మహావృషల దేశమును వంశపారంపర్యంగా పరిపాలించే జనశ్రుతి వం శములో పుట్టినవాడు, ఆ జనశ్రుతుని మునుమడు జానశ్రుతుడు- రాజుగా ఉండేవాడు. గొప్ప పరిపాలనాదక్షుడు. ఆయన సేవాకార్యక్ర మాలు జరిపించడంలోనూ, ధార్మిక కార్యక్రమాలు చేయడంలోనూ ప్రసిద్ధి గాంచాడు. ఆయనకు ‘దానము’ విషయములో ఎంతో ఇష్టము, మరెంతో శ్రద్ధ ఉండేవి. అనేక దానములు చేస్తూ ఉండేవాడు. గొప్ప యజ్ఞాలు చేస్తూ, అన్న దాన మే మహాయజ్ఞంగా భావించేవాడు. స్వయముగా అనేక ధర్మసత్రములు కట్టిం చాడు. ఆ ధర్మశాలలో కూడా బాటసారులకు, పేదవారికి అన్నదానం నిర్వ ర్తించే వాడు. ఈవిధంగా ఆ రాజ్యంలో ఎవరికీ ఎక్కడా ఆకలి బాధ ఉండేదే కాదు.
అయితే ఈ సత్కార్యాల వల్ల తనకు ఎంత కీర్తిప్రతిష్టలు వస్తోంది అని బేరీజు వేసుకుంటూ ఉండేవాడు. పేరుప్రఖ్యాతులు పొగడ్తలు లేకపోతే ప్రజలకు అదెంత మేలు చేసే పనైనా సరే మధ్యలోనే విరమించేవాడు. పరలోకం కోసం, ఇతరుల సౌఖ్యం కోసం ఆదరంతో దానం చేస్తున్నాం అనుకునేవాడు. తాను దానం చేస్తే వెంటనే కీర్తి రావాలి. పదిమంది తనను మెచ్చుకోవాలి. అలా అయితేనే ఈ కార్యక్రమాలు అని లేకపోతే ఏమీ లేవు అనే దృష్టితో ఉండేవాడు. తనను పోలిన ధర్మదాత ఈ లోకంలో మరొకరు లేరని తనకు తనే సాటి అని మనసులో అనుకుంటూ ఉండేవాడు.
ఒకానొక రోజు సాయంకాలం చీకటిపడుచున్న సమయంలో జానశ్రుతుడు రాజమందిరపు మేడపై గల విశాల ప్రదేశంలో (రాజప్రాసాదము పైభాగముపై) అటూ ఇటూ పచార్లు చేస్తూ, నిండు పున్నమి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఇష్ట దైవ ప్రార్థన చేసుకొంటూ ఉన్నాడు. అప్పుడు ఆకాశంలో రెండు రాజహంసలు ఆ మేడ పైభాగపు విశాలాకాశంలో ఏదో సంభాషించుకొంటూ, విహారములు చేస్తూ తన వైపు చూస్తూ ఉండటము ఆయనకు కనిపించింది. ”ఈ రాజహంసలు నా గురించి ఏదో విషయం సంభాషించుకుంటున్నట్లు ఉన్నాయి. ఏమిటది?” అని తలచాడు. బుద్ధిని సూక్ష్మతరం చేసి, పక్షుల భాషను ఎరిగి ఉండటం చేత, ఆ సంభాషణను ఏకాగ్రంగా వినసాగాడు.
ఒక హంస రెండవ హంసతో ”ఓ భల్లాక్షుడా? కళ్ళు సరిగ్గా కనిపించనివాడా? ద్యులోకంలో వెలిగే జ్యోతిలా జానశ్రుతి పౌత్రాయణుడి తేజస్సు అంతా వ్యాపించి ఉంది. దాన్ని తాకొద్దు. అది నిన్ను కాల్చేస్తుంది జాగ్రత్త” అంది.
రెండవ హంస ”ఓ అజ్ఞానీ! ఈ జానశ్రుతిలో అంత గొప్పతనం ఏముంది? ఈ స్వల్పు ని గురించి ఎందుకు ఘనంగా పొగుడుతావు? బండిరైక్వుని పొగిడినట్లు పొగుడుతు న్నావేమి? ఈయన ఏమయినా రైక్వుడి కన్నా గొప్పవాడా ఏమిటి?” అంది.
దానికి మొదటి హంస ”ఓ భల్లాక్షా! బండి రైక్వుడెవ్వరు? ఆయనకు అంతటి కీర్తి ఎలా లభించింది? చెప్పు” అని అడిగింది. దానికి భల్లాక్షుడిలా సమాధానమిచ్చాడు.
”జూదంలో ఎన్నో రకాలుంటాయి. వాటిలో కృత అనే ఆట ఒకటుంది. ఆ ఆటలో గెలిచినవాడు, మిగతావారందరూ గెలిచిన అన్ని ఆటలను తాను గెలిచినట్టే అవుతుంది. అదేవిధంగా లోకంలో జనులంతా చేసే అన్ని రకాల పుణ్యాలు ఆ రైక్వుడినే చేరుతున్నాయి. ఎందుకంటే ఆ రైక్వుడు గొప్ప ఆత్మజ్ఞాని.”
ఈరకంగా మాట్లాడుకొంటున్న హంసల సంభాషణ విన్న జానశ్రుతి తన రథ సారధి ని పిలిచి ”ఓ సారధీ! రైక్వుని పిలుచుకొని రా!” అని ఆజ్ఞాపించాడు. ”అతడే అందరి కంటె ను సుకృతాత్ముడు, జ్ఞానవంతుడు అయి ఉన్నాడు.”
రాజాజ్ఞననుసరించి రైక్వుడి కోసం ఎన్నో ప్రదేశాలు వెతికాడు. అతడికి రైక్వుడెక్కడా కనిపించలేదు. బ్రహ్మజ్ఞానులెక్కడ ఉంటారో అక్కడ వెదకమన్నాడు. చివరకి ఒక బండి క్రింద కూర్చుని మూగ గజ్జిని రుద్దుకుంటూ ఉన్న రైక్వుడిని కనుగొన్నాడు.
జానశ్రుతి సారధి చెప్పిన మాటలను విని ఆరు వందల పాడి ఆవులను, పలుర కాలైన బంగారు హారాలను, మేలుజాతి గుఱ్ఱాలతో కూడిన రథాన్ని గురుదక్షిణగా తీసుకొని రైక్వుణ్ణి సమీపించి ”ఓ మహానుభావా! రైక్వా ఈ పాడి గోవులను, భూషణాలను, రథాన్ని తమరు స్వీకరించి, మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతకు సంబం ధించిన దివ్యజ్ఞానాన్ని నాకు ఉపదేశించండి.” అని ప్రార్ధించాడు. అయితే రైక్వుడు కోపంగా ‘వీటిని తీసుకొనిపో!’ అని తిరస్కరించాడు.
జానశ్రుతి తిరిగి వెయ్యి గోవులను, అనేక భూషణాలను, రథాలను, వాటితోబా టు తన కుమార్తెను కూడా తీసుకొని రైక్వుని దగ్గరకు వెళ్ళి ”స్వామీ! నేను తెచ్చిన వస్తువులతో పాటు నీ భార్యగా నా కుమార్తెను, నీవు నివసించు ఈ గ్రామమును కూడా నీకు సమర్పిస్తున్నాను. దయచేసి వీటిని స్వీకరించి నాకు బ్రహ్మవిద్యను బోధించం డి” అని వేడుకొన్నాడు. అప్పుడు రైక్వుడు జానశ్రుతి కుమార్తె నిర్మలమైన ముఖ మును చూచి ఆమెది విద్యాముఖమని గ్రహంచి” ఈమె ద్వారా నీకు బ్రహ్మవిద్యో పదేశం చేస్తాను. మహావృషల దేశంలోని నాకు దానం చేసిన ఈ గ్రామం ఇకముందు రైక్వపర్వంగా పిలవబడుతుంది” అని చెప్పాడు.
రైక్వుడు ఆ గ్రామంలోనే నివసిస్తూ జానశ్రుతికి ఈవిధంగా బ్రహ్మవిద్యను ప్రబోధించాడు. రైక్వుడి ఉపదేశాన్ని సంవర్గ విద్య అంటారు. వాయువు పంచభూతా లలోని ఇతర భూతాలను తనలో సంవర్గం అంటే చేర్చుకొని లయం చేసుకొనే శక్తికి సంబంధించిన విద్య అని అర్ధం.
ధార్మికుడైన భక్తుడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ప్రేరణను కల్పించే మహాత్ములు పరమహంసలు. ఇది ఉప నిషత్తులోని ఒక కథ.
జానశ్రుతికి రైక్వుడి ఉపదేశం
Advertisement
తాజా వార్తలు
Advertisement