు. కాలపక్వం కావాలి. పాపం చేసినవాడికి ఆ పాపఫలం కాలపక్వమైనప్పుడే అనుభవంలోకి వస్తుంది. అప్పుడిక ఏం చేసినా పోదు. నిర్భాగ్యదశ పక్వమై నీకిలాం టి దుర్భుద్ధి కలిగింది. నువ్వెప్పుడైతే సీతను తెచ్చావో అప్పుడే సత్య వాదైన నామరది విభీషణుడు రాక్షసులు అంతా నాశనమవ ుతారని హచ్చరించాడు. విభీషణుడి ప్రయత్నాలు ఫలించలేదు. మాట విన ని నీలాగే రాక్షసులంతా నాశనం అయ్యారు. చేసిన దానికి ఫలం అనుభవించడానికి నీ గతికి నువ్వు పోయావు. కాబట్టి నీకొరకు నేను దు:ఖపడడం లేదు. నాగతి ఏమిటని నేను నాకై దు:ఖిస్తున్నాను.”
చనిపోయిన అన్న రావణాసురుడికి ద#హన సంస్కారాలు జరి పించమని రామచంద్రమూర్తి తనకు చెప్పడంతో, విభీషణుడు ధర్మం ఏంటని ఆలోచన చేశాడు. రాముడు చెప్పినట్లే చేయడం ధర్మమని తీర్మానించుకుని ఇలా జవాబు చెప్పాడు రాముడికి.
”ధర్మ ప్రవర్తన వదిలినవాడు, దయలేని చోరుడు, అసత్య వాది, పర స్త్రీలను బాధించినవాడు రావణుడు నాకు అన్నే కాని నడ వడిలో నాకు గొప్ప శత్రువు. ప్రపంచానికి ఉపద్రవం కలి గించిన వాడికి నేనిప్పుడు శాస్త్ర ప్రకారం సంస్కారాలు చేయాలి? నేనాపని చేయలేను. అన్న అయినా లౌకిక గౌరవాలు చూపుతాను కాని పార లౌకిక కర్మలకు అర్హుడు కాదు. ఉత్తరక్రియలు చేయకపోతే నన్నెవ రైతే శాస్త్ర నియమం తప్పాడని అంటారో వారే అన్న నడవడి తెలు సుకుంటే విభీషణుడు సరైన పనేచేశాడని మెచ్చుకుంటారు.”
ఈ మాటలకు రాముడు ”విభీషణా! రావణుడు సంస్కారార్హు డు కాడు, పతితుడు అనడానికి నువ్వు చెప్పిన కారణాలు నేను తప్ప ను. అవి నాకు తెలియకా కాదు. అతడు అధర్మానికి భయపడడని, అసత్యవాదని, నీతిమాలినవాడని నాకు తెలుసు. తెలిసికూడా వాడి కి సంస్కారం చేయమని చెప్పాను. ఎందుకంటే, పతితుడికి పరలోక క్రియలు లేవనడం లోక సామాన్య విధంగా చస్తే నిజమే కాని, ధర్మ యుద్ధంలో న్యాయరీతిన చనిపోయిన వీరుడి విషయంలో కాదు. అతను బలశాలి, శూరుడు, తేజస్వి, ఇంద్రాదులకైనా వెనుదీయని వాడు.అలాంటి రావణుడు, పర్వతంలాంటి ధైర్యశాలి, సామాన్యు డా? యుద్ధంలో చనిపోయాడు. వీరస్వర్గం లభించాలి. నువ్వు అతనికి సంస్కారం చేయకపోతే ప్రేతత్వం పోదు. ప్రేతత్వం పోక పోతే స్వర్గప్రాప్తి లేదు. నీ అన్న కష్టపడి సంపాదించిన స్వర్గ సుఖాన్ని సంస్కరించని నువ్వు దాన్ని విఘ్నపరచడమే కాకుం డా ప్రేతత్వ బాధ కలిగించినవాడివవుతావు. పాపాత్ముడైనా వీర మరణం పొం దినవారికి వీర స్వర్గం వుంటుంది. కాబట్టి సంస్కారానికి అర్హుడు. రావణుడులాంటి పాపికి సంస్కారాలు చేసిన కీర్తి నీకు వస్తుంది.”
శ్రీరాముడు మాటలకు స్పందించి విభీషణుడు సంస్కారానికి కావాల్సిన సరకులన్నీ తెప్పించి, శాస్త్రోక్తంగా రావణుడికి ద#హన సంస్కారాలు జరిపించాడు. స్నానం చేసి తడిబట్టలతో నువ్వులు, నీళ్ళతో తర్పణాలు విడిచాడు. ఆ తరువాత నమస్కారం చేసి, ఆడ వారున్న చోటుకు వెళ్ళి అందరినీ నగరంలోకి పంపించి, నిర్మల మైన మనస్సుతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చా డు విభీషణుడు.

(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి
రామాయణం మందరం ఆధారంగా)
– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement