Saturday, November 23, 2024

పుట్టుకకు అర్థాన్ని, సాఫల్యతను చేకూర్చేదిశ్రీరాముడి చరితము!

వాల్మీకి మహర్షి, శిష్యుడైన భరద్వాజుడు అనుసరించి వెంట రాగా, తమసానది తీరా నికి వెళ్ళాడు ఒకసారి. నది వద్దకు చేరి చేతులలో వున్న కలశమును, నీళ్ళలో జాడిం చి శుభ్రం చేసుకోవడానికి తెచ్చిన బట్టలను గట్టుపై పెట్టి, ఒక్క క్షణం నది నీళ్ళలోకి చూస్తూ కూర్చున్న వాల్మీకి మహర్షి చిత్తాన్ని, తమసానదిలో ప్రవహస్తున్న నీళ్ళ స్వచ్ఛత ఆ కర్షించి, ఆహ్లాదపరిచింది. వెంటనే ఇలా అన్నాడు శిష్యుడైన భరద్వాజునితో…
ఆ.వె. అనఘ కంటె, రమ్యమై నిష్కళంకమై,
స్వాదుయుక్తమై, ప్రసన్న సలిల
మై నుతింపనయ్యెనీ నదీతీర్థంబు
సాధు పురుష మానసంబుకరణి.
(గోపీనాథ రామాయణము, ప్రథమాశ్వాసం, 128)
”నాయనా చూశావా, చూపులకు అందంగా, మలినర#హతంగా, దప్పిక తీర్చుకోవడా నికి వీలుగా తాగడానికి అనువైనవై, స్వచ్ఛంగా కనిపిస్తున్న ఈ తమసా నదీ తీర్ధం, సాధుపురు షుల మానసముల వలె, పొగడదగినదిగా ఉంది సుమా!” అని పై పద్యం భావం. అలా కొన్ని క్షణాలు తమసానది నీటి స్వచ్ఛతను ఆనందంతో ఆవలోకించినవాడై, అంతలో అక్కడకు వచ్చిన పని మనసులో మెదలగా శిష్యుడైన భరద్వాజుడిని పురమాయించాడు వాల్మీకి…
కం|| కలశం బచ్చటఁబెట్టుము,
తలఁగకవల్కలముఁదెమ్ము తమసాతటినీ
జలమజ్జన మొనరించెద,
మలఘుగుణాసాంధ్యకృత్య మది తీర్చుటకున్‌.
(గోపీనాథ రామాయణము, ప్రథమాశ్వాసం, 129)
‘నాయనా, చేతిలోని కలశాన్ని అలా కొంత దూరంలో గట్టు మీద పెట్టు. ముందుగా చేయాల్సిన పని బట్టలు ఉతుక్కోవడం కాబట్టి, ఆ బట్టలను ఒకసారి ఇలాగివ్వు. ఇక్కడ కాస్త అనువుగా ఉంది. కూర్చుని నిర్మలంగా వున్న ఈ తమసానది నీళ్ళలో బట్టల్ని ఉతికి శుభ్రపరు చుకుంటాను. బట్టలు ఉతికి శుభ్రం చేసుకోవడం అనే ఈ పని పొద్దుటి పూటనే పూర్తి చేసుకోవా ల్సిన పని సుమా!’ అని వాల్మీకి మహర్షి చెప్పిన మాటలు పై పద్యం భావం.
గురువుగారైన వాల్మీకి మహర్షి అలా చెప్పగానే శిష్యుడైన భరద్వాజుడు గురువుగారి చేతి కి బట్టల్ని అందించాడు. బట్టలను తీసుకున్న వాల్మీకి మహర్షి, ఉతికి శుభ్రపరిచే పనిలోకి దిగ బోతూ, ఒక్కసారి తమసానదీ తీరవనం వైపుకు దృష్టి సారించి, పరీక్షగా చూడసాగాడు. అలా ఆ నదీతటస్థిత వనప్రాంతంలో ప్రభాత శోభను వీక్షిస్తున్న సమయంలో, ఒక క్రౌంచ మిథునంలోని మగపక్షిని వేటగాడొకడు బాణంతో కొట్టగా, ఆ దెబ్బకు చనిపోయిన తన జంట పక్షిని చూసి విలపిస్తున్న ఆడ క్రౌంచపక్షి శోకానికి చలించిన వాల్మీకి మహర్షి, తన నోటి నుండి – ”మా నిషాద ప్రతిష్ఠాంత్వమగమశ్శాశ్వతీస్సమా:
యత్క్రౌంచ మిథునాదేక మవధీ: కామమోహతమ్‌’
అనే శ్లోకం అప్రయత్నంగా వెలువడడాన్ని గురించి తనకు తానుగానే కొన్ని క్షణాలు ఆశ్చర్యంలో మునిగి, అంతలో తేరుకుని పక్కనే ఉన్న శిష్యుడైన భరద్వాజునితో…
”క్రౌంచీ శోకార్తుండనై యిప్పుడేను నిషాదుని శపించిన శాపోక్తి చతుష్పాదయుక్తంబై, సమాక్షర పదంబై, లక్షణోపేతంబై, యనేకార్థ ప్రతిపాదకంబై, తంత్రీలయ సమన్వితంబై, శ్లోక రూపంబయ్యె, శ్లోకంబు కంటెనన్యం బైనకేవల పద సందర్భంబు గాదు వింటివేయని పలికిన నా భరద్వాజుండు వాల్మీకి వచనంబు విని హృష్టచిత్తుండై బహు ప్రకారంబుల నుత్తమంబైన యా శ్లోక రాజంబుఁ బఠించిన సంతుష్టాంతరంగుండై.”
(గోపీనాథ రామాయణము, ప్రథమాశ్వాసము, 136 వచనం)
”ఆడ క్రౌంచపక్షి బాధను చూడలేక చలించినవాడనై ఇప్పుడు నేను ఆ వేటగాడిని శపిం చిన శాపపు మాటలు నాలుగు పాదములు కలిగినదై, ప్రతిపాదంలోనూ సమమైన అక్షరాల సంఖ్య కలదై, లక్షణ బద్ధమైనదై, అర్ధం చేసుకోగల బుద్ధికి అనేకమైన భావాలను కలిగించే సమర్ధత కలిగినట్టిదై, లయబద్ధతను కలిగి వుండిగా నయోగ్యమైనదిగాను తీగ వాయిద్య ములపై మోయించగలిగినదిగానూ వుండి శ్లోక రూపాన్ని ధరించాయి. శ్లోకం కంటె అన్యమై న మామూలు మాటలు కావు అవి. విన్నావా నాయనా!” అని అంటాడు.
గురువుగారైన వాల్మీకి మహర్షి మాటలు విన్న భరద్వాజుడి అంతరంగం ఆనంద తరం గితమైంది. వెంటనే తానూ ఆ శ్లోకంలోని మాటలను పునశ్చరణ చేసుకుని
గురువుగారు వినేట్లుగా చదవగా, ఆనందించినవాడైన వాల్మీకి మహర్షి తన నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన సర్వలక్షణ బద్ధమైనట్టిది, గానయోగ్యమైనట్టిది అయిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ, స్నానాదికాలను తొందరగా ముగించుకుని శిష్యుడైన భరద్వాజుని తోపాటుగా ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ శ్లోకాన్నే ఒక మంత్రంగా జపిస్తూ ఉన్న వాల్మీకి మ#హర్షి వద్దకు అప్పుడు బ్ర#హ్మదేవుడు వచ్చాడు. నుదురు నేలను ఆనేలా బ్ర#హ్మదేవుడి ముం దు మోకరిల్లి పాదాభివందనం చేసి పూజించి, సుఖాసీనుడిని చేసిన తరువాత ‘ఈ శ్లోకం ఇలా నా నోటి వెంట అప్రయత్నంగా వెలువడడం ఎలా సాధ్యమయింది? కారణం తెలియజెప్పం డి దేవా!’ అని అడిగిన వాల్మీకి మహర్షికి…
తే.గీ. తాప సోత్తమమత్ప్రసాదమునఁజేసి,
భారతీదేవి నీ జిహ్వఁబాదుకొనియె
నట్లుగాకున్న నీ చేతననఘనేఁడు,
పరఁగ నీ శ్లోకమిబ్బంగి బద్ధ మగునె.
(గోపీనాథ రామాయణము, ప్రథమాశ్వాసం, 145)
”తాపసులలో ఉత్తముడవైన ఓ వాల్మీకి మహర్షీ! నా ప్రసాదంగానే అంబ సరస్వతీదేవి నీ రసనపై నివాసం యేర్పరుచుకున్నది. అలాకాకుంటే, ఈ రోజు ఈ శ్లోకం ఈ రీతిగా లోపర హతమైనదిగానూ, లయబద్ధమైనదిగాను వుండి అక్షర బద్ధమై ఎలా నీ నోటి నుండి వెలువ డుతుంది చెప్పు?” అంటాడు. అలా అసలు సంగతిని వివరించిన బ్ర#హ్మ, ఆ వెంటనే వాల్మీకి మహర్షిని శ్రీరాముడి చరితాన్ని కావ్యంగా చెప్పమని ఆదేశిస్తాడు.
కం|| శ్రీమంతుఁడు గుణవంతుఁడు,
ధీమంతుఁడు ధార్మికుండు ధీరుండగునా
రాముని చరితముఁజెప్పుట,
ప్రామాణ్యము పుట్టువునకు ఫల మగుఁ జుమ్మీ.
(గోపీనాథ రామాయణము, ప్రథమాశ్వాసం, 147)
సకల గుణాభిరాముడు, ధీరుడు, ధర్మరక్షణ యందు తన చిత్తము సదా నిలిపేటువం టివాడు అయిన శ్రీరాముడి చరితము చెప్పడం అంటే పుట్టిన పుట్టుకకు ఒక అర్ధాన్ని, సాఫల్య తను చేకూర్చుకోవడమే కాని వేరు కాదు- అని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షితో చెప్పడం పై పద్యం భావం.

Advertisement

తాజా వార్తలు

Advertisement