కోటి జన్మార్జితై: పుణ్య: శివే భక్తిర్విజాయతే…
కోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. ‘శివ’ అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాది దేవుని అష్ట మూర్తులు వ్యాపించి ఉన్నాయి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రు డు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు…అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు. ఈ శర్వాది అష్టమూర్తులే.. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞ, సూర్యచంద్రులను.. అధిష్టించి ఉన్నా యి. ఈ అష్టమూర్తులను ఆధారం చేసు కొని విశ్వమంతా వ్యాపించిన భగవంతుని సర్వ తోభావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది.
ఓం శర్వాయ క్షితిమూర్తయే నమ: ఓం భవాయ జలమూర్తయే నమ:
ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ: ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమ:
ఓం భీమాయ ఆకాశమూర్తయే నమ: ఓం పశుపతయే యజమానమూర్తయే నమ:
ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమ:
ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమ:
దేహూ దేవాలయ: ప్రోక్తో జీహాదేవ సనాతన:|
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్||
జీవుని దేహమే దేవాలయం. మాయావిముక్తుడైన జీవుడే సదాశివుడు. అజ్ఞానమనే నిర్మాల్యాన్ని విడిచి ‘సోహం’ భావంతో సదాశివుని, పూజించాలి. రుద్రో జనానాం హృదయే సన్నివిష్ట:| ప్రాణష్యంతర్మనసో లింగమాహు:||
హృదయంలో ఉన్నవాడు రుద్రాలింగశాబ్దవాచ్యుడైన శివుడిని శ్రుతులు చెబుతున్నాయి. అందుకన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మ లమైన మనస్సు నుండి వెలువడే శ్రద్ధా నదీజలంతో మహాదేవుని అభిషేకించి, సమాధి పుష్పాలతో పూజించి, మోక్షాన్ని పొందాలి. బ్రహ్మచారులు యాజ్ఞవ ల్క్యుని చేరి ”ఏ మంత్రంచేత మనుష్యుడు మోక్షంపొందుతాడు” అని అడిగారు.
దానికాయన.. ”శతరుద్రీయేణతి” అన్నారు..
అంటే.. శతరుద్రీయంచేత అని..
‘శతం రుద్రా దేవతా యస్య’
నూరుమంది అంటే పెక్కుమంది రుద్రులు. వారు దేనికి దేవతలో… అలాంటిది శత రుద్రీయం అని తైత్తరీయసంహత చతుర్థకాం డ పంచమ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటున్నది.