శ్లో॥ “మహాద్రి పార్శ్వేచ తటే రమంతం..
సంపూజ్యమానం సతతం మునీంద్రా! |
సురాసురైర్యక్ష మహోరగొద్ద్యె
కేదారమీశం శివమేక మీడే ||”
భావము: గొప్పదైన హిమవత్పర్వతము ప్రక్కన కొండ చరియ సమీపమున యెల్లప్పుడూ మునులచేత, దేవతలచేత, రాక్షసులు, యక్షులు, నాగులు మొదలగు వారిచేత పూజింపబడుచున్న మంగళ (శివం) కరుడగు కేదారేశ్వరుని పొగడు చున్నాను. (ఇక్కడి అమ్మవారి పేరు కేదారగౌరి)
పురాణగాధ: శ్రీ మహావిష్ణువు అంశలు (అవతారములు) గా నరనారాయణులు ధర్మదేవతకు కుమారులుగా జన్మించారు. వారు హిమాలయ పర్వతం మీదనున్న అత్యంత శోభాయమానమైన కేదారశిఖరమున బదరికాశ్రమంలో, నివసిస్తూ వుండే వారు. వారిద్దరు లోక కళ్యాణార్థమై శివుని గూర్చి తపస్సు చేశారు. వారు వేకువనే పుణ్యనదియైన మందాకినిలో స్నానముచేసి పార్థివ లింగమును నిర్మించుకొని పూజించేవారు. (పార్థివ లింగమంటే మట్టితో చేసిన లింగము) వారు మందాకిని నీటితోనూ, పవిత్రమైన బిల్వ పత్రితోనూ, వికసించిన తామరపూలతోనూ మిక్కిలి శ్రద్ధతో శివుని పూజించేవారు.
నరనారాయణుల భక్తికి ప్రసన్నమైన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అపుడు వారు దేవా! “మానవకళ్యాణం అనే హేతువుగా, శుభంకరముగా నీవెల్లప్పుడూ ఇక్కడనే వుండి, నిన్ను దర్శించి, పూజించు భక్తులకు అక్షయప్రాప్తి కలిగేటట్లు వరము నిమ్ము”, అని ప్రార్ధించారు. వారి ప్రార్థన ననుసరించి పరమేశ్వరుడు అక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగముగా వెలిశాడు. ఈ లింగమును దర్శించుట, పూజించుటల వలన అభీష్టములు సిద్ధించుటయే గాక, అచంచల శివభక్తి, మోక్షము లభిస్తాయి. కేదారేశ్వర భక్తులు కేదారమార్గమున మరణించినా ముక్తులగుదురని (మోక్షము పొందుదురని) పురాణములు చెప్తున్నవి. ఈ నరనారాయణుల తండ్రి ‘ధర్ముడు’ అనే ధర్మమూర్తి. తల్లి దాక్షాయణి (దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరిత) వీరు బదరికాశ్రమంలో శివుని గూర్చి తపస్సు చేస్తున్నప్పుడు వారివల్ల తన ఇంద్రపదవి పోతుందేమోనని భయపడిన దేవేంద్రుడు వారి తపస్సును విఘ్నము చేయమని అప్సరసలను పంపాడు. నరనారాయణులు సత్వ సంపన్నులగుటచేత అప్సరసలను కోపింపక, వారి (అప్సరసల) అజ్ఞానమును తెలుపుటకు నారాయణుడు తన తొడను చీల్చి, అందుండి ఒక అప్సరసను సృష్టిం చాడు. ఆమెయే ఊర్వశి, అట్లా అతి నిగ్రహంగా, నిష్ఠగా, సాత్వికంగా తపస్సు చేశారు. కావుననే వారికి శివదర్శనం కలిగింది. కేదారేశ్వర జ్యోతిర్లింగము స్వయం భువుగా వెలసింది. చరిత్ర: పురాణాలలో, ఇతిహాసాలలో ఈక్షేత్రం గురించి వర్ణింపబడినది. అది చల్లని హిమప్రదేశములో నుండుట, ఆకారణంగా ఈ ఆలయం మే నెలనుండి అక్టోబరు నెల వరకూ మాత్రమే తెరువబడియుండుట అనే కారణాలుగా ఈ కేదార్ నాధ్ దేవాలయం ముస్లిములు మొదలగు దుండగుల బారిన పడి నాశనముగాక నిలిచియున్నదన వచ్చును. ఇక్కడి విశేషము: అక్టోబరు నెల చివరలో మూసివేసిన ఆలయపు తలుపులు తిరిగి మే నెలలోనే తెరుస్తారు. అయితే అక్టోబరు చివరలో తలుపులు మూసివేసే సమయంలో ఆ కేదారనాధుని ముందు వెలిగించిన జ్యోతులు తిరిగి మే నెలలో తలుపులు తెరిచేవరకూ ఆరిపోకుండా జ్వలిస్తూనే వుంటాయి. ఇది జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుని అస్తిత్వప్రభావమనక తప్పదు కదా !