Tuesday, November 19, 2024

ధ్వజారోహణంతో కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

తిరుమ‌ల : తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వరస్వామి, వల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.54 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు మణిస్వామి, కంకణభట్టర్ ఉదయస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

ఏడాదికోసారి ధ్వజస్తంభానికి విశేష అభిషేకం :
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లరసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు. అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

హంస వాహనం :
రాత్రి 8 నుండి 10 గంటల వరకు హంస వాహనంపై కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో విహరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ పార్ధసారథి, సూపరింటెండెంట్‌ భూపతి, ఇన్‌స్పెక్టరు బాలకృష్ణ, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement