Monday, November 18, 2024

తిరుమల ఘాట్‌ రోడ్డులో పడిన కొండచరియలు

ఆర్టీసీ డ్రైవర్‌ అప్రమత్తం.. తప్పిన పెనుప్రమాదం
రెండవ ఘాట్‌లో రాకపోకలకు బ్రేక్‌
మొదటి ఘాట్‌రోడ్డులో ఓకే
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
నేడు ఢిల్లీ ఐఐటీ నిపుణుల రాక

తిరుమల, ప్ర‌భ న్యూస్ ప్ర‌తినిధి : తిరుమల ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే రెండవ ఘాట్‌ రోడ్డులో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే, ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవ డంతో పెద్దప్రమాదం తప్పింది. సంఘటన ప్రాంతానికి చేరువగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ రాళ్లు కదలడాన్ని గమనించి వెంటనే బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఘాట్‌రోడ్డులో 16వ కిలోమీటర్‌ వద్ద భారీ కొండ చరియ విరిగిపడి.. దొర్లుతూ దిగువ మలుపుల్లోని మూడు రోడ్లపైకి దొర్లింది. భారీ రాళ్లు పడటంతో వాటి ధాటికి పలు చోట్ల రోడ్డు కుంగిపోవడంతో పాటు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ ఘటనతో రెండవ ఘాట్‌రోడ్డులో వాహన రాకపోకలు నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో కొద్ది రోజులుగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నవంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షాలకు కొండ ప్రాంతం భారీగా నాని పోవడంతో పలు చోట్ల కొండ చరియలు తరచూ రోడ్డుపై పడుతున్నాయి. ఇప్పటికే ఘాట్‌రోడ్డులో 9, 11, 12, 14, 16వ కిలోమీటర్‌, హరిణి వద్ద పాటు 13 ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. గత వారం ఘాట్‌రోడ్డును పరిశీలించిన ఐఐటి నిపుణుల బృందం ఘాట్‌ రోడ్డులో పలు చోట్ల ప్రమాదకరమైన పరిస్తితులు ఉన్నాయని తేల్చారు. వారి సూచ నల మేరకు ఇంజనీరింగ్‌ అధికారులు ఘాట్‌రోడ్డులో మరమత్తు పనులు చేస్తుండగా నే బుధవారం ఉదయం 16 వ కిలోమీటర్‌ వద్ద ఓ భారీ కొండచరియ విరిగి పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేవు. అయితే సంఘటనా ప్రాంతానికి సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు వెడుతోంది. అయితే కొండ చరియ కదలడాన్ని గమ నించిన డ్రైవర్‌ ముందుగానే బస్సును నిలిపివేశారు. ఆపిన కొద్దిసేపటికే కొండ చరియ పడింది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న దుమ్ము, కొండపైనుంచి పడిన మట్టితో ఆ ప్రాంతం అంతా మసకబారింది. మొత్తం నల్లగా దుమ్ము కమ్మేసిందని ప్రత్యక్ష సాక్షి అయిన డ్రైవర్‌ సుబ్రమణ్యం తెలిపారు. ఘాట్‌రోడ్డులో కొండచరియ విరిగి పడిందని సమాచారం అందుకున్న టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది అప్రమత్తమై ముందుగా రెండవ ఘాట్‌రోడ్డులో వాహన రాక పోకలను పూర్తిగా నిలిపివేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకుంగిన ప్రదేశం వద్దకు వాహనాలను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. అప్పటికే ఘాట్‌రోడ్డులో చాలా వాహనాలు ఘటానా స్థలానికి సమీపంలోకి రావడంతో భద్రతా సిబ్బంది వాటిని నిలిపివేశారు.
మొదటి ఘాట్‌లో రాకపోకలు యథాతథం: ఈవో
తిరుపతి – తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో రెండో ఘాట్‌రోడ్డులోని 13 వ కిలోమీటర్‌ వద్ద, 15వ కిలోమీటర్‌ వద్ద కొండ చరియలు విరిగి పడి రక్షణ గోడు, రోడ్లు ధ్వంసమయ్యాయని, వీటి పునురద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతు న్నాయని పేర్కొన్నారు. మొదటి ఘాట్‌రోడ్డులో వాహన రాకపోకలు కొనసాగుతు న్నాయని, సాయంత్రం 4 గంట ల వరకు తిరుపతి నుంచి తిరుమలకు, 2,300 వాహనాలు, తిరుమల నుంచి తిరుపతికి 2,000 వాహనాలు ప్రయాణించాయని వివరించారు. చెన్నై ఐఐటి ప్రొఫె సర్లు తిరుమలకు చేరుకుని విరిగి పడిన కొండచరి యలను పరిశీలించారని, ఢిల్లిd ఐఐటీ ప్రొఫెసర్లు గురువారం ఘాట్‌రోడ్డును పరిశీలిస్తారని తెలిపారు. ఐఐటి నిపుణులు పూర్తి స్థాయిలో పరిశీలించి సమర్పించే నివేధిక తరువాత తదుపరి చర్యలు చేపడతామని ఈవో వివరించారు.
వాయిదా వేసుకుంటే మంచిది: చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అప్‌ ఘాట్‌రోడ్డులో కొండ చరియలు విరిగి పడటం వల్ల నాలుగు చోట్ల భారీ ప్రమాద జరిగిందని, అయితే శ్రీవారి దయవల్ల ఎవరూ గాయపడలేదని చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డి, అధికారులు చెప్పారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్న డూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్‌రోడ్డుులలో కొండ చరియలు విరిగి పడుతున్నాయని తెలిపారు. ఎగువ ఘాట్‌రోడ్డులో మరో ఐదారు కొండ చరియలు విరిగి పడే ప్రమాదం గుర్తించామని, వీలైనంత త్వరలో రోడ్డుమర మత్తులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసు కోవాలని అధికారులకు ఆదేశిం చామని చైర్మెన్‌ చెప్పారు. ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల బృందం రాగానే టీటీడీ ఇంజినీరింగ్‌ , విజిలెన్స్‌ అధికారులతో కలసి వారు ఘాట్‌రోడ్డు పరిశీలన చేస్తారన్నా రు. కొండ చరియలు విరిగి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయంపై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పి స్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగ కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్‌ చేసుకుని వాహనాల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్ట్యా తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లో దర్శనం తేదీ మార్చుకునే అవకాశం ఉందని తెలిపారు. నడక దారిలో తిరుమలకు వెళ్ళే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement