Saturday, November 23, 2024

జ్ఞానానికి ఆభరణం… క్షమ!

”శరణంబని వచ్చిన భీ
కర శత్రువునైన ప్రీతి కావగ వలయున్‌
కరుణా పరుల తెరంగిది
ఇరవుగ సరికావు దీనికే ధర్మంబుల్‌”

మనకు అనేక విధాలుగా కీడు చేసి, మనసు నొప్పించి, మనతో వైరభావముతో మెలగిన పగవారినైనా సరే క్షమించగలగడం అసామాన్యమైన ధర్మమని పై మహాభా రత పద్యం చెబుతుంది. అలా శత్రువులను క్షమించగలగడం మహాత్ములకే సాధ్యం. సంత్‌ తులసీ దాస్‌ అటువంటి మహాత్ములను మామిడి చెట్టుతో పోల్చారు.

”తులసీ సంత్‌ సుఅంబ్‌ తరు
ఫూల్‌, ఫల్‌ హ పరహత్‌
జిత్‌ తే యే పాహన్‌ హనత్‌
ఉత్‌ తే ఓ ఫల్‌ దేత్‌”

మామిడి చెట్లు పుష్పించి ఫలించడం ఇతరుల కొరకే. వాటిని ఎంతగా రాళ్ళతో కొట్టినా, అలా కొట్టినవారికి అవి మధురమైన మామిడిపండ్లనే కానుకగా ఇస్తాయి. అదేవిధంగా మహాత్ములు తాము పరోపకారార్థమే జీవిస్తారు. తమను ఇక్కట్ల పాలు చేసిన వారిని కూడా క్షమించి, తిరిగి వారికి ప్రత్యుపకారమే చేస్తారు. అలాంటి మహా త్ముల ఉదాహరణలు, మనకు స్ఫూర్తినిచ్చేవి… కొన్ని పరిశీలిద్దాం.

శరణు కోరితే శత్రువునైనా రక్షించే శ్రీరాముడు

- Advertisement -

తన భార్యను అప#హరించి, తనతో శత్రుత్వాన్ని పూనిన రావణుని సోదరుడైన విభీషణుడు వచ్చి తనను శరణు వేడినప్పుడు సుగ్రీవాది వానర వీరులు సంశయించి వారించినా శ్రీరాముడు ఏమాత్రం వెనుకంజ వేయక అతనికి శరణు నొసగినాడు. ”సకదేవ ప్రసన్నాయ తవాన్మీతి చ యాచతే/ అభయం సర్వ భూతేభ్యో, దదామ్యేత ద్వ్రతం మమ”. ”నన్ను శరణు కోరిన వారిని రక్షించడమే నా వ్రతం. నేను నమ్మిన ధర్మమది” అని తన వారితో పలికాడు రాముడు. శరణు కోరిన శత్రువునైనా అక్కున చేర్చుకోవాలన్న సందేశమిది. ఆ సమయంలో వానరులు శ్రీరాముని ఇలా ప్రశ్నించా రు. ”రావణుని చంపి లంకకు రాజును చేస్తానని విభీషణునికి మాట ఇచ్చావు సరే. శర ణాగత రక్షణ నీ విధి అంటున్నావు… బాగుంది. మరి ఆ రావణుడే తనను క్షమించమని నీ దగ్గరకు వస్తే అప్పుడేమి చేస్తావు?” అని అడిగారు. వెంటనే క్షణం కూడా ఆలోచించ కుండా శ్రీరాముడు చెప్పిన సమాధానమిది. ”అదే గనుక జరిగితే రావణునికి నా అయోధ్యను ఇచ్చేస్తాను.” విస్తుపోవడం ప్రశ్నించిన వారి వంతైంది. అంతేనా రావణ వధానంతరం విభీషణునితో ”రావణునికి యథోచితమైన అంతిమ సంస్కారాలు జరు పమని, ఎందుకంటే, ‘మరణాంతాని వైరాని’, అంటే మరణించిన తర్వాత ఆ వ్యక్తి పట్ల వైరము కొనసాగరాదని,” చెప్పడం కూడా శ్రీరామచంద్రుని వంటి ధీరోదాత్తులకు, మహాత్ములకు మాత్రమే సాధ్యం.

కరుణామూర్తి గౌతమ బుద్ధుడు

సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా అవతరించాక అతని జ్ఞాతి సోదరుడైన దేవదత్తుడు కొంతకాలం శాక్య రాజ్యాన్ని పాలించాడు. ఆ సమయంలో అతడు సిద్ధార్థుని భార్య యశోధరను మానసికంగా వేధిస్తాడు, కామిస్తాడు. చిన్నప్పటి నుండీ సిద్ధార్థుని పట్ల ఈర్ష్య, ద్వేషం పెంచుకొన్న దేవదత్తుడు కపిల వస్తు నగరానికి బుద్ధుడు వస్తున్నాడని విని తన రాజ్యాధికారాన్ని బుద్ధుడు తిరిగి లాగేసుకొంటాడేమోనన్న సంశయంతో బుద్ధుని అంతమొందించడానికి కూడా అనేక కుట్రలు పన్నుతాడు. కానీ అవన్నీ విఫల మౌతాయి. పశ్చాత్తాపం నటించి బుద్ధుని శరణువేడి, అతని సంఘంలో బౌద్ధ భిక్షువు గా చేరుతాడు. స్వభావత: కుట్రలు, కల్మషం, కపటం కలిగిన దేవదత్తుడు బుద్ధత త్త్వాన్ని అవగతం చేసుకోలేక, అత్యంత కఠినమైన సాధనలు చేసి, కొన్ని అతీంద్రియ శక్తులను పొందుతాడు. తనను బౌద్ధ సంఘానికి అధ్యక్షునిగా ప్రకటించమని కోరినా, అతని విషయం తెలిసిన బుద్ధుడు అందుకు అంగీకరించకపోవడంతో భిక్షు సంఘం

లో భేదాభిప్రాయాలను సృష్టించి వారిని విడదీసే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఎన్నో దుర్మార్గాలకు పాల్పడిన దేవదత్తుడు ఆ పాప ఫలితంగా తన చివరిదశలో చాలా దీనస్థి తిలో, వ్యాధుల బారినపడి, మృత్యువుతో పోరాడుతున్న సమయంలో బుద్ధుడు స్వ యంగా అతనికి పరిచర్యలు చేస్తాడు. మరుజన్మలో ”అత్థిస్సరుడు” అనే పేరుతో బౌద్ధు నిగా జన్మించి నిర్వాణం పొందేలాగా దేవదత్తుని అనుగ్ర#హస్తాడు అత్యంత కరుణా మూర్తి అయిన బుద్ధుడు.

భగవాన్‌ శ్రీరమణ మ#హర్షి

పెరుమాళ్ళు స్వామి అనే భక్తుడు రమణ మహర్షి అరుణాచలం చేరినప్పటి నుండీ ఆయన వెనువెంటనే ఉండి గొప్పగా పరిచర్యలు చేసేవాడు. మంచి కార్యదక్షుడు కూ డా. స్వామి పట్ల భక్తితో ఎన్నో సేవలు చేసేవాడు. దురదృష్టం కొద్దీ ఆశ్రమాధికారం గురించి ఆయనకు రమణుల పూర్వాశ్రమ సోదరుడైన చిన్న స్వామికీ తగాదా వచ్చి, అది పెరిగి పెద్దదై కోర్టుల దాకా వెళ్ళింది. చివరకు శ్రీ రమణులను కూడా కోర్ట్‌ కమీషన్‌ ఒక నాలుగు రోజులు, ఆశ్రమములోనే, విచారించాల్సి వచ్చింది. భగవాన్‌ ఎవరివైపూ మొగ్గు చూపక కోర్ట్‌ వారికి తటస్థమైన సమాధానాలే చెప్పారు. అయితే అన్ని కోర్టులలో నూ తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో పెరుమాళ్ళు స్వామికి అంతవరకు శ్రీరమ ణుల పట్లగల భక్తి ఒక్కసారిగా ద్వేషంగా మారిపోయింది. రకరకాలుగా భగవాన్‌ను, ఆశ్రమాన్ని చిక్కులపాలు చేయడానికి ఎన్నో విఫల యత్నాలు చేశాడాయన. అయితే కాలక్రమేణా అతనికి తన తప్పు తెలిసిరావడంతో గుండెలు బ్రద్దలయ్యేలా ఏడుస్తూ వచ్చి రమణుల పాదాలపైపడి ”భగవాన్‌! నేను గురు ద్రోహని. నాకు నరకం తప్పదు” అంటూ కుమిలి కుమిలి దు:ఖపడ్డాడు. కరుణాస్వరూపులైన శ్రీరమణులు అతని తల, వీపు ప్రేమగా నిమురుతూ, ”నీవు నా వాడివి పెరుమాళ్ళూ! నీకేం భయం? నేనున్నాను కదా! నిన్ను విడిచి పెడతానా? ఇదంతా విధి లీల. గురుద్రో#హమేమిటి? నాకెవరు ద్రో హం చేయగలరు? భయపడకు. నీ రక్షకుడనైన నన్ను విశ్వసించు. నరకంలో అయినా నీ పక్కన నేనుంటాను కదా” అన్నారు ఆత్మీయంగా. అంతటి క్షమ సామాన్యులకు సాధ్యమా?

”నరస్యాభరణం రూపం, రూపస్యా భరణం గుణ:
గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా!”

మానవులకు రూపము ఆభరణము. రూపానికి గుణం ఆభరణం. గుణానికి జ్ఞానం ఆభరణం. జ్ఞానానికి క్షమయే ఆభరణం. సక్షమ చిత్తులైన ఉత్తముల స్ఫూర్తి మనకు సదా అనుసరణీయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement