Wednesday, November 20, 2024

కోదై కల్యాణము

విష్ణువును చిత్తమునందు ధరింపచేసుకున్న పరమ భక్తుడు కనుకనే భట్టనాథుడును విష్ణుచిత్తుడు అని పిలిచేవారు. ఆయనకు పూలవనంలో లభించిన బాలికకు కోదై, గోదా అని నామకరణం చేసి, భార్యాభర్తలు అల్లారుముద్దుగా పెంచుకు న్నారు. విష్ణుచిత్తుడు నిత్యము విష్ణు దేవాలయమునకు పూలను భగవత్‌ కైంకర్య మునకు తీసుకొని వెళ్ళి సేవించుకునేవాడు. అతను సిద్ధం చేసుకున్న పూవులను, పూమాలలను ముందు గా అతని కుమార్తె గోదా అలంకరించుకుని తిరిగి తండ్రి దేవాలయానికి వెళ్ళు సమయంలో యధాస్థానంలో ఉంచేది. ప్రతీ రోజూ గోదా దేవి ధరించిన మాలలే స్వామికి అలంకరణ చేయడం జరుగుతోంది. ఒకరోజు విష్ణుచిత్తుడు పూవుల మధ్య ఒక కేశమును గమనించి, దానిని స్వామికి అలంకరించకుండా వెనుదిరిగెను. తరువాత విషయము తెలుసుకుని, స్వామికి తన కుమార్తె ద్వారా జరిగిన అపచారమును గ్రహించి విచారిస్తాడు. తన కుమార్తె చేసిన అపచారమును మన్నించమని కోరుతాడు. స్వామి వారు స్వప్న మందు విష్ణుచిత్తునకు సాక్షాత్కరించి గోదా చేసిన అపరాధ మేమి యులేదని, ఆమె ధరించిన మాలలే తనకు సమర్పించమని తెలియ చేస్తారు. ఆ తరువాత గోదా దేవి ధరించిన మాలలే స్వామికి సమర్పిస్తాడు. తన మనోరధము నెరవేరుటకు పూర్వము గోపికలొనర్చిన శ్రీ వ్రతమును గోదా కూడా చేయ సంకల్పించెను. కేవలము తన శుభము, తన క్షేమము అనే ఆలోచన కాకుండా సమాజహితాన్ని కోరడమే శుభకామన. అదే గోదా తలపెట్టినది. యుక్త వయస్సు వచ్చిన గోదాదేవి తన చెలికత్తెలతో కలసి శ్రీవ్రతమనెడు ధనుర్మాస వ్రతమును చేపట్టి, ముప్ఫై పాశురాలు గానం చేసి భక్తిశ్రద్ధలతో తిరుప్పావై పూర్తి చేసినది. మొదటి అయిదు పాశురాలు, తిరుప్పావై ముఖ్య ఉద్దేశ్యము తెలియ చేస్తాయి. తరువాత పది పాశురాలలో గోదాదేవి చెలి కత్తెలతో కలసి ప్రకృతి అందాలను వర్ణించే అంశాలు. చెలి కత్తెలను నిదుర లేపుతూ కృష్ణుని స్తుతిస్తూ పాడతారు. తరువాత ఐదు పాశురాలు గోదాదేవి చెలికత్తెలతో కలసి చేసే దేవా లయ సందర్శన, భగవంతుని మేల్కొలు పుట ఉంటుంది. తరువాత తొమ్మిది పాశురాలు భగవద్విలాసాన్ని వర్ణిస్తాయి. చివరి పాశురం లో గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తె నని, ఈ పాశురాలు తాను రచించి పాడినవని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలుగునని ఉద్ఘాటిస్తుంది.
భూదేవి అవతారమైన గోదాదేవి, రంగనాథుని వివాహం చేసు కొనుటకు సుముఖత వ్యక్తం చేయగా, స్వామివారి ఆదేశానుసారం మానవకాంతైన గోదాదేవిని, విగ్రహరూపంలో వున్న విష్ణుమూర్తి రంగనాథునితో వివాహం జరిపించాడు విష్ణుచిత్తుడు. వివాహం అయిన తర్వాత గోదాదేవి రంగనాథునిలో లీనమవ్వటం చూసి విచారిస్తున్న విష్ణుచిత్తునకు జ్ఞానోపదేశం చేసి మాయ నుండి ముక్తిని స్వామి వారు ప్రసాదిస్తారు. వ్రతఫలముగా గోదాదేవికి భోగిరోజు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజున వైభవముగా రంగ నాథునితో కల్యాణము జరిగింది. విష్ణుమూర్తి అవతారం రంగ నాథుని అర్చన అనంతరం గోదాదేవిని ఇచ్చి విష్ణుచిత్తుడు రంగ నాథునితో కల్యాణం జరిపించి లోకకల్యాణ కారకుడైనాడు. కల్యాణం సంకల్పం ”అస్యాం శుభతిథే భగవద్భాగవత ఆచా ర్య కైంకర్య రూపేణ శ్రీ గోదా రంగనాథయో: పాణికర్మ కరిష్యే” అని నీటిని సృశించి రెండు లేదా ఐదు దారములతో రెండు కంకణముల ను చేసి పసుపు పూసి మామిడి ఆకును చుట్టి వానికి 16 ఉపచారము లతో పూజ చేసి కంకణధారణ చేయించాలి. స్వామికి కుడిచేతికి, గోదా దేవి అమ్మకి ఎడమ చేతికి ధరింపచేస్తారు. శ్రీ స్వామివారి పాదము లను కడిగి ఆచమనం చేయాలి. పిదప యజ్ఞోపవీతానికి 16 ఉపచా రాలు చేసి దానిని స్వామివారి ఎడమ భుజముపై నుండి కుడి భుజ ము క్రిందికి ఉండునట్లు ధరింపచేస్తారు. స్వామివారికి తగు కన్యను వెదుకుటకై బ్రాహ్మణులను నలుగురికి లేదా ఎనిమిదిమందికి
తాంబూలం ఇవ్వాలి. అనంతరం స్వామి ప్రవరలను ”పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార, పంచారేషు, ప్రవరాన్వితి పర బ్రహ్మ గోత్రోద్భ వాయ శ్రీ రంగనాథశర్మణే వరాయ” అని చెప్పి, అమ్మవారి ప్రవరగా ”పాలా మృత, పౌవర్ణ, అమృతాపహరణ త్రయార్షేయ, ప్రవరాన్వితి పాలా మృత గోత్రోద్భవాయ శ్రీ గోదానామ్నాం కన్యాం వణీద్వం వ ణీ మహ” అని ఉచ్ఛరిస్తారు. తదనంతరం మధుపర్కం సమర్పిస్తారు. కొబ్బరి కురిడీలో తేనె, పెరుగు కలిపి స్వామికి ఇస్తారు. సంకల్పంగా ”ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, అస్యాం శుభ తిధౌ, సుముహూర్తె, శుభ లగ్నే, సాలంకృత సహరణ్యోదక కన్యా దాన మహం కరిష్యే గోదానామ్నీ మిమాం కన్యాం సర్వాభరణ శోభితాం! దాస్యామి విష్ణవే తుభ్యం సర్వలోక హితాయవై భగవతో వరదా భయ #హస్తే ప్రదాయ” అని చెబుతారు. తదనంతరం మంగళాష్టకములు పాడి మంగళసూత్రములకు పూజ చేసి వాటిని రంగనాథుని హస్తము నకు తాకించి అమ్మవారికి ధరింపచేస్తారు. అమ్మ తరపున స్వామి తరపున పురోహితులు ఉండి తలంబ్రాలు అమ్మవారిపైన స్వామి వారిపైన ఉంచాలి. స్వామి ఉత్తరీయం అంచునందు అమ్మ కొంగు అంచును తాంబూలములను ఉంచి ముడి వేయటంతో కల్యాణ తంతు ప్రధాన ఘట్టము పూర్తయినట్లే. స్వామికి నివేదన, అర్ఘ్యం వగైరా యిచ్చి ఫలములను ప్రసాదముగా సమర్పిస్తారు.
ఈ వ్రతము చేసిన కన్యలు మన హైందవ సంప్రదాయం పద్దతిలో వరునితో పాణిగ్రహణం పొందవచ్చును.
గోదాదేవి నిత్యం తాను ధరించిన మాల స్వామికి ధరింపచేసేది కనుక ఆముక్తమాల్యద అని కూడా పిలువబడుతోంది.
నామాంతరము కోదై, చూడిక్కొడుత్త నాచ్చియారు, ఆండాళ్‌, ఆముక్త మాల్యద.

  • డా. దేవులపల్లి పద్మజ
    9849692414
Advertisement

తాజా వార్తలు

Advertisement