Saturday, November 23, 2024

ధృతరాష్ట్రునిపై కర్ణుని ప్రభావం!

కం||మునులోకముచే సత్కృతి
గనినెగడెడు వాఁడనాకుఁగలవారెల్లం
జనశోచ్యుఁడనై దుర్దశ
నునికి మనికియగునె? దీనికోర్వఁగవశమే?
(ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ప్రథమాశ్వాసం, 30వ పద్యం)

‘పూర్వం అందరిచేతా గొప్పగా గౌరవించబడ్డాను. నాకు ఆప్తులైనవారు అందరూ పోయి ఇప్పుడు దుర్దశలో ఉన్నాను. ఈ బ్రతుకు ఎలా బ్రతకను? ఈ స్థితిని భరించడం నాచేత అయ్యేపనేనా?” అని ధృతరాష్ట్రుడు విలపించడం ఈ పద్యంలో భావం.
సంధి ప్రయత్నం జరిగే రోజులలో, అందరి ప్రయత్నాలూ అయిన తరువాత ఆఖ రుగా, శ్రీ కృష్ణుడు బుజ్జగించి మరీ చెప్పాడు ధృతరాష్ట్రుడికి.

చం|| మదమడగించి భూపతి సమాజమునెల్లను నిన్నుఁగొల్వఁజే
యుదునని పూని దిగ్విజయమున్నతిఁజేసి మహావిభూతితో
మదిమదినుండ నీ సుతుఁడు మంత్రులు సౌబలు జూదమార్చి సం
పదగొనియంతఁబోవకసభన్ద్రుపదాత్మజభంగపెట్టరే.
(ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం, 280వ పద్యం)

ధర్మరాజు రాజసూయం చేశాడు. ఎందుకు? రాజు అనే ప్రతి ఒక్కడి అధికారము ఎం తటిదో వారికే తెలిసేవిధంగా, అందరి దర్పమూ అణిగిపోయేలా చేసి, ప్రతి ఒక్కరూ నిన్ను (అంటే ధృతరాష్ట్రుడు ఒక్కడిని) మాత్రమే రాజుగా పరిగణించి, గౌరవించేలా చేయ డానికి! ఆ రాజసూయం తరువాత మరింతగా పెరిగిపోయిన సిరిసంపదలతో ప్రశాంతచి త్తుడై కాలం గడుపుతూ ఉండగా, నీ కొడుకులు, అతని సన్నహతులు, శకుని కలిసి ఏంచేశా రు? జూదం పేరుతో వారి సంపద మొత్తాన్నీ లాక్కున్నారు. పోనీ అంతటితో ఆగారా? వారి ఇల్లాలైన ద్రౌపదిని మానవ సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో అవమానించారు.

ఉ|| దానికినీవొడంబడితి; ధర్మజుఁడంతయుఁ జూచి సత్యముం
బూనివృకోదరార్జునులు భగ్నులుగాఁబెడచేతఁగన్ను నీ
రూనఁగనొత్తుకొంచుఁజనియు గ్రవనంబున దు:ఖమగ్నుఁడై
దీనత నుండి పూన్కిదగఁదీర్చియుఁగూడి మనంగఁగోరెడిన్‌.
(ఉద్యోగ పర్వం, తృతీయాశ్వాసం, 281వ పద్యం)

- Advertisement -

అలా జరిగిన దానికంతటికీ నీవు సమ్మతించావు. ధర్మరాజు అంతా చూస్తూ, ఆ సమ యంలో భీమార్జునులు కూడా చేయగలినది ఏమీలేని విధంగా పరిస్థితులు పరిణమించ డం వలన, అసహాయంగా తన పెడచేతితో కళ్ళ నుండి కారుతున్న నీళ్ళను తుడుచుకుని, నియమం ప్రకారం ఘోరారణ్యాలకు వెళ్ళాడు. అజ్ఞాతవాసం గడిపాడు. ఇన్ని బాధలు పడి, తిరిగివచ్చి ఇప్పుడు కూడా కలిసి ఉందామనే, మీతో సఖ్యంగా ఉందామనే కోరుకుం టున్నాడు.

ఉ|| వారలు శాంతశూరులు; భవచ్చరణంబులు గొల్వఁబూనియు
న్నా; రటుఁగాక మీకదిమనంబునకప్రియమేని నింతకుం
బోరికి వచ్చుచుండుదురు; భూవర! రెండుదెఱంగులందునీ
కారయఁబథ్యమేదియగు నవ్విధమేర్పడ నిశ్చయింపుమా!
(ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం, 284వ పద్యం)

ధర్మరాజాదులు శాంతశూరులు. చూడడానికి శాంతంగా కనపడతారు. కాని మహాపరాక్రమవంతులు. నీ పెద్దరికంలో జీవితాన్ని గడపాలన్న ఆకాంక్షతోనే వారున్నా రు. అది మీకు ఇష్టంగా అనిపించకపోతే యుద్ధం చేయడానికి వారూ వెనుకాడరు. కాబట్టి, ఈ రెండింటిలో ఏది అభిలషణీయమో నిర్ణయించాల్సింది నీవ ుకనుకనీవే ఆ నిర్ణయం తీసుకో… అని యుద్ధం మొదలుకావడానికి ముందు, పిల్లవాడికి అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడికి. చెప్పింది అప్పుడు బుద్ధిలోకి వెళ్ళ లేదాయనకు. ఆ తరువాత కూడా చెప్పవలసిన వాళ్ళందరూ కూడా చెప్పారు, శ్రీకృష్ణుడు చెప్పినది ఆలకించి సంధిమార్గం పట్టమని. అయినా చివరకు ధృతరాష్ట్రుడు అంటాడు:

కం|| అని యతఁడుశౌరితోని
ట్లను ‘ని#హముంబరముఁగలుగునట్టి విధము నీ
వనఘా! చెప్పితి; నాకుం
జనవేదియులేదు దీన సమ్మతి నడుపన్‌.
(ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం, 328వపద్యం)

‘కృష్ణా! ఇ#హ పరాలు రెండింటిలోనూ సౌఖ్యం సమకూరే విధమేదో నీవు చెప్పావు. నిజమే! కాని, నీవు ఆశించిన విధంగా సంధికార్యం పొసగేలా చేయడానికి కావలసిన చొర వ, స్వాతంత్య్రం నాకు ఇక్కడ ఏమాత్రం లేవు. నేనేమి చేయగలను చెప్పు!’ అంటాడు.
అలా అన్న ధృతరాష్ట్రుడు, కర్ణుడు మరణించాడని తెలిసిన మరుక్షణాలలోనే ఇక ఈ బ్రతుకు బ్రతకడం ఎందుకు? ఎలా బ్రతకడం? అన్న విచారంలో పడతాడు. కర్ణుడు మరణించాక దుర్యోధనుడు ఇంకా బ్రతికే ఉన్నాడా? అన్న సందేహం కూడా కలుగుతుం ది ఆయనకు. దుర్యోధనుడి మరణం కూడా ఇక దగ్గరలోనే ఉన్నదనీ, అది ఎవ్వరూ తప్పించలేరనీ అవగతమౌతుంది. నిజానికి కర్ణుడు లేకపోయిన తరువాత దుర్యోధను డు ఉండీలేనట్లే అన్న భావన ధృతరాష్ట్రుడి మనసులో కలుగుతుంది. ఆ కారణంగానే ఒక్కసారిగా ఇకముందు బ్రతుకు భరించలేనిదిగా, శూన్యంగా కనపడడం మొదలౌతుం ది ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడిపై కూడా కర్ణుడి ప్రభావం అంతలా ఉందనేది ఈ ఒక్క పద్యంలోని ధృతరాష్ట్రుని మాటలతో స్పష్టమౌతుంది. ఈ కారణం చేతనే ‘కర్ణుతలభారతం’ అనే అర్ధవంతమైన నాను డి తెలుగునాట పుట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement