కలారాధన గూర్చి డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
‘కాల: కలయతా మహం’ అనునది గీతలో కృష్ణ భగవానుని ఉవాచ. ‘కలయతీతి కాల:’ అని కాల శబ్దానికి అర్థం. కాలము అంటే కొన్నిటిని వేరు చేస్తుంది మరి కొన్నిటిని కలుపుతుంది. న్యాయంగా రెండిటికి అర్థం ఒకటే. వేరు చేయడం అంటే కలపడమే, కలపడము అంటే వేరు చేయడమే. ఒక వస్తువును ఒక దగ్గర నుంచి దూరం చేయడం, వేరు చేయడం అంటే మరోదానికి దగ్గర చేయడమే, ఇదే కలపడము. ఇలా వేరు చేయుట కలుపుట రెండూ చేసేది కాలమే. ఆస్తికులైనా, నాస్తికులైనా, భక్తులైనా, రిక్తులైనా కాలాన్ని అనుసరించి తీరుతారు. సమయానుసారంగా నిదురపోవడం, లేవడం, స్నానము, భోజనము అలాగే రైళ్లు, బస్సులు, విమానాలు కాలానుగుణంగానే పని చేస్తున్నాయి. కాలాన్ని అనుసరించని వారిని శాస్త్రం జీవచ్ఛవం అంటుంది. అంటే ప్రాణం లేని శరీరం మాత్రమే కాలాన్ని అనుసరించదు.
అంత: పురుష రూపేణ
కాల రూపేణ యో బహి:
సమన్వేతి ఇహ అర్ధానాం
తస్మై కాలాత్మనే నమ:
అని భాగవత శ్లోకం అనగా పరమాత్మ ప్రతి వస్తువులో అంతర్యామిగా ఉండే పని చేయిస్తాడు, బయట కాల రూపంలో ఉండే పని చేయిస్తాడు, అందుకే కాలాన్ని అనుసరించే వారందరూ పరమాత్మ భక్తులే. ఈ కాలము పరమాత్మ స్వరూపమని తెలుసుకున్నాము. అందరిలో ఉండే వాడు పరమాత్మే, అందరితో పని చేయించేది కాలమే కావున అందరిని శాసించే వాడు పరమాత్మే, కాలమే.
మనం చేసే భోజనంలో భక్ష్య భోజ్య, లేహ్య, చోష్య, పేయ, పానీయ అని ఆహారం ఆరు విధాలుగా విభాగం చేయబడినది. అంటే అన్నము, పక్వాన్నము, పప్పు, కూర, పులుసు, పాయసం, పానకం, మంచి నీరు ఇవన్నీ మనం తీసుకునే ఆహారములే కానీ అన్నీ ఒక సారే తీసుకోము, వేరువేరు సమయాలలో ఒక క్రమంలో తీసుకుంటాము. తినడం కడుపు నింపడానికి కాదు, కడుపులో ఉన్న జఠరాగ్ని రూపమున ఉన్న పరమాత్మకు ఆరాధనా రూపము భోజనము. అలాగే స్నానం పరమాత్మకు నివాసమైన దేహానికి అభిషేకము ఇలా ప్రతి కర్మ పరమాత్మారాధనే. ఆ కర్మకు నియమించబడిన కాలం కూడా పరమాత్మ స్వరూపమే. కాలం కూడా పగలు ఆరు విభాగాలు, రాత్రి ఆరు విభాగాలుగా విభజించబడింది.
1 బ్రాహ్మీ ముహూర్తము
2 ప్రాత: కాలము
3 సంగవ కాలము
4 పూర్వాహ్ణము
5 మధ్యాహ్నం
6 అపరాహ్ణం
అనునవి పగలు విభాగము. అలాగే
1 ప్రదోషము
2 సాయం కాలము
3 నిశా కాలము
4 పూర్వ రాత్రము
5 మధ్య రాత్రము
6 అపర రాత్రము
అనునవి రాత్రి విభాగము. ఇలా కాలమునకు పన్నెండు భాగములు శాస్త్రం నిర్ణయించింది. ఈ పన్నెండు భాగములకు పరమాత్మ పన్నెండు నామాలు అధిపతులు.
కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృహీకేశ, పద్మనాభ, దామోదర ఈ పన్నెండు మంది
దేవతలు పన్నెండు కాలాలకు అధిపతులు. అందుకే లేవగానే కేశవ నామాన్ని తలుచుకోవాలి. పాద ప్రక్షాళనాదులు నారాయణ నామంతో
చేసుకోవాలి. స్నానశాల శుద్ధిని, దేహ శుద్ధిని మాధవ నామంతో చేయాలి. స్నానం గోవింద నామంతో అనగా
గోవిందేతి సదా స్నానం
గోవిందేతి సదా జపం
గోవిందేతి సదా ధ్యానం
సదా గోవింద కీర్తనం
అని శ్లోకం చదువుతూ చేయాలి. అచ్యుత, అనంత, గోవింద అను నామాలతో ఆచమనం చేయాలి. విష్ణు, మధుసూదన నామంతో పరిశుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకోవాలి. త్రివిక్రమ నామంతో వస్త్ర ధారణ చేసుకోవాలి. వామన నామంతో తిలక ధారణ చేసుకోవాలి. ఇలా
ఒక్కొక్క నామంతో నిత్యానుష్ఠానం ముగించుకోవాలి. అయితే నిత్య కృత్యములు స్నాన సంధ్యావందన భోజనాధులు నియమిత సమయంలో పూర్తి చేసుకోవాలి.
నైమిత్తిక కామ్యకర్మలకు అనగా జాతకర్మ, నామకరణం, చౌవలం, అన్నప్రాశనం, కేశఖండనం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వేదాధ్యయనం, సమావర్తనం, వివాహం, గర్భదానం, పుంసవనం ఇత్యాది కర్మలు ఆయా నియమిత కాలంలోనే చేయాలి. దాని కోసం స్వామి తన అంశలుగా నవగ్రహాలను, 27 నక్షత్రాలను, 12 రాశులను ఖగోళంలో ఏర్పరిచాడు. తనని నేరుగా పూజించలేని వారు ఆ గ్రహాలను పూజిస్తారు.
గ్రహాలను కాకుండా ఆ గ్రహ రూపంలో పరమాత్మను పూజిస్తారు. సూర్యుడకి ప్రతి రూపం రామచంద్రుడని, చంద్రుడకి ప్రతి రూపం కృష్ణ పరమాత్మ అని, కుజుడికి నృసింహ స్వామి అని, బుధునికి శ్రీ మహా విష్ణువని, బృహస్పతికి వామనుడని, శుక్రుడికి పరశురాముడని, శనికి బలరాముడని,
రాహువుకి కూర్మావతారమని, కేతువుకి మత్స్యావతారం అని ఆయా గ్రహ శాంతులకు ఆయా అవతార రూపాలను ఆరాధిస్తారు. అది కూడా చేయలేని వారికి కాలాన్ని రెండు పక్షాలుగా ఒక పక్షం 15 రోజులుగా విభాగం చేసి వాటిని తిధులుగా అందించాడు.
పాడ్యమి వామనుడని
విదియ శ్రీధరుడని
తదియ మాధవుడని
చతుర్థి విఘ్నేశ్వరుడని
పంచమి ఆదిశేషుడని
షష్టి సుబ్రహ్మణ్యస్వామి అని
సప్తమి సూర్యుడని
అష్టమి కృష్ణుడని
నవమి దుర్గ అని
దశమి శంకరుడని
ఏకాదశి శ్రీ మన్నారాయణుడని
ద్వాదశి త్రివిక్రముడని
త్రయోదశి మహాలక్ష్మి అని
చతుర్ధశి సంకర్షణుడని, నరసింహుడని
పూర్ణిమ గోవిందుడని
అమావాస్య రుద్రుడని
ఇలా తిథులకు అధిదేవతలను నిర్ణయమించారు. అదేవిధంగా 27 నక్షత్రాలకు పరమాత్మ తన రూపాలను నిర్దేశించాడు. తిథులను, నక్షత్రాలను కలపడానికి యోగము అన్నారు. దానికి చేసే సాధనము కరణములు అన్నారు. ఈ విధంగా
1 తిథి
2 వారము
3 నక్షత్రము
4 యోగము
5 కరణము
కాలమునకు ఈ పంచ అంగములను తెలిపేది పంచాంగం.
ఏడు వారములు రెండు పక్షములు, పన్నెండు నెలలు, అరవై సంవత్సరములు, నాలుగు యుగములు ఇది కాల గణనం. సంవత్సరం, పరివత్సరము, ఇదా వత్సరము, ఇదు వత్సరము, ఇద్వత్సరము అని ఈ ఐదింటిని ఒక యుగం అంటారు. ఇలా కాలచక్రంలో పన్నెండు యుగములు అనగా అరవై సంవత్సరములు ఉంటాయి. ఈ అరవై సంవత్సరములు కూడా బ్రహ్మ, విష్ణు, రుద్ర, అగ్ని, యమ, వరుణ, సూర్య, చంద్ర, బృహస్పతి, శుక్ర విభాగంతో విభజించబడి ఉన్నవి. సంవత్సరాన్ని దక్షిణాయనం, ఉత్తరాయణం అని సూర్య సంచార అనుగుణంగా విభాగం చేసి ఉంచారు. సూర్యుడు కర్కాటక సంక్రమణంలో ప్రవేశించినపుడు దక్షిణాయనం, మకరంలో ప్రవేశించినపుడు ఉత్తరాయణం అని అంటారు.
శుభ కార్యములు చేయడానికి ఉత్తరాయణం ప్రశస్తమైనది.
ప్రతి రోజు ఉన్న 24 గంటలను 12,12గా విభజించి సూర్య, చంద్ర, బుధ, కుజ, గురు, శుక్ర, శని అని ఏడు గ్రహాలను పన్నెండు గంటలలో విభాగం చేసి ఆయా నామములతో హోర అని చెబుతారు. అనగా సూర్య హోర, చంద్ర హోర అని ఒక్కొక్క గంటని విభజించారు. ఇంకా లోతుగా వెళితే ఆ గంటకు రెండున్నర ఘడియలు, ఒక ఘడియకు 24 నిమిషాలు, ప్రతి రెండు నిమిషాలకు ఒక్కొక్క నామం చొప్పున పన్నెండు నామాలు, ఇలాంటి అరవై విఘడియలు అయితే ఒక ఘడియ. ఒక విఘడియకు నలభై సెకన్లు అందులో నలభైని పది భాగాలు చేసి నాలుగు సెకన్లకు ఒక అవతారంగా జ్యోతిష్యం నిర్ణయించింది. ఇలా ఏ నిమిషంలో, ఏ సెకనులో, ఏ ఘడియలో, ఏ గంటలో, ఏ రోజులో, ఏ గ్రహముల యొక్క శుభ
వీక్షణ ఉంటుందో, ఏ సమయంలో ఏ పని చేస్తే అనుకూలంగా ఉంటుందో తెలిపేదే పంచాంగం.
మాసము, పక్షము, తిథి, వారము, నక్షత్రం, యోగము, కరణము, సంవత్సరము, లగ్నము, ముహూర్తము, ఘడియ, విఘడియ ఈ ద్వాదశ నామములతో పరమాత్మను స్మరించుకుంటూ ఆయా సమయాలలో ఆ కార్యక్రమములను ఆచరించాలి. ఈ విధంగా కాలమును విభవానుగుణంగా తెలుసుకుని ఆయా కార్యక్రమములను ఆచరించుటకు ఉపయోగించేదే పంచాంగం. ఇందులో ఒక వ్యక్తికి అనుకూలమైన కాలమును చెప్పేది తారా బలము, చంద్ర బలము, లగ్న బలము, గ్రహ బలము, ముహూర్త బలము ఈ ఐదు బలములను చూసి అనుకూల స్థితిలో ఆయా కార్యక్రమములను ఆచరించినపుడు పరమాత్మ పరిపూర్ణ అనుగ్రహముతో అన్ని కార్యక్రమములు విజయవంతమవుతాయి.
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి