Thursday, November 21, 2024

కార్తీక దీపం – శివ స్వరూపం

”న కార్తీక సమో మాస:”. మాసాలన్నింటిలో కార్తీక మాసం మహిమాన్వితమైనది. కృత్తికా నక్షత్రం నాడు పున్నమి ఏర్పడే ఈ నెల జ్యోతి పూజనానికి ప్రాధాన్యతనిస్తుంది. జ్యోతి అంటే వెలుగు. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞాన ప్రకాశాన్నందించే జ్ఞాన దీప స్వరూపుడు పరమేశ్వరుడు. భర్తృహరి కవి ఇలా అన్నారు… ” దిక్కలాద్యవచ్ఛిన్నా నంత చిన్మాత్ర మూర్తయే / స్వాను భూత్యేక మానాయ నమశ్శాన్తాయ తే జసే”. కాలము, దిక్కులు మొదలైన వేటి పరిమితికీ లోబడక, అనంతమై, కేవల జ్ఞాన స్వరూపమై, స్వానుభవంతో మాత్రమే తెలుసుకోదగిన, ప్రసన్న జ్యోతి స్వరూపమైన పరమేశ్వరునికి నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకానికి అర్థం.
జ్ఞాన జ్యోతియైన శివరూపం పంచ భూతాత్మకమైనది. శివ పంచాక్షరిలోని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ప్రకృతి శక్తికి ప్రతీక. ”నమశ్శివాయ” అనేది శివ పంచాక్షరి మహామంత్రం. ‘న’ అనే అక్షరం ఆకాశానికి (నభం అంటే ఆకాశం) ‘మ’ కారం ‘మరుత్తు’ అంటే గాలికి, ‘శి’ కారం ‘శిఖి’ అంటే అగ్నికి, ‘వ’ కారం ‘వారి’ అంటే నీటికి, ‘య’ కారం యజ్ఞ వేదిక అయిన భూమికి సంకేతాలు. ఈ ఐదు పంచభూతాలూ కలిస్తేనే సృష్టి. వాటిపై ఆధారపడినదే జీవితం. ఆ పంచ భూతాలలో ఏ ఒక్కటి ప్రకోపించినా విలయమే! ఇదే సృష్టి, స్థితి, లయ కారకుడైన పరమేశ్వరుని తత్త్వం. ఆ తత్త్వాన్ని తెలుసు కోగలగడమే జ్ఞానం.
విశ్వమంతటా పంచభూతాత్మకుడై ఆవరించి ఉన్నా కూడా ఆ పరమేశ్వరుని మనము మన భౌతిక నేత్రాలతో దర్శించలేము. కనుకనే తేజోమయమైన ‘శివజ్యోతి’కి ప్రతిరూపంగా దీపాన్ని వెలిగించి, ఆ దీపారాధననే పరమేశ్వరారాధనగా, త్రికరణములతో (మనసు, వాక్కు , కర్మ) విశ్వాసంతో, ధ్యానించి పూజించడమే కార్తీకమాస దీపారాధనలోని ఆంతర్యం. ”దీపేన సాధ్యతే సర్వం” అన్నారు పెద్దలు. దీపాన్ని వెలి గించి, దానిని ఆలంబనగా చేసుకొని పరం జ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడమన్నది ఒక బృహత్తర యోగ ప్రక్రియ.
దీపం కూడా పంచభూతాత్మకమైనదే ! మనం దీపాన్ని వెలిగించేటటువంటి మట్టి ప్రమిద భూమికి , ప్రమిదలో నింపిన తైలం నీటికి, జ్యోతి అగ్నికి , దీపం వెలగడానికి అవసరమైన ప్రాణవాయువు గాలికి , ఊర్ధ్వ ముఖంగా వెలిగే దీపం ఆకాశానికి సంకేతాలని పెద్దలు చెబుతారు. నరక చతుర్దశి నాడు మొదలు పెట్టి కార్తీక మాసమంతా కొనసాగే దీప ప్రజ్వలన వ్రతం అజ్ఞానాన్ని, అలక్ష్మిని తొలగించి, విజ్ఞానాన్ని, సకల సంపదలనూ ప్రసాదిస్తుంది. జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుని ప్రతీకగా ఇంటింటా వెలిగే ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తూ, శివజ్యోతి ఉపాసనగా విరాజిల్లే కార్తీక దీపోత్సవము సకల ఇ#హపర శుభాలనూ ప్రసాదించే అద్భుత సమయం.

  • డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
Advertisement

తాజా వార్తలు

Advertisement