నహ కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మ కృత్ / కార్యతేహ్య వశ: కర్మ, సర్వం ప్రకృతి జైర్గుణౖ: అంటూ భగవద్గీత ఈ లోకంలో ఎవరూ క్షణ కాలమైనా కర్మ చేయకుండా ఉండరు. ఇది జీవులకు ప్రకృతి సహజంగా అల వడిన నైజము అని అభిప్రాయపడింది.
‘కర్మ’ అంటే పని. కర్మలు సంకల్పిత కర్మలు, అసంకల్పిత కర్మలు అని రెండు రకాలు. ఉద్దేశ్య పూర్వకంగా చేసే పనులు సంకల్పిత కర్మలు కాగా శ్వాసక్రియ, కనురెప్పలు మూసి తెరవడం, తుమ్మడం వంటివి అసంకల్పిత కర్మలు. ఇవికాక, ఆకలి తీర్చుకోవడం కోసం ఆహారం స్వీకరించడం, దాహం తీర్చుకోడానికి నీరు త్రాగడం, మలమూత్ర విసర్జనలు, నిద్రపోవడం మొదలైనవి జీవితం కొనసాగడానికి చేసే తప్పనిసరి కర్మలు. వీటి వలన కర్తకు గానీ, సమాజానికిగానీ ప్రత్యేకమైన మంచి గాని, చెడు గాని జరుగవు.
ఇక శాస్త్రాలు కర్మలను ‘నిత్య కర్మలు’, ‘నిషిద్ధ కర్మలు’ అంటూ రెండుగా విభజించాయి. శాస్త్రానుసారం తనకు ఇ#హపర సాధకాలై, పరులకు మేలు కలిగించేవి సత్కర్మలు. శాస్త్ర విరుద్ధములైనవి దుష్కర్మలు. సత్కర్మలను ‘విహత కర్మలు’ అనీ, దుష్కర్మలను ‘నిషిద్ధ కర్మలు’ అనీ అంటారు. పరోపకారం చేయడం, మాతాపితరులను సేవించడం, అతిథులను ఆదరించడం, దానధర్మాలు చేయడం వంటివి సత్కర్మలు లేదా విహత కర్మలు. మద్యపానం, దొంగతనం, వంచన చేయడం వంటివి దుష్కర్మలు లేదా నిషిద్ధ కర్మలు. శరీరం ద్వారా చేసేవి శారీరక కర్మలు కాగా, మనసుతో చేసేవి మానసిక కర్మలు. సేవకుడు తన యజమాని చెప్పిన పనిని అంకిత భావంతో చేయడం, రాజు తన ప్రజల శ్రేయస్సుకై పాటు పడడం, గృహణి కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తూ ఇంటి పనులను బాధ్యతగా నిర్వర్తించడం, పౌరులు దేశము, సమాజం పురోగతికి పాటుపడటం వంటివి విద్యుక్త కర్మలు. రోజూ చేసే స్నానం, పూజ, జపం, ధ్యానం వంటివి నిత్య కర్మలు కాగా, నిర్దిష్ట ప్రయోజనం కోసం చేసే భూమి పూజ, గృహ శాంతి వంటివి నైమిత్తిక కర్మలు. యజ్ఞ యాగాది క్రతువులు చేయడం శ్రౌత కర్మలు. స్మృతి బోధించినవి స్మార్త కర్మలు. వ్రతాలు, నోములు, ఉపవాసాల వంటి పురాణాలలో చెప్పబడి ప్రజలచే ఆచరింపబడే కర్మలు పౌరాణిక కర్మలు అనబడతాయి.
ఆధ్యాత్మిక వేత్తలు కర్మలను సత్కర్మలు, వికర్మలు, అకర్మలు, నిష్కర్మలు అని నాలుగు రకాలుగా విభజించారు. శాస్త్రాలు చెప్పినట్లుగా సరైన, ధర్మబద్ధమైన కార్యకలాపాలను చేయడం సత్కర్మ. శాస్త్రవిరుద్ధమైన, అధర్మమైన కార్యకలాపాలను చేయడం వికర్మ. కర్మ ఫలాన్ని ఆశించక పోవడం అకర్మ. ఏ కర్మనూ చేయకపోవడం నిష్కర్మ.
భగవద్గీత ఇలా అంటుంది : ”కర్మణ్యో#హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణ: / అకర్మణశ్చ బోద్ధవ్యం, గ#హనా కర్మణో గతి: ” (భ.గీ. 4అ. 17వ శ్లో) శాస్త్రవిహతమైన కర్మలయొక్క, శాస్త్రాలు నిషేధించిన వికర్మల యొక్క, కర్మఫలాన్ని ఆశింపని అకర్మల యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని జ్ఞానులు మెలగాలి. ఎందుకంటే కర్మ యొక్క వాస్తవ సత్యం మిక్కిలి లోతైనది. దానిని తెలుసుకోవడమనేది చాలా కష్టం.
మనం చేసే కర్మలనుబట్టే మనకు సుఖ దు:ఖాలు కలుగుతాయి. ”స్వకర్మణా భవేద్దు:ఖం, సుఖం తేనైవ కర్మణా! తస్మాచ్చ పూజ్యతే కర్మ, సర్వం కర్మణి సంస్థితం”. మానవులకు తాము చేసే పనుల వలననే సుఖము, దు:ఖము అనేవి కల్గుతాయి. అందుకే కర్మ అందరి చేతా పూజింపబడుతుంది. కర్మలోనే సమస్తమూ నిండి ఉంది. ”ప్రయోజన మనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే”. తనకు ప్రయోజనం లేని పనిని మూర్ఖుడు కూడా చేయడు. వేటి వలన మనకు ఇహపర శ్రేయం లభిస్తుందో ఆ పనులనే మనం చేయాలి. ఎందుకంటే, ”తత్కర్మ యన్నబంధాయ, సా విద్యా యా విముక్తయే / ఆయాసాయా పరంకర్మ విద్యాన్యా శిల్ప నైపుణం”. ఏ కర్మ మనల్ని బంధింపదో అదే శ్రేష్ఠమైనది. మిగిలినవన్నీ దు:ఖాన్ని తెచ్చి పెట్టేవే. ఏది ముక్తి సాధకమో దానినే విద్య అని గ్ర#హంచాలి. మిగిలిన విద్యలన్నీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేవే తప్ప ముక్తినివ్వవు.
కర్మ చేయక పోవడం తప్పే. కర్మ చేయడమూ సుఖ దు:ఖ కారణం అవుతుంది. మరి మనం ఎలా ప్రవర్తించాలి అనే ప్రశ్నకు భగవద్గీత ఇలా సమాధానమి స్తుంది. ”కర్మణ్య వాధికారస్తే, మాఫలే షు కదాచన ! మా కర్మఫల హతు ర్భూ: మాతే సంగోస్త్వకర్మణి”. కర్మ చేయడంవరకే మన పని. కర్మఫలాన్ని ఆశించడం, లేదా, కర్మలను వదలి వేయడం రెండూ పనికిరావు. కర్మ ఫలితాన్ని భగవదర్పితం చేసి, మన విధ్యుక్త కర్మాచరణలో నిమగ్నులమవుదాం.
- గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి