Sunday, September 22, 2024

కలియుగ నాద బ్రహ్మ!

ఆధ్యాత్మిక సాధకునికి మనసును స్వాధీన పరచుకోవడం ఎంత ముఖ్యమో తెలియచేసిన మహాయోగి శ్రీ త్యాగరాజ స్వామి. ఈ రోజు వారు జన్మించిన పర్వదినం. దాదాపు వేయికి పైగా భక్తిరస కీర్తనలను రచించి, ఆలపించి ఆ శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలకు పాత్రులయిన త్యాగరాజస్వా మి ధన్యులు.
అంత:కరణ చతుష్టయాలయిన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తములలో మనసు ప్రధానమయినది. లౌకికి ప్రపంచమును పరిశీలిం చు ఈ మనసు మర్కట సమానమయినది. అటువంటి దీనిని ఎవరైతే తమ స్వాధీనంలో ఉం చుకుంటారో వారు ఆత్మశోధనకు అర్హులవుతారు. ఈ మనోస్వాధీనమే ఆత్మసాక్షాత్కారానికి దారి చూపుతుంది.
తొంభై ఆరుకోట్ల రామనామ జపమును తపస్సుగా చేసి ఆ సీతారా ములను ప్రత్యక్షం చేసుకున్న మహిమాన్వితుడు ఆ నాదబ్రహ్మ. ఆయన కీర్తనలను విన్నా, ఆలపించినా మనసు, తనువు పులకించి తుదకు ఆత్మ చింతనకు నాంది పలుకుతుంది.
”మదిలోన యోచన పుట్టలేదా మహారాజా రాజేశ్వరా…” ఈ కీర్తన లో త్యాగరాజు మొదట తన మనసులో శ్రీరాముని నిలుపుకొను ప్రయ త్నమున ”నీ మదిలో యోచన పుట్టలేదా స్వామీ! దశావతారములలో రామావతారమున నీ ధర్మపరాక్రమము బహువిధములుగా బాగు బాగు!” అని సకల దేవతలు కీర్తించారు. అటువంటి నిన్ను నమ్మిన నన్ను బ్రోవగరావా! రామా! అటువంటి యోచన నీ మనసున జనింప చేయ వా! అని వేడుకొను రీతి ఎంతో హృద్యముగా ఉంటుంది.
మనసా ఎటులోర్తునే నా మనవి చేకానవే ఓ!…మనసును స్వాధీన పరచుకోవడం అంత సులభమైన పనికాదు. దానిని స్వాధీన పరచుకొన్న వారు ఈ విశ్వమునే జయించినట్లు స్వామి వారు లౌకిక సంసారమనే మహాసాగరంలో అలల తాకిడికి పడిలేచే ఒక నావగా తనని భావించుకున్నా రు. తన మనసును ఎదురుగా నిల్పి, నిలకడలేని ఓ మనసా! నేను ఎటుల ఓర్చు కొందును? రాముని భజనతో దినమంతా గడుపమని నీకు చెబుతున్నా నా మా ట వినవు కదా! ఓ! గుణ విహీనా! అంటూ తన మనసును బ్రతిమాలిన, హెచ్చ రించిన తీరు ఆయన అపురూప భక్తికి నిదర్శనం. ”కలిలో రాజస, తామస గున ములు కలవారి చెలిమి” కలియుగంలో రజోగుణం, తమోగుణం కలిగిన వారి స్నేహం చేయడానికి మనసు ఉత్సాహం చూపుతుంది. అందువలన దినకరకు ల భూషణుడైన శ్రీరా ముని భజన చేయుమని సూచన చేస్తున్న ఈ త్యాగరాజు మాట వినవా? ఓ మనసా! అని ఆర్తితో అలమటించిన వారి రామభక్తి నిష్కల్మష మైనది. తన మనసును ఓ గుణవిహీనా! అని తన ఎదుట నిలబెట్టిన తీరులో ఎం తో భక్తి మర్మము కనబడుతుంది.
మనసా మన సామర్థ్యమేమి… అను కీర్తనలో అహంకారమనే మాయలో మునిగిన అల్పమానవుని మనసు యొక్క సామర్థ్యము ఎంత అల్పము, తన వల్లనే జగమంతా నడచుచున్నట్లు భావిస్తున్న మానవుడు ఎంత అమాయకు డు. విశ్వమునే ఒక ధర్మరథముగ చేసుకొని పయనిస్తున్న శ్రీరాముని ముందు మానవుడు పరమాణుమాత్రుడు అటువంటి అల్పమానవుని సామర్థ్యమెం త? అని గద్దించిన విధానము ఎంత గంభీరమో కదా!
మనసా శ్రీరాముని దయలేక, మాయమైన వితమేమే… ఆ పరాత్పరుడైన శ్రీరాముని దయ లేకపోవడానికి కారణము మానవుడు చేసే పాపకృత్యములు. ఎవరైతే అటువంటి దుర్మార్గాలకు పాల్పడతారో వారి మనసు దైవము ముందు భయంతో మాయమైపోతుంది. పరుల ధనమునకు ఆశపడుట, ముఖ్యముగా స్త్రీ ధనమును దోచుకొనుట, ఇతరుల మనసుకు, మాటకు, దేహమునకు హింసను కలిగించుట మొదలైన అకృత్యములు చేయువారికి దేవుడు గుర్తుకు రాడు. అయితే కోదండరాముని దండనతో ఆ పాప కృత్యములన్నీ గుర్తుకు వస్తా యి. అపుడు మనసు విలవిలలాడుతూ ప్రత్యక్షమవుతుంది. శరణువేడితే క్షమా ర్హమవుతుంది.
మనవిని వినుమా మరువ సమయమా… ఈ కీర్తనలో ఓ! రామచంద్రా దుష్టసంకల్పములు మానివేసినాను. పరులకు మంచి చేయు ఆలోచనలే చేయు చున్నాను. పరపీడన చేయు చింతన నా మనసున చేరనీయుట లేదు. కావున నా మనవిని విను ఓ! రామచంద్రా! నను మరువక ముక్తిని ప్రసాదించు అని సన్మార్గ మే భక్తి మార్గమని బోధించాడు.
”మనవాలకించరాదటే, మర్మమెల్ల చెప్పెదనే మనసా…”ఈ కీర్తనలో కూడా తన మనసును తన ఎదుట నిల్పుకొని నచ్చజెప్పిన విధానంలో ఒక గొప్ప తార్కి కత కనబడుతుంది. కరుణాంతరంగుడైన శ్రీరాముడు సర్వాంతర్యామిగా ఈ విశ్వమంతా ఆక్రమించియున్నాడు. అంత:కరణ చతుష్టయాలకు అధిపతి ఆయనే! జనులను ఉద్ధరించడానికి మానవావతారుడై ఇల నిలిచాడు. అదే మర్మము. ఓ మనసా! ఆలకించు అంటూ జగమంతా రామాయణం అనే తత్త్వ మును మనకందించారు. రామనామంలో ఐక్యం అయిన ఒక మహాభక్తుడు త్యాగరాజస్వామి.
ఇక ”మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంద్రములేల…” అను కీర్తన రామాంకితమైన మనసు యొక్క ఘనతను సూచిస్తుంది. దేహాత్మ భావన లేని వానికి తపస్సుతో పని లేదు. సర్వమూ శ్రీరామచంద్రుడేనని నమ్మినవారికి ఆశ్రమ భేదాలు ఉండవు. కాంతాకనకాలపై భ్రమలు తొలగిపోతాయి. మంత్ర ము, తంత్రములతో పనిలేదు. జ్ఞాన, వైరాగ్యములతో రామభక్తి యోగియై పర మాత్మను చేరుట తథ్యము. ఈ విధముగా మనసు ముందు తన స్వాధీనము చేసుకొన్నవారు మాత్రమే నవవిధ భక్తి మార్గములో పయనించి తుదకు ఆత్మ నివేదన చేయగలరని నిరూపించిన రామభక్తాగ్రేసరులు శ్రీ త్యాగరాజస్వామి వారు. సంగీతమును ఒక మాధ్యమంగా చేసుకొని తన అమూల్యమైన కీర్తన లతో ఆ శ్రీరామచంద్రుని సాక్షాత్కరింపచేసుకొన్న కలియుగ నాదముని శ్రీ త్యాగరాజస్వామి వారు. ఆ స్వరోపాసనతో తమ మనసులను ఆ సీతారాము లకు అర్పిస్తున్న ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.

Advertisement

తాజా వార్తలు

Advertisement