తిరుపతి : నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం శ్రీవారు రథాన్ని అధిరోహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 7.20 రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామివారు అశ్వ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం కన్నుల పండుగ జరగనుంది. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, ఈఈ మనోహర్, డిప్యూటీ ఈఈ రాఘవయ్య, సూపరింటెండెంట్ ఏకాంబరం, టెంపుల్ ఇన్ స్పెక్టర్ భరత్ పాల్గొన్నారు.
జూన్ 8న చక్రస్నానం :
కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11.15 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి, చక్రత్తాళ్వార్ వారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. తర్వాత శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.