పెనుగంచిప్రోలు ఒక పురాతన నగరము. మున్నానదిగా పిలువబడే మునేటి ఒడ్డున విలసిల్లిన బృహత్కాంచీపు రమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్టను పాలించిన చాగి వంశీయులకు రెండవ రాజధానిగా పేరొందిన నగరమిది. ”అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ” అంటాడు అల్ల సాని పెద్ద న. అలాగే ఈ పెనుగంచిప్రోలులో ఎక్కడ తవ్వినా శిథిల శిల్పాలు కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తు న్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురా తన అవశేషాలు బయటపడుతూనే ఉంటాయి. ఒక ప్రదేశానికి అంత మహత్తు కలగటం ఆ స్థల మహత్యమని పెద్దలు చెపుతారు.
అటువంటి పవిత్ర ప్రదేశంలో భక్తులకు కొంగు బంగారమై, కోర్కెల తీర్చెడి కల్పవల్లి శ్రీ తిరుపతమ్మ తల్లి కొలువు తీరిం ది.
శ్రీ తిరుపతమ్మ తల్లి వృత్తాంతం క్రీ.శ 1695లో జరిగినట్లుగా చెప్పబడుతోంది. కృష్ణాజిల్లా అనిగండ్లపాడు గ్రామానికి చెందిన కొల్లాశివరామయ్య, రంగమాంబలు ఆదర్శ దంపతులు. వారికి సంతానంలేదు. సంతానార్ధులై తిరుమల యాత్ర చేసిన ఆ దంప తులకు తిరుమలేశుని అను గ్రహంతో ఆడశిశువు జన్మించింది.
శ్రీ తిరుమలవాసుని ఆశీస్సులతో పుట్టిన బిడ్డకు తిరుపతమ్మ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకొనసాగిరి. ఆ బిడ్డ పుట్టిన వేళావిశేషమో, ఏమోగాని ఆ యింట ధనధాన్య పశుసంమృ ద్ధి పెరిగి ఆ యిల్లేకాక ఆ గ్రామమంత పాడి పంటలతో కళకళలాడు చుండెను. చిన్ననాటినుండి తిరుపతమ్మ భగవంతుని యందు భక్తి, పెద్దల పట్ల వినయవిధేయతలు, బీదల యందు దయాదాక్షి ణ్యాలను ప్రదర్శిస్తూ అందరికి తలలో నాల్క లా మెలగుచుండెడిది.
ప్రక్కనే ఉన్న పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తల్లియైన రంగమాంబగారి అన్నగారి కుటుంబం నివసిస్తుండేది. కాకాని రామయ్య గారి కుటుంబం పెనుగంచిప్రోలులో కీర్తిప్రతిష్ఠలు గల్గిన వ్యవసాయ కుటుంబం. వీరి తమ్ముడు కృష్ణయ్య. అన్నదమ్ములిద్ద రు బలరామకృష్ణులవలె ఒకేమాట ఒకేబాటగా వ్యవహరించెడి వారు. రామయ్యగారి భార్య పుత్ర సంతానాన్ని కని కాలం చేయడం, మరికొంతకాలానికి రామయ్య కూడ మరణించడంతో ఆ పసివాని ఆలనాపాలనా కృష్ణయ్య దంపతుల మీద పడింది. అతని పేరే మల్ల య్య. అన్నయ్య బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కొంతకాలానికి కృష్ణయ్య- వెంగమాంబ దంపతులకు మగ పిల్ల వాడు జన్మించాడు. అతనికి గోపయ్య అని నామకరణం చేశారు. యుక్త వయస్కుడైన మల్లయ్య కు అనిగండ్లపాడుకే చెందిన కన్నేటి వారి ఆడబడుచు చంద్రమ్మ నిచ్చి వివాహం చేశారు. తిరుపతమ్మ ను గోపయ్యకు ఇచ్చి వివాహం చేశారు. తిరుపతమ్మ అత్తవారింట అడుగు పెట్టింది. ఆడపడుచును అత్తవారింటికి పంపి స్తూ సమస్త గృహోపకరణాలతో పాటు ఒక గోవును కూడ అరణంగా పంపిం చాడు శివరామయ్య. కొత్తకోడలు రాకతో కాకాని వారింటికి కొత్త కళవచ్చింది. పాడి పంటలు సిరిసంపదలు వృద్ధిచెందాయి. లక్ష్మీదేవి వచ్చిన వేళా విశేషమని నలుగురు చెప్పుకోసాగారు. క్రమంగా తోడికోడలు చంద్రమ్మలో ఈర్ష్యాసూయలు బయలు దేరాయి. అత్త వెంకమ్మ మనసును కూడ మార్చి వేసింది. సూటి పోటి మాటలతో తిరుపతమ్మను వేధించసాగారు.
ముదిరాజు వంశజురాలైన పాపమ్మ వచ్చి, తిరుపతమ్మతో పరిచయం చేసుకొని, ఆవిడకు అన్ని రకాల చేదోడు వాదోడుగా వుం టుండేది. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు కదా కృష్ణాజిల్లాలో వర్షా భావ పరిస్ధితులేర్పడ్డాయి. కరువుకాటకా లతో జనం వలసలు వెడుతున్నారు. గొడ్లకు మేతదొరకడం గగన మైపోయింది. ఆవుల మందను ఉత్తర ప్రాంత భూములకు తోలుకు పోవడానికి ఊరంతా నిర్ణయించింది. ఇంటికి ఒకరు చొప్పున మంద వెనక వెళ్లాలని తీర్మా నం. కృష్ణయ్యగారి ఇంటినుండి గోపయ్య బయలుదేరాడు. భర్త వెళ్లడం తిరుపతమ్మకు ఇష్టం లేదు.
గోపయ్య అడవి వెళ్లినదగ్గర నుండి తిరుపతమ్మకు అత్త తోడి కోడలు పెట్టే ఆరళ్లు కూడ ఎక్కువైనాయి. ఇంతలో తిరుపతమ్మకు కుష్టువ్యాధి సోకటంతో ఆమెను గొడ్లసావిట్లో పడేశారు. అన్నివేళలా పాపమ్మే ఆమెకు చేదోడు వాదోడుగా ఉండేది. ఇంతలో ఆవులమం దల వద్ద నున్న గోపయ్యకు తిరుపతమ్మను గూర్చి చెడు కలలు రావడంతో, తన ఆవులను తోటివారి కప్ప గించి పెనుగంచిప్రోలు . ఇంట్లో తిరుపతమ్మ కనపడ లేదు. అమ్మ వదినలు తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లిందని చెప్పారు. మునేటి ఒడ్డున అమ్మలక్కల మాట ల్లో తిరుపతమ్మ కొచ్చిన కష్టం తెలుసుకున్న గోపయ్య గొడ్ల సావిడికి చేరుకొన్నాడు. కుళ్లి కృశించి నీరసించిన శరీరంతో గోశాలలోపడి వున్న ఇల్లాలును చూచి విహ్వలుడై, ఆమెను పట్టుకొని భోరున విలపించాడు గోపయ్య. వెంటనే వెళ్లి అవులమందను తోలుకొచ్చేసి, తిరుపతమ్మ దగ్గరే వుంటానన్నాడు. తిరుపతమ్మ వద్దంటున్నా వినక మందను తోలుకు రావడానికి అడవికి వెళ్లిపోయాడు గోప య్య. అక్కడకు వెళ్లేసరికి తిరుపతమ్మ పుట్టింటినుండి తెచ్చుకున్న ఆవును పెద్దపులి నోట కరుచుకుపోయిందని చెప్పారు తోటిస్నేహితులు. అసలే బాధలో వున్న గోపయ్య ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టు కొని పులి గుహలోకి ప్రవేశించాడు. విధి వక్రించింది. గోపయ్య నేల కొరిగాడు. ఆ విషయం తన యోగశక్తితో తెలుసుకున్న తిరుపతమ్మ యోగాగ్నితో మరణించడా నికి సిద్ధపడి, గ్రామపెద్ద శ్రీశైలపతిగార్కి పాపమ్మ ద్వారా కబురు చేసింది. చర్చోపచర్చల తరువాత అనుమ తిచ్చారు. వెంకమ్మ, చంద్రమ్మలు తమ తప్పు తెలుసుకొని తిరుప తమ్మను శరణు వేడారు. పాపమాంబ వంశము ఆచంద్ర తారార్క ము అభివృద్ధి చెందుతూ, తిరుపతమ్మకు నిత్య అర్చన, ధూపదీప నైవేద్యాలు పాపమ్మ వంశమువారినుండే లభించేట్లు ఆదేశించిన పసుపు కుంకుమతో కూడిన పూజాపళ్లాన్ని పాపమ్మకు అందించిం ది. పాపమ్మ కడసారిగా తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది.
సాయంసంధ్యావేళలో, బాజాభజంత్రీలు మారుమ్రోగుతుం టే, జనసందోహం జయజయధ్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది. ఆ ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం”మంగళసూత్రము కుంకుమ భరిణ దేదీప్యమానంగా ప్రకాశించే గోపయ్య, తిరుపతమ్మ”ల విగ్రహాలు లభించాయి. గ్రామపెద్దలైన శ్రీశైలపతిగారు ఆ ప్రదేశంలోనే దివ్యయంత్రాలతో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. తమ్ముడి మరణం మరదలు యోగాగ్ని ప్రవేశంతో దిగులు పడి మంచం పట్టి మరణించాడు మల్లయ్య. తన తప్పులు తెలుసుకున్న చంద్రమ్మ పసిపాపతో సహా సతీసహగమనం చేసింది. శ్రీశైలపతి గార్కి తిరుపతమ్మ కలలో కన్పించి చెప్పడంతో, చంద్రమ్మ మల్లయ్యలకు కూడ అమ్మవారి ఆలయానికి దక్షిణంగా గుడి కట్టించారు. ముందుగా చంద్రమ్మ దంపతులను దర్శించిన తరువాతే అమ్మవారిని దర్శించాలి. ఆనా టి నుండి తిరుపతమ్మ పేరంటాలు భక్తుల పాలిట కామధేనువై కోరి న కోరికలను తీరుస్తూ, భక్తులను కాపాడుతోంది.
ఆలయ ప్రత్యేకత
సంతానార్థులైన దంపతులు మునేట్లో మునిగి, తడిబట్టలతో ఆలయ ప్రదక్షణం చేసి, ప్రాణాచారం పడినట్లయితే అమ్మ పసిపాప రూపంలోనో, పెద్దముత్తైదువు రూపంలోనో వచ్చి ఆశీర్వదిస్తుందని భక్తుల నమ్మకం. కోరిక తీరిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమ ర్పించుకుంటుంటారు. పెళ్లిజరగటంలో జాప్యం జరుగుతున్నా, కాపురంలో కలతలు రేగినా వారి తల్లిదండ్రులుగాని అత్తమామలు గాని వచ్చి అమ్మవారి కళ్యాణం జరిపించి పసుపు కుంకుమ అక్ష తలను స్వీకరిస్తే కలతలు తీరతా యని విశ్వాసం.
– దైతా నాగపద్మలత