Friday, September 6, 2024

వినదగు నెవ్వరు చెప్పిన…!

నం సాధారణంగా సలహాలు ఉచితంగానే ఇచ్చేస్తుంటాం. అవతల వ్యక్తి అడిగినా, అడగకపోయినా సలహాలు మాత్రం అందరం ఇస్తూంటాంకదా! చిన్న వయసులో అమ్మ నాన్న, గురువులు, పెద్దలు చెప్పినట్లుగానే మనం నడుస్తుంటాము. ఎదిగే కొద్ది మన లో స్వతంత్ర భావాలు, ఆలోచనలతోనే ముందుకు వెడుతుంటాము. జీవన గమనంలో ప్రతివారు సలహాలు పొందకుండా ఉండలేరు. ఒక్కొక్కప్పుడు ఇతరులు ఇచ్చే సలహా, సూచనలు మన శ్రేయస్సు కోరేవే అయినా, ఒక్కో సందర్భంలో మనకు బుర్రకెక్కదు. అందుకే-

”వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగ పడక వివరింపదగున్‌
గని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహలో సుమతీ!”

అంటే లోకంలో ఎవరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడు ఉత్తముడు. ఏదేని విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా నిజానిజాలను గ్రహంచాలి. అటువంటి వాడే భూ ప్రపంచంలో నీతిపరుడుగా నిలుస్తాడని సుమతీ శతక కర్త ఏనాడో చెప్పాడు. ఇతిహాసా లులోని ఇలాంటి కొన్ని సంఘటనలు పరిశీలిద్దాం.
సీతాపహరణంలో తనకు సహాయం చేయమని రావణుడు మారీచుడుని కోరిన సం దర్భంలో, మారీచుడు మాట్లాడుతూ ”ఓ! రాజా! స్వేచ్ఛగా, నిరంకుశంగా ప్రవర్తించే నీవు, లంకా పట్టణానికి రాజుగా ఉన్నందుకు రాక్షసులతో నీతోనూ లంక పూర్తిగా నశించిపోతుంది సుమా! గొప్ప పరాక్రమవంతుడు రాముడు ఇంద్రవరుణలతో సమానుడు. నువ్వు రాముని గూర్చి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఓ! రావణా! నీవు సీతను ఎత్తుకొచ్చి, రాము నితో విరోధము పెట్టుకొంటే శీఘ్రంగానే ఘోరమైన ఆపదలు పొందుతావు. సీతామాత మహా పతివ్రత. గుర్తుంచుకో. రాముని బాణం ఎంత భయంకరమైనదో, నేను పూర్వము చూ సి ఉండుటచేత, అతని పరాక్రమము తెలిసినవాడను కాబట్టి నేను తప్పించుకో జాలితిని. ఓ! రాక్షస రాజా! నేను స్వప్నంలో కూడా రాముడ్ని చూసి ఉలిక్కిపడి భయపడుతున్నాను నీవు సీతను ఎత్తు కొస్తే, రాముడితో యుద్ధం నీకు తగదు.
రావణా! నీ హతము, లంక హతము కోరి చెపుతున్నాను. కాదు- కూడదు అంటే నువ్వు చెప్పినట్లే, మాయాలేడి వేషంలో వెళ్ళి, నీకు అవకాశం కల్పిస్తాను. నీ చేతుల్లో మరణించే కంటే, శ్రీరాముని చేతిలో మరణించడం మేలు కదా!” అని చెప్పాడు. అయినా సీతను ఎత్తుకు రావడం జరిగింది.
సీతను ఎత్తుకొచ్చి అశోకవనంలో ఉంచిన తరువాత మండోదరి, తన భర్త రావణాసురు డుతో ”నాథా! నేనో విషయం చెపుతున్నాను. మన్నించండి. సీతను రాముడుకి అప్పగించే యండి. సీత మహా పతివ్రత. సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపం. ఆమెను లోబరచుకోవడం వల్ల లంకకు చేటే కాని ప్రయోజనం ఏమీ ఉండదు. ఇంతకాలం అశోకవనంలో తన భర్త రాముడినే తలుస్తూ, మరో ఆలోచన లేకుండా వ్యథతో జీవిస్తోంది. పతివ్రత అయిన సీతను తాకితే ‘అగ్ని జ్వాలల్లో’ చిక్కుకొన్నట్లే. బాగా ఆలోచించండి.” అని హతవు పలికింది. అయి నా రావణాసురుడు పట్టించుకోలేదు. చివరికి లంకా దహనమయ్యింది. రావణాసురుడితో సహా రాక్షసులు ప్రాణాలు కోల్పోయారు.
కౌరవుల కొలువులో మంత్రిగా ఉన్న విదురుడు, ధృతరాష్ట్రుడుకి ”పాండవులకు అర్థ రాజ్యభాగం ఇవ్వండి. మనకు క్షేమం కలగాలంటే ధర్మాన్ని కాపాడుకోవాలి. నిండు సభలో పాండవుల భార్య పాంచాలికి ఆవిధంగా అవమానం జరగడం వల్ల ధర్మం గాడి తప్పింది. అందుకు కౌరవ వినాశం తప్పదు. క్షేమం కలగాలంటే అర్థ రాజ్యభాగం ఇచ్చి సంతుష్టుల్ని చేయండి.” అని చెపితే, ధృతరాష్ట్రుడు కోపంతో ”నువ్వు పాండవ పక్షపాతంతో ఎల్లప్పుడూ మా నాశనాన్నే కోరుకొంటుంటావు. వక్ర స్వభావుడవైన నీ మీద నాకు ఎప్పుడూ గౌరవ భావం లేదు. నీవు నీ ఇష్టం వచ్చినచోటకు వెళ్ళిపోయినా సరే! ఉన్నా సరే!” అంటూ తన మన సులోని భావాన్ని కోపంతో చెప్పారు. భీష్ముడు, ద్రోణుడు, వంటి మహనీయులు చెప్పినా దృతరాష్ట్రుడుకి పుత్ర వ్యామోహం కొద్దీ వినకపోవడంతో, కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం అయ్యింది. కౌరవులంతా నశించిపోయారు కదా.
వాజశ్రవుడు అనే రాజుకు ఉద్ధాలకుడు అనే మరో పేరు కూడా ఉంది. ఆయన ఒకసారి ”విశ్వజిత్‌ యాగం” చేస్తున్న సందర్భంలో తన సంపాదనలో తన అవసరాలకు తగినంత మాత్రమే ఉంచుకొని, మిగిలిన సంపదనంతా బ్రాహ్మణులకు దానమిస్తున్నాడు. అందులో ముసలి గోవులు, ఒట్టిపోయిన గోవులు, దానానికి పనికి రాని గోవులను దానం చేస్తూంటే ఆయన కుమారుడు ”నచికేతుడు” గమనించి ”ఇటువంటి దానాలు చేయడం వల్ల యజ్ఞ ఫలం ఎలా దక్కుతుంది? ఆనంద లోకాలకు ఎలా చేరగలడు?” అని ఆలోచించి, తండ్రి వద్ద కు వెళ్ళి ”తనను ఎవరికి దానమిస్తున్నావు?” అని అడుగుతాడు. తండ్రి సమాధానం ఇవ్వక పోతే మళ్ళీ అడిగాడు. అపుడు తండ్రి క్రోధంతో. ”నిన్ను యముడికి దానం ఇస్తున్నాను” అంటాడు. నచికేతుడు చాలా బాధపడి తనకు తెలుసున్న విద్యలు ఉపయోగించి యమద ర్శనానికి వెళ్ళిపోయాడు. తరువాత తండ్రి చాలా చింతించాడు. మంచి చెప్పినా, నేను క్రోధంతో ప్రవర్తించాను. అని చాలా వగచాడు.
వేమన తన యుక్తవయసులో అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉండేవారు. బాధ్యతలేదు. తల్లి తండ్రులు, వదిన గారు, ఎంతమంది చెప్పినా మార్పు రాలేదు. ఒకరోజు తన వేశ్య అడిగిన వస్తువు గురించి వదిన వద్దకు వచ్చి, ఆమె ముక్కెర అడిగాడు. మరిది వేమనలో మార్పు కు తగిన సమయం అని గుర్తించి ఆమె తన ముక్కెర ఇస్తూ, ”నువ్వు దీన్ని తీసుకుపోయి వేశ్య నగ్నంగా ఉండి, తలదించుకొని, రెండు కాళ్ళ మధ్యనుండి దీన్ని అందుకోమ”ని చెప్పి పం పింది. వేమన నగ్నంగా ఉన్న ఆమెను చూసేసరికి చలించిపోయాడు. జీవితం ఇంతేనా? ఎందుకీ వెంపర్లాడటం? అని విరాగిగా మారిపోయాడు. ఆ విరాగి, యోగి నుండే ఎన్నో జీవిత సత్యాలు ఆందించబడ్డాయి.
ఇలా ఎన్నో ఉదాహరణలు మనకు పురాణాల్లో, జీవిత చరిత్రలలో కనపడతాయి. అందుకే మనం ఎవరు ఏమి సలహా చెప్పినా, ఓర్పు, సహనంతో విని మంచిచెడ్డలు విచారించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement