మన పురాణాల ప్రకారం కృతయుగంలో పులస్త్యుడు అనే బ్రహ్మర్షికి, తృణబిందుడు అనే మరొక మహర్షి కూతురు అయిన ఇలబిలకు వివాహమై వారికి కొడుకు కలిగాడు. అతడే నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు. ఇతని నగరం కైలాసానికి సమీపంలో ఉన్న అలకాపురి. ఈయన ఉత్తర దిక్కుకు దిక్పాలకుడు. కుబేరునికి ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, ఐలబిలుడు, భూతేశుడు, గుహ్యకాధిపతి మయురాజు, నర రాజు, గుహ్యాధిపుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ”కుత్సితంబేరం శరీరం యస్యస: కుబేరం.” బేరము అంటే శరీరము అనే అర్థం కూడా ఉంది. కుబే రుడు అంటే అవలక్షణములతో కూడిన శరీరం కలవాడని అర్థం. కుబేరుడు పొట్టిగ, బానకడుపుతో, మూడుకాళ్లు, ఒక కన్ను, ఎనిమిది దంతాలతో ఉంటా డని పురాణోక్తి. శ్రీవిష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో మణు లు పొదగబడిన ఆభరణాలతో, మీసం, గడ్డం కలిగి, దంతాలు బయటకు వచ్చి, తల ఎడమ వైపుకు వాలి ఉంటుంది.
శివపురాణం ప్రకారం పులస్త్య మహర్షి, మానిని అనే దంపతులు కలిగిన కొడుకు పేరు విశ్రవుడు. అంటే వేదాధ్యయమును విన్నవాడు అని అర్థం. విశ్రవునిని విశ్రవ బ్రహ్మ అని కూడా అంటారు. ఇతడు జ్ఞానం, శక్తి విషయాలలో తండ్రితో సమానుడై నిత్యం తపస్సులో ఉండేవాడు. విశ్రవునికి యుక్త వయ స్సు వచ్చాక భరద్వాజ మహర్షి కూతురైన దేవవర్ణితో పెండ్లి జరిగింది. వీరిరు వురికి జన్మించినవాడు వైశ్రవణుడు. ఇతడే కుబేరుడు. ఇతని భార్య పేరు చార్వి. కుబేరుడు బాల్యం నుండి శివభక్తి తత్పరుడు. ఇతను పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమై కుబేరునికి లోకపాలకునిగా, ధనా ధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్థానమయ్యాడు. ఆ తర్వాత తాను ఎక్కడ ఉండాలో తెలియక కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్య క్షమై కుబేరునికి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతంపై, సముద్ర మధ్యభాగంలో గల లంకా పట్టణంలో ఉండమని, పూర్వం ఆ నగరంలో రాక్షసులు ఉండేవారని, విష్ణు భయంతో వారంతా పాతా ళానికి పారిపోయారని, కనుక అక్కడ ఉండమని చెప్పి అదృశ్యమయ్యాడు. అలాంటి రాక్షసుల నగరానికి (లంకకు) రాజైన కుబేరుడు రాక్షసాధిపతి అయ్యాడు. పాతాళ రాజైన సుమాలి కూతురు కైకసి విశ్రవ బ్రహ్మకు రెండవ భార్యై, రావణ, కుంభకర్ణ, విభీషణులకు జన్మనిచ్చింది. ఆవిధంగా ఆ ముగ్గు రూ కుబేరునికి సోదరులయ్యారు. కుబేరుని భోగభాగ్యాలు చూచిన రావణు డు, శరీర బలంలో తనకన్నా తక్కువవాడైన కుబేరునిపై దండెత్తి అతనిని తరి మివేసి లంకను, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరానుగ్రహం కోసం తపస్సు చేశాడు. సదాశివుడు ప్రత్యక్షమై లంకానగరాన్ని మించిన దివ్య భవనాలు, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనంలో నవనిధులు, మణిమాణిక్యాలతో నిండి, సకల ఐశ్వర్యాలతో కూడిన అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి కుబేరునికిచ్చాడు. ఇక ఇక్కడే ఉండి, యక్ష, గంధర్వ, మయులకు, గుహ్యులకు రాజువై ఉండమని వరమి చ్చాడు. ధనదుడవై, ఉత్తర దిక్పాలకునిగా, తనకు ప్రియమిత్రునిగా వర్థిల్లమని చెప్పి, కుబేరునికి మంచి రూపాన్ని ప్రసాదించి శివుడు మాయమయ్యాడు.
మణిమాణిక్యాలు, సంపదలతో నిండి, కలప వృక్షం నుండి వీచే చల్లని గాలిని, సుగంధ సువాసనలను ఆస్వాదిస్తూ, గంధర్వ కాంతల గానానికి అను గుణంగా రంభ, చిత్రసేన, మిశ్రకౌశి, మేనక, ఊర్వశి, సహజన్య, శౌరభేయి, బుల్బుద, లత వంటి అప్సరసల నాట్యాలను చూసి ఆనందిస్తూ, మణిభద్రు డు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హారికాక్షుడు, విరూపాక్షుడు అనే అనుచరుల సేవలందుకొంటూ సుఖంగా ఉన్నాడు కుబేరుడు. ఇటువంటి కుబేరుని నగర శోభ గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పినట్లు మహాభార తంలో కన్పిస్తుంది. కుబేరునికి ఏకాకి పింగళుడు అనే మరొక పేరు కూడా ఉంది. ఒకసారి పార్వతీదేవి శివుని ఎడమ తొడపై కూర్చొని ఉండటం కుబేరు డు అసూయతో చూశాడట. అదిచూచి పార్వతీదేవి అతనిని కుబేరుడవు కమ్ము అని శపించిందట. కు(చెడు) దృష్టితో చూచాడు కాబట్టి ఇతని కన్ను కామెర్ల రోగికి వలె పచ్చగా మారిపోయింది. అంటే పింళాక్షుడైపోయాడు. అందుకే ఇతనికి ”ఏక పింగ:” అనే పేరుంది. కాశీఖండంలో ”కుబేరోభవనామ్నాత్వం మమ రూపేర్ష్యయాసుత” అని ఇతనిని పార్వతి శపించినట్లుంది. కుబేరుడు అన్నది శాపం వలన వచ్చిన పేరేకానీ అసలు పేరు వైశ్రవణుడు మాత్రమే.
కుబేరుని భార్య పేరు చిత్రరేఖ. అయితే ఈమె పేరు భద్ర అని మహా భార తంలోని ఆది పర్వంలో ఉంది. ఈ దంపతులకు పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు అనే కొడుకులు, మీనాక్షి అనే కూతురు ఉన్నారు. మణిగ్రీవుడు, నలకూబరుడు నారదుని శాపం వలన రెండు మద్దిచెట్లుగా మారి ప్రక్కప్రక్కనే ఉంటే, ద్వాపరయుగంలో బాలకృష్ణుడు ఆ రెండు చెట్ల మధ్యలో నుండి తన తల్లి తనను కట్టివేసిన రోలుతోసహా దోగాడుకుంటూ వెళ్ళి ఆ చెట్లను కూల్చి వారిద్దరికీ శాపవిమోచనం కలుగజేసిన కథ అందరికీ తెలిసిందే.
సిరిసంపదలనిచ్చి, ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించబడే ”లాఫింగ్ బుద్ధ” మన కుబేరుడే అని చాలామంది నమ్ముతారు. కుబేరుని పూజిస్తూ ఆర్థిక ఇబ్బందులు తొలగి, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని పెద్ద లంటారు. ధనత్రయోదశి రోజు కుబేరుని పూజించేది అందుకే కదా. మంత్ర పుష్పంలో ”రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయంవైశ్రవణాయ కుర్మహే సమే కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవనోదయ దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయనమ:” అని చెబుతాం. హిందువు లతోబాటు బౌద్ధ, జైన భక్తులు కూడా నమ్మి పూజించే దైవం కుబేరుడు. జైనులు ఇతనిని ”సర్వానుభూతి” అని పిలుస్తారు. బౌద్ధులు ఇతనిని ”జంభాలుడు” అంటారు. కుబేరుని చేతిలో ఎప్పుడూ బంగారు నాణాలు గల ఒక సంచిగానీ, వజ్రాలు, మణులు వెదజల్లే ముంగిసగానీ ఉంటాయి. మరొక చేతిలో నిమ్మ కాయ (జంబీరము) ఉంటుంది. అందుకే ఆయనకు జంబాలుడు అనే పేరు వచ్చిందంటారు. అగ్నిపురాణం ప్రకారం కుబేరుని ఆయుధం గద. వాహనం నరుడు (మనిషి). ”ఓం యక్ష రాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి! తన్నో కుబేర: ప్రచోదయాత్.”
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి శ్రీ పద్మావతి అమ్మవారితో తన వివాహం కోసం కుబేరుని వద్ద పదునాలుగు లక్షలు రామ ముద్ర నాణాలు అప్పు తీసుకొన్నాడు. ఋణ పత్రం వ్రాసి ఇచ్చారు స్వామి. బ్రహ్మ, శివుడు సాక్షులుగా దానిని ధృవీకరించారు. ఋణపత్రం ప్రకారం వివాహమైన వెయ్యి సంవత్సరాలలో వడ్డీతోసహా ఋణం మొత్తం చెల్లింపబడుతుందని పేర్కొన బడింది. అందుకే శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు తమ శక్తి కొలది ధనాన్న విరా ళంగా అందించి స్వామి ఋణాన్ని తిరిగి చెల్లించడంలో సహాయపడి పుణ్యాన్ని పొందుతారు.
కుబేరాయ.. వైశ్రవణాయ..
Advertisement
తాజా వార్తలు
Advertisement