Friday, September 27, 2024

ధర్మాత్మురాలు కైకసి

ఎవరి ప్రవర్తనైనా నొప్పించినా- వారి నడవడిక బాధించినా- వారివారి చెడు అలవా ట్లు చేటు తెచ్చినా- ”ఎవరు కన్నారు?” అని, ”ఏం పెంచారు?” అని, తల్లిదండ్రు ల్ని తలచుకోవడం అందరికీ తెలిసిందే, అలా అయితే ”కైకసి”ని గురించి తెలుసుకో వాల్సిందే! కైక వేరు. కైకసి వేరు. కైకసి రామాయణంలో సుమాలి, కేతుమతిల కుమార్తె. ఈమె సోదరులు మారీచుడు, సుబాహుడు. విశ్రవసుని భార్య. రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలకు తల్లి. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు కైకసి, విశ్రవసులకు జన్మిం చినవాడు. విశ్రవసు మహర్షి బ్రాహ్మణ జాతికి చెందినవాడే అయినా కైకసి రాక్షస జాతి స్త్రీ. వీరికి పుట్టిన రావణుడికి సత్వగుణం, తమోగుణం ఎక్కువగా ఉన్నాయి.
పురాణకాలంలో మాలి, సుమాలి, మాల్యవంతుడు అనే ముగ్గురు రాక్షసులు బ్రహ్మదే వుని నుండి వరాన్ని పొంది, దేవతలపై దండయాత్ర చేశారు. వారు ఇంద్రలోకంలో దాడి చేస్తున్న సమయంలో విష్ణువు కూడా అక్కడకు వచ్చి వారిపై యుద్ధం చేశాడు. కొద్దిసేపటికే చాలామంది రాక్షసులు సంహరించబడ్డారు. మాలి కూడా ఈ యుద్ధంలో మరణిస్తాడు. దీనితో, సుమాలి, మాల్యవంతుడు కుటుంబంతో కలిసి పాతాళంలో దాక్కుంటారు.
ఒకనాడు సుమాలి పాతాళం నుండి భూలోకానికి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్తు న్న కుబేరుని యాదృచ్ఛికంగా చూశాడు. కుబేరుడు- తండ్రి విశ్రవసుని సేవించడానికై వచ్చా డు. సర్వాలంకారభూషితుడై మహావిభవ సంపన్నుడైన కుబేరుని చూసి సుమాలి అసూయ పడ్డాడు. పాతాళానికి తిరిగివెళ్ళాడు. కుబేరుని ఐశ్వర్యం, వైభవ ప్రాభవాలే సుమాలి మది లో మాటిమాటికి మెదిలాయి. అలాంటి వైభవం రాక్షసులకు ఎలా కలుగుతుంది? అని పలు విధాలుగా ఆలోచించాడు. అతని మనస్సు అపూర్వ సౌందర్యరాశి అయిన తన కూతురు కైక సి వైపు మరలింది. కైకసిని విశ్రవసునికి భార్యను చేస్తే తన వాంఛ తీరుతుంది అనే ఊహ. అత నిని కర్తవ్యోన్ముఖుని చేసింది. వెంటనే కైకసిని పిలిచి ”అమ్మా! అపురూప లావణ్య రాశివయి న నిన్ను ఎవ్వడూ కన్నెత్తి చూడడానికి సాహసించడం లేదు. ఆడపిల్లను తగిన వరునికి ఇచ్చి పెండ్లి చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. పుట్టినింటికి మెట్టనింటికి వన్నె తేగలిగిన నీకు పుల స్త్య బ్రహ్మ కొడుకు విశ్రవసుడు తగిన వరుడు అని నా అభిప్రాయం. అతనిని పెండ్లాడితే కుబే రుని వంటి మహోన్నతుడిని నీవు కుమారునిగా పొందగలవు” అన్నాడు.
కైకసి తన తండ్రి మాటను శిరసావహంచి, విశ్రవసుని ఆశ్రమానికి పయనమయ్యింది. విశ్రవసునికి ఎన్నో సేవలు చేసింది. గమనించిన విశ్రవసుడు ”ఎవరు నువ్వు” అని అడిగాడు. కైకసి తన గురించి చెప్పడమే కాదు, తన మనసులోని కోరికనూ అతని ముందుంచింది. సంధ్యవేళలో కోరావు కాబట్టి నీకు పుట్టిన వాళ్ళు రాక్షసులవుతారని చెప్పాడు. చెప్పిన విధంగానే ఆమె సంతానం రాక్షసులయ్యారు.
కైకసి రాక్షస జాతి స్త్రీ అయినా ఆమె ధర్మాత్మురాలు. ”దుష్టాత్ములైన కొడుకులను పొందలేను. నన్ను అనుగ్రహంచండి” అని కోరింది కైకసి. విశ్రవసుడు దయతలచి, ”నీ చిన్న కుమారుడు ధర్మపరుడు, సాధు స్వభావుడు అవుతాడు” అన్నాడు. తరువాత కైకసి గర్భవతి అయ్యింది. నల్లమబ్బు రంగు శరీరంతో, పది తలలతో, 20 చేతులతో, ఎర్రని పెదవు లు, కోరలతో భయంకరరూపుడైన రాక్షసుడు పుట్టాడు. అతడు పుట్టగానే భయంకరమైన ఉత్పాతాలు కలిగాయి. విశ్రవసుడు అతనికి ‘దశకంఠుడు’ అని నామకరణం చేశాడు. తరు వాత పర్వతాకారుడు, వికృత భయంకర ముఖుడు పుట్టాడు. అతనికి కుంభకర్ణుడు అని నామకరణం చేశాడు. తరువాత కైకసికి వికృత రూపిణి అయిన శూర్పణఖ పుట్టింది. చివర కు సద్గుణ సంపన్నుడు, ధార్మికుడు, బల పరాక్రమ సంపన్నుడైన విభీషణుడు జన్మించాడు. విభీషణుడు పుట్టగానే దివి నుండి పూలవాన కురిసింది. దేవ దుందుభులు మ్రోగాయి. రావ ణుడు, కుంభకర్ణుడు ఇద్దరూ గత జన్మలో విష్ణువు వద్ద ద్వారపాలకులైన జయ విజయులు.
ఒకరోజు సవతి కొడుకు కుబేరుని అత్యంత వైభవ ప్రభావాలను చూసి కైకసికి కన్నుకుట్టి అసూయతో రగిలిపోయింది. దశకంఠుని పిలిచి, అతనికి కుబేరుని చూపించింది. ”మీరు ఇద్దరు విశ్రవసుని కొడుకులే కదా! నీవు కూడా అతని వలె వైభవోపేతుడైన తండ్రికి తగిన తన యుడవు అనిపించుకొనవద్దా!” అని ఈర్ష్యాసూయలను నూరిపోసింది. దశకంఠుడు తల్లి మాటలను విని, రోషగ్రస్తుడై ”నేను అతనిని మించిపోగలను” చూడమన్నాడు. దశకంఠు డు సోదరులు కుంభకర్ణ విభీషణులతో గోకర్ణం చేరుకుని, జితేంద్రియులై, దృఢవ్రత నియ తులై ఏకాగ్రచిత్తులై బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. శూర్పణఖ వారికి సపర్యలు చేసింది. రావణ కుంభకర్ణులు బ్రహ్మ ప్రసాదించిన వరగర్వంతో లోకకంటకులైనారు.
పురాణ కథనం ప్రకారం లంకానగరంలో ఉన్న రావణాసురుడి తల్లి ‘కైకసి’ నిత్యం సముద్రపు ఒడ్డున ఇసుక మట్టితో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. ఇలా మట్టితో చేసిన శివలింగాన్ని ”పార్థివ లింగం” అంటారు. పార్థివ లింగం పూజ అన్నింటికన్నా మిన్న. ఒక రోజు కైకసి ఎన్నిసార్లు పార్థివ లింగాన్ని చేసినా సముద్రపు అలలు నాశనం చేయసాగాయి. ఆరోజు పార్థివ లింగాభిషేకం చేయకపోవడం వల్ల కైకసి కన్నీటి పర్యంతమవుతుంది. తల్లి నిత్యం పూజకు రావణాసురుడు ”పార్థివలింగం ఏమిటి నీకు శివుని ఆత్మలింగమే తెచ్చి ఇస్తా నని” తన తల్లితో చెప్పి కైలాసానికి వెళతాడు. అందుకు ఫలితంగా వచ్చినదే గోకర్ణ క్షేత్రం.
రామ రావణ యుద్ధ సమయంలో, రావణుని తల్లి కైకసి, వృద్ధ మంత్రి అవిద్ధుడు సీత ను సగౌరవముగా రామచంద్రునకు అప్పగించమని హతవు పలుకుతూ ”రాముని గురించి నీకు ఇంకా తెలియరాలేదా రావణా, ఒక మానవమాత్రుడు జనస్థానములో పదునాల్గువేల మందిని అరగంట కాలములో ఒక్కడే చంపగలిగాడంటే ఆతని సామర్ధ్యమేపాటిదో నీకింకా తెలియకపోవుట చిత్రముగా ఉన్నది. ఒక పెనుకోతి సంద్రము దాటి లంకకు వచ్చి మరల క్షేమముగా తిరిగి వెళ్ళగలిగినదంటే, వారి శక్తిని నీవు సరిగా అంచనా వేయలేదు. సీతమ్మను రాముని వద్దకు చేర్చు. సంధి చేసుకో” అని తల్లి ఎంత చెప్పినా, యుద్ధకాంక్షతో రగిలిపోతు న్న రావణుడు కైకసి మాటలను పెడచెవిన పెట్టాడు. అంతమై పోయాడు.
విచిత్ర రామాయణం కథ ప్రకారమయితే- పుత్రుల్ని కోరిన కైకసితో విశ్రవసువు ఋతు వుకొక పుత్రుణ్ని యిస్తానన్నాడట. అప్పటికామె పదకొండు ఋతువులయ్యానని చెపుతుం దట. అంతమందిని కనక్కర్లేదనీ అంటుందట. దాంతో పది తలల పుత్రుడు రావణుడు, ఒ క పుత్రిక శుర్పణఖ పుట్టిందట.
జైన రామాయణం ప్రకారం కైకసి, వ్యోమబిందు- నందవతి దంపతుల పుత్రిక.
పద్మపురాణం ప్రకారం సుమాలి అతని గుణవతి అయిన భార్య వల్ల రత్నశ్రవ అనే పుత్రు డు కలిగాడు. ఈ రత్న శ్రవుడే రావణుని తండ్రి. వాల్మీకి రామాయణంలో ఇతడే విశ్రవసు డు. పులస్త్య బ్రహ్మ, తృణబిందుని కుమార్తెల పుత్రుడు విశ్రవసుడు. కుబేరుడు రావణుని సవతి తల్లి కుమారుడు. అంటే విశ్రవసునికి భరద్వాజ మహర్షి పుత్రిక దేవవర్ణికీ పుత్రుడు.
దక్షిణాత్య రామాయణ పాఠాల్లో, రావణుని తల్లిపేరు ‘కైకసి’ కానీ మిగిలిన రామాయణ పాఠాల్లో ఆమె పేరు ‘నికష’. భాగవతంలో ఈమె పేరు కేశిని.
ఆనంద రామాయణం ప్రకారం విశ్రవసు, కైకసిలకు ముగ్గురు పుత్రులు, ముగ్గురు పుత్రిక లు. వారు రావణుడు, కుంభకర్ణుడు, క్రౌంచి, శూర్పణఖ, కుంభనసి, విభీషణుడు.
దక్షిణ భారతంలో ప్రచారంలో వున్న కథ ఏమిటంటే, దశరథుని పుత్రకామేష్టి యాగ సం దర్భంలో కైకసి పేరు వస్తుంది. అది, యజ్ఞం తరువాత, ఒక ఋషికి పొరపాటుగా దశరథు డు, తన భార్యల పేర్లలో కైకసి పేరు కూడా చెబుతాడుట. దాంతో ఆ ఋషి యజ్ఞ పాయసాన్ని నాలుగు భాగాలలో నుండి ఐదవ భాగాన్ని కూడా చేసాడట. దాన్ని ఒకకాకి అహరించుకుని, కైకసి దగ్గ రకు వెడుతుంది. కైకసి ఆ పాయసాన్ని త్రాగి, విభీషణునికి జన్మనిస్తుంది అని.
రామాయణంలోవాల్మీకి కైకసి పాత్ర ద్వారా చెప్పిన సందేశం ”జీవితంలో తల్లి పాత్ర అతిముఖ్యమైనది” అని.

Advertisement

తాజా వార్తలు

Advertisement