Thursday, November 21, 2024

కార్యదక్షతకు హేతువు ఆత్మజ్ఞానం

రాజ్యాలను పరిపాలించే రాజులకు మంచి ఆలోచనలు స్వభావ సిద్ధంగా ఏర్పడాలి. స్వతం బుద్ధి కలిగియుండా లి. ప్రాజ్ఞుడై ఉండాలి అంటూ భాస్కర శతకకారుడైన మారన కవి తన శతక రచనలో రాజుల స్వరూప, స్వభావాలను పేర్కొంటూ ఒక చక్కని పద్యం ద్వారా యిలా తెలియజేశాడు.
”భూపతికాత్మబుద్ధి- మది బుట్టనిచోటబ్రధానులెంతు ప్ర
జ్ఞాపరిపూర్ణులైన గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణ-భీష్మ-కృప యోధులనేకులుగూడి- కౌరవ
క్ష్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగవారు- భాస్కరా!”
అంటూ కవి మారన ఆంధ్ర మహాభారతంలో రారాజు దుర్యోధనుని స్వభావమును విశదీకరిస్తూ, చక్కని సందేశమం దించాడు. రాజునకు స్వయంగా ఆలోచన మనస్సులో పుట్టన ప్పుడు, సహాయకులైన మంత్రులు- ఎంత కార్య కుశలులైనను అత ని కార్యం సఫలముగాదు. కురుక్షేత్ర సంగ్రామ వేళ కార్యదక్షు లైన భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు అనే యుద్ధవీరు లెంద రు న్నా స్వంత ఆలోచన లేని దుర్యోధనుని పనిని చేయలేకపోయారు.
రాజ్యపాలనలో రాజు ప్రాజ్ఞుడై ఉంటూ తను నేర్పరితనంతో పనిచేయాలి. ఆవిధంగా చేస్తే కార్యం ఫలవంతమవుతుంది. ప్రజ్ఞా హీనుడైన ప్రభువు విజయాన్ని సాధించలేడు. భారతంలో శాంతి పర్వంలో యిలా తెలిపాడు కవి.
”హీన ప్రజ్ఞుడకార్యము లైనవి సేసి తుదివగచు- నతుల ప్రజ్ఞా
సాను మదారూఢుడు- వగ
నూనడు దురిత మనువఱితి కోడక యునికిన్‌” అంటూ రాజు మంచి శాస్త్ర కోవిదుడై ధర్మమార్గాను వర్తియై యుండాలి. అలాం టి అలాంటి రాజు లేకుండా పరిజనులెందరున్నా లాభం వుండద న్నాడు. రాజ్యానికి పాలకుడే కదా ముఖ్యం. శ్రీ నీలకంఠ దీక్షితులు రాజు యొక్క ధర్మాన్ని ఒక శ్లోకంలో యిలా తెలిపారు.
”న రాజా నం వినా రాజ్యం- బలవత్స్వపి మంత్రిషు
ప్రాణస్వ సత్సుకిందేహ:- చండవాతేన ధార్యతే”
అంటూ బలవంతులైన మంత్రులున్నా రాజులేనిదే రాజ్యం లేదు. ప్రాణాలు లేకపోతే ఎంత ప్రచండపు గాలి వీచినా శరీరాన్ని నిలుపలేదన్నాడు. పాలకుడు దారితప్పితే అనర్థం జరుగుతుంది. రాజు కదిలితే మర్యాదలన్నీ కదులుతాయి. భూమి కంపిస్తే పర్వ తాలు కూడా కంపిస్తాయి. గొప్పవారు వంశ గౌరవంచే కాదు తమ సద్గుణాలచే వన్నెకెక్కుతారు. చాణుక్యుడు తన నీతిసూత్రాలలో రాజు ధర్మాలను ఇలా వివరించాడు. రాజ్యానికి మూలం ఇంద్రి యాలను వశంలో ఉంచుకోవడం. ఇంద్రియములను జయించడానికి వినయం కావాలి. విద్యావంతులను సేవిస్తే విన యం కల్గుతుంది. వృద్ధుల సేవ వలన విజ్ఞానం కల్గుతుంది. ఈ రెండూ వున్నవాడు తనను తాను చక్కబరచుకుంటాడు.ఇదే ఆత్మజ్ఞాన సాధన- ఆత్మసంపాదన.
అర్థసంపద ప్రకృతి సంపదను యిస్తుంది. జగతిలో షడంగా లున్నాయి. అమాత్యులు- మిత్రులు- ధనాగారం- రాష్ట్రం- దుర్గం- సైన్యం అను ఆరింటికీ షడంగాలని పేరు. ప్రకృతులు అని కూడా అంటారు. రాజ్య పరిపాలనకు ఈ షడంగాలే ప్రధానం. అన్ని పనులకూ మూలమంత్రం మంచి ఆలోచన. మంచి మం త్రాంగం చక్కగా ఉంటే కార్యం సిద్ధిస్తుంది. కావున మంచి ఆలోచ న రాజుకు స్వభావ సిద్ధంగా ఉండాలి. ఏర్పడాలని మారన పై పద్యంలో తెలిపాడు. రాజైన దుర్యోధనుడు కలి అంశతో జన్మించా డు. మంచి ఆలోచనలు కల్గడం అసమంజసం. అతడు కపటి, హం తకుడు. కుత్సిత బుద్ధిగలవాడు. అసూయాపరుడు. దురభిమాని. పరద్వేషి. వినయరహితుడు. కావున దుర్యోధనునికి సహాయకు లుగా వున్న ప్రజ్ఞాపరిపూర్ణులైన భీష్మ- ద్రోణ- కృపయోధులనే కులు కూడి వున్నను అతని మనోరథం నెరవేర లేదు. అందుకు ప్రథమ మూలకారణం తనకు స్వయంగా మంచి చెడులను విచా రించుకొనే వివేకం- విచక్షణా జ్ఞానం లేకపోవడమే. స్వీయాలోచ నలు కల్గకపోవడం, కౌరవ రాజ్యపాలనలో అన్నీ వున్నా రాజుకు స్వంతబుద్ధి లేదు కదా! తత్ఫలితంగా సపరివారంగా నశించవలసి వచ్చిందని, మారన కవి తన భాస్కర శత కం ద్వారా, ఆత్మజ్ఞానం కార్యదక్షతకు కారణమనే దివ్య సందేశాన్ని అందించుట, పాలించే ప్రభువులకు కనువిప్పు కలగాలని వివరించుట మనోజ్ఞం.
– పి.వి.సీతారామమూర్తి, 9490386015

Advertisement

తాజా వార్తలు

Advertisement