తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు బయల్దేరింది. తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం ఊంజల్‌సేవ చేపట్టారు. ఆ తరువాత గ్రామోత్సవం నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.