Saturday, November 23, 2024

”క్షమ కవచంబు, క్రోధమది శత్రువు”

”క్షాంతిశ్చేత్‌ కవచేన కిం” అని భర్తృహరి వాక్కు. అంటే క్షమాగుణం అనేది ఒక్కటి ఉంటే అన్ని ఆపదల నుండి మనలను గట్టెక్కించే కవచంలాగా అది మనలను కాపాడుతుంది అని ఆయన భావం. ఇది అక్షర సత్యం కూడా.
క్షమించడం, ఓర్పు వహంచడం, సహంచడం, భరించడం అనేవి పర్యాయ పదాలు. మనకు నచ్చని, కష్టం కలిగించే, దు:ఖాన్ని ప్రసాదించే అంశాలను ఓర్పుతో సహంచడమే క్షమాగుణం. దీనిని అలవరచుకోవడం మనవంటి సామాన్యులకు కొంత కష్టసాధ్యమైన విషయమే. అయితే ఓర్పుకు ప్రతిఫలం ఎప్పుడూ గొప్పగా, సంతోషకరంగానే ఉంటుంది. క్షమాగుణానికి ప్రతీకగా భూదేవిని పేర్కొంటారు. మానవులు తన పట్ల చేస్తున్న సహంపరాని దుష్కృ త్యాలను స#హస్తున్నది కనుకనే భూదేవికి అంతటి కీర్తి కలిగింది. క్షమాగుణం లో తన తల్లి భూదేవితో సమానురాలు అనిపించుకుంది సీతాదేవి. అశోకవనం లో తనను మాటలతో, చేతలతో హంసించిన రాక్షస స్త్రీల ఆగడాలను ఓర్పుతో భరించడమేకాక రామరావణ యుద్ధానంతరం వారిని క్షమిస్తుంది కూడా సీతమ్మ.
బాల్యం నుండీ తమను ఉపేక్షించినా, లక్క ఇంటిలో ఉంచి తగలపెట్టించినా, మాయాద్యూతం లో రాజ్యభాగాన్ని అపహరించినా, తమ ప్రియ సతి, ద్రౌపదిని, నిండుసభలో అవమానించినా క్షమించి ఓర్పుతో ఆ కష్టాలను భరించిన పాండవులను విజ యలక్ష్మి వరించడం, వారి క్షమాగుణాన్ని మెచ్చి సాక్షాత్‌ భగవంతుడే శ్రీకృష్ణుని రూపంలో వారి పక్షాననే ఉండటం ‘క్షమ’ యొక్క విశిష్టతకు ఉదాహ రణగా చెప్పవచ్చును. పాండవుల పరాక్రమాన్ని, వైభవాన్ని, కీర్తిప్రతిష్టలను చూచి ఓర్వలేకపోయిన రారాజు పతనం తర్వాతి తరాల వారికి ఒక గొప్ప గుణపాఠం కదా!
ఏకనాథుడు, సోక్రటిస్‌ వంటి మహనీయులకే క్షమాగుణం సాధ్యమనిపిస్తుంది. శిశుపాలుని తొంభై తొమ్మిది తప్పులను క్షమించిన శ్రీకృష్ణుడే అతని వం దవ తప్పును క్షమించలేకపోవడం; సీతాపహరణానికి పాల్పడి, ఆమెను అను క్షణం దు:ఖింపజేస్తూ, తన తోకకు నిప్పు పెట్టిన రావణుని పట్ల క్రోధంతో రగిలి పోయి హనుమ లంకాదహనానికి పాల్పడడం, తన తండ్రి జమదగ్ని పట్ల క్రూ రంగా ప్రవర్తించిన కార్తవీర్యార్జునుని యొక్క వేయి చేతులనూ ఖండించడమే కాక, ఇరువది ఒక్కమార్లు భూమినంతా పరిక్రమిస్తూ కనబడిన ప్రతిరాజునూ పరశురాముడు సంహరించడం వంటి దృష్టాంతాలను బట్టి మహనీయులు, భగవత్స్వరూపులు, అవతార పురుషులు కూడా ఆగ్రహావేశాలకు లోనైనప్పు డు క్షమాగుణాన్ని అలవరచుకోలేదనే చెప్పవచ్చు. క్రోధావేశాలతో కార్తవీర్యుని పరశురాముడు సంహరించి వచ్చినప్పుడు తండ్రి జమదగ్ని అతనిని తీవ్రం గా మందలించి, తీర్థయాత్రలుచేసి ప్రాయశ్చిత్తం చేసుకోమంటాడు.
”క్రోధము తపమున్‌ చెరచును/ క్రోధము అణిమాదులైన గుణముల బాపున్‌/ క్రోధము ధర్మక్రియలకు బాధ యగున్‌/క్రోధిగా తపస్వికి చన్నే?” అంటుంది మహాభారతం.
శ్రీమద్రామాయణం సుందరకాండంలో అశోకవనాన్ని భంగం చేసిన హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని ఎదుట ప్రవేశపెడతాడు ఇంద్ర జిత్తు. రావణుని బలాన్ని, బలగాన్ని అంచనావేయడానికి బ్రహ్మాస్త్రానికి గౌరవ మిచ్చి బంధితుడౌతాడు హనుమంతుడు. రావణునికి రామలక్ష్మణుల బల పరాక్రమాలను వివరించి, రావణుడు సీతాపహరణానికి పాల్పడిన దుశ్చర్య ను విమర్శిస్తూ హతోక్తులు పలుకుతున్న హనుమను చంపబూనుకొంటాడు రావణుడు. విభీషణుని పలుకులతో దూతవధ ధర్మము కాదని గుర్తించి, చంప టానికి బదులు హనుమను శిక్షించడానికి సిద్ధపడతాడు. హనుమంతుని తోకకు నిప్పుపెట్టి లంకానగరమంతా ఊరేగిస్తారు. ఆ నెపంతో శత్రు రాజధాని గుట్టుమట్లన్నీ తెలుసుకొన్న హనుమ రావణుని మూర్ఖత్వానికి రగిలిపోయి, సీతారాముల అనుగ్రహంతో తనను అగ్నికాల్చడం లేదని గ్రహంచి, ఆ అగ్నికి లంకానగరాన్ని సంతర్పణ చేయాలని భావించి లంకను మొత్తం దగ్ధం చేస్తా డు. లంక మొత్తం తగులబడిందని నిశ్చయించుకొని తన తోకను సముద్రంలో ముంచి, దానితోబాటు తన మనసులో రగులుతున్న కోపాన్ని కూడా చల్లార్చు కొంటాడు. అప్పుడు ఆంజనేయునిలోని వివేకం మేల్కొనింది. ”అయ్యో, ఈ లంకను కాల్చి నేనెంతటి అకార్యానికి పాల్పడ్డాను? లంకతోబాటు సీతమ్మ కూడా దగ్ధమైనదా ఏమి?” అని కలత చెందాడు. ”ధన్యాస్తే పురుషశ్రేష్ఠా యే బుద్ధ్యా కోపముత్థితమ్‌/నిరుంధంతి మహాత్మనో దీప్తమగ్ని మివాంభసా”. ప్రజ్వలించే అగ్నిని నీటితో చల్లార్చినట్లు ఎవరు తమకు కలిగిన కోపాన్ని తమ బుద్ధితో నిరోధించగలరో ఆ మహాత్ములే పురుష శ్రేష్ఠులు, ధన్యులు కదా. ”క్రుద్ధ: పాపం నకుర్యాత్‌ క:, క్రుద్ధోహన్యాద్‌ గురూనపి/ క్రుద్ధ: పరుషయా వాచా నరస్సాధూ నధిక్షిపేత్‌” కోపముతో రగిలిపోవు వ్యక్తి ఎంతటి పాతకము లకై నా పూనుకొంటాడు. పెద్దలను కూడా చంపుతాడు. కఠినమైన మాటలతో సత్పురుషులను కూడా ఆక్షేపిస్తాడు. ”వాచావాచ్యం ప్రకుపితో, న విజానాతి కర్హిచిత్‌/ నాకార్యమస్తే క్రుద్ధస్య, నవాచ్యం విద్యతే క్వచిత్‌”. మిక్కిలి కోపిష్ఠి అయినవాడు ఏది మాట్లాడవచ్చో, ఏది మాట్లాడకూడదో ఎరుగడు. అతనికి చేయరాని పని ఇదని, అనరాని మాట ఇదని తెలియదు.
”యస్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి/ యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే”. ఎవడు తనలో పెల్లుబికిన కోపాన్ని, ఎలా పాము తాను వదిలిన కుబుసాన్ని విడిచిపెట్టి వెడుతుందో, అలాగ క్షమతో తొలగించు కొంటాడో అతడే సత్పురుషుడు అనిపించుకొంటాడు. అని తాను సీతమ్మకు అపాయం కలిగించానేమో అనిన శంకతో పశ్చాత్తప్తుడు అవుతాడు హనుమ. పై మాటలలో క్షమ యొక్క విశిష్టత, కోపంవల్ల కలిగే నష్టాలు, చక్కగా మనకు తెలియవస్తాయి.
అయితే క్షమాగుణం కలిగినవారిని లోకులు బలహనులని, పిరికివారని భావిస్తూ ఉండటం సహజమే. తనను లోకులు అలా అనుకొన్నా ఫరవాలేదు, కానీ రక్తపు కూడుకంటే భిక్షాన్నం తినడానికే తాను మొగ్గుచూపుతానని ధర్మరాజు శ్రీకృష్ణునితో పలికిన తీరు అపూర్వమైనది. స్ఫూర్తిదాయకమైంది. క్షమించడం వ్యక్తి బలహనత కాదు. దానికి కొండంత మనోబలం కావాలి. అందుకే ”క్షమ” దైవీగుణాలలో స్థానం సంపాదించుకుంది. మనము కూడా నేటి పరిస్థితులలో క్షమాగుణాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది

Advertisement

తాజా వార్తలు

Advertisement