Tuesday, November 5, 2024

మూడో కన్ను నా కోసమేనా…

ఒకసారి శివుడు తపోదీక్షలో నిమగ్నమైపో యాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడకు వచ్చి, శివుడిని ఆటపట్టించటానికి ఆయన రెండు కళ్లను తన చేతు లతో మూసింది. వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. ముల్లోకాలలోనూ అయోమ యం ఏర్పడింది. స్వర్గాధిపతి కూడా భయపడ్డాడు. శివుడు తనకున్న దివ్యశక్తితో, మూడో కన్నును సృష్టించి, నుదుటి మీద నిలిపాడు. ఆ కంటి నుంచి అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ అగ్నివల్ల ముల్లోకాలలోనూ చీకటి తొలగింది. శివుని రెండు కళ్లను మూసిన పార్వతి రెండు చేతులూ చెమర్చాయి. పార్వతి పరమేశ్వరుల కారణంగా ఏర్పడిన చెమట, ఒక బాలుడిగా పరిణమించింది. ఆ బాలుడే అంధకుడు. మహాదేవు ని పరమ భక్తుడైన ఒక దానవుడు, అంధకుడిని దత్తత తీసుకున్నాడు. ఆ కథ వేరు. శివుడి మూడో కన్ను గురించి శివపార్వతులు ముచ్చ టించుకుంటున్నారు.
కైలాసం నుంచి పార్వతీపరమేశ్వరులు విహా రానికి బయలుదేరి శ్మశానం చేరుకున్నారు. ఇద్దరికీ ఏకాంతం దొరకటం గగన మైపోతోంది. భక్తుల మొరలు ఆలకించటంలో ఇద్దరూ నిమగ్నమైపోతు న్నారు. శివరాత్రి సందర్భంగా వారిద్దరికీ ఒకరి మనసులో మాటలు ఒకరితో పంచు కోవాలనిపించిం ది. మరో వారం రోజుల వరకు చేయ వలసిన పనులను పూర్తిచేసి శ్మశానంలో హాయిగా తీరిగ్గా కూర్చున్నారు.
శివుడు: గిరిజా! నువ్వు సంపన్నుల ఇంట్లో పుట్టి, మంచుకొండలో చల్లగా నివసించేదానివి. సకలోప చారాలు జరిగేవి కదా నీకు. అటువంటి నువ్వు నన్ను ఎంచుకోవటంలో ఆంతర్యం ఏంటి?
పార్వతి: ఇన్ని రోజుల తర్వాత మనం సరదాగా మాట్లాడుకుందామని ఇక్క డకు వస్తే, ఈ ప్రశ్నలు ఏంటి అంటూ చిరునవ్వులు చిందించింది.
శివుడు: అది కాదు పార్వతీ! నీ ఆంతర్యం తెలుసుకుందామని ప్రశ్నించాను.
పార్వతి: నా ఆంతర్యం మాటేమో కాని. ఈ రోజు నేను నిన్ను ఒక ప్రశ్న వేయా లనుకుంటున్నాను. దానికి సరైన సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను.
శివుడు: ఏంటో ఆ ప్రశ్న.
పార్వతి: నువ్వు దిగంబరుడవని, కపాలంలో భిక్ష చేస్తావని, రక్తం కారే గజ చర్మం ధరిస్తావని … ఇవన్నీ తెలుసు. కాని నీ మూడో కన్నులోని ఆంతర్యం గురించి నువ్వు చెబితే వినాలని, తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నాకు.
శివుడు: నీ ఉద్దేశం ఏంటి పార్వతీ. నన్ను బేసి కన్నులవాడు, ఫాల లోచను డు, నిటలాక్షుడు అంటారని నీకు అవమానంగా ఉందా?
పార్వతి: అసలు అటువంటి ఆలోచనే లేదు. నీ మూడు కళ్ల గురించి చంద్రా ర్కవైశ్వానర లోచనాయ అని ప్రస్తుతించారు. కాని నీ కళ్ల గురించి నువ్వు ముచ్చటిస్తే బావుంటుందని అడుగుతున్నాను.
శివుడు: నిజం చెప్పనా. ఈ కన్ను నీ కోసమే.
పార్వతి: సిగ్గుపడుతూ, నా కోసమా. అర్థం కాలేదు.
శివుడు: ప్రపంచాన్ని చూసిన కళ్లతో కాకుండా, ప్రత్యేకంగా నిన్ను మాత్రమే చూస్తున్నాను ఈ కంటితో.
పార్వతి: చంద్రుడు, అర్కుడు, అగ్నిహోత్రుడు (వైశ్వానరుడు) ఈ ముగ్గురూ మూడు కళ్లు కదా. మరి నీ నుదుటన ఉన్న కన్ను అగ్ని తుల్యం కదా.
శివుడు: అవును. ఎంతటి మలినమైనా అగ్నిలో పవిత్రం అవుతుంది కదా. అంటే అమలినత్వానికి ప్రతీక అగ్ని కదా. నేను నిన్ను అమలిన నేత్రంతో వీక్షిస్తాను.
పార్వతి: ఇంత పవిత్రంగా నువ్వు మాత్రమే మాట్లాడగలవు. అందుకే నేను నిన్ను ప్రశ్నించాను.
శివుడు: పవిత్రంగా ఏముంది శైలజా. వాస్తవాన్ని వాస్తవంగా పలికాను. అంతేకదా. ఇందులో ప్రత్యేకత ఏముంది.
పార్వతి: నిన్ను ఆదిభిక్షువు అని పలికినా నాకు కోపం రాదు. ఈ సృష్టిలో అందరూ భిక్షువులే. కాని నీకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఆ కన్ను. అందుకే ఆ చక్షువు గురించి నువ్వు ఏం చెప్తావోనని ఈ ప్రశ్న వేశాను.
శివుడు: నువ్వు అడగకపోయినా నువ్వు అడిగిన దాని నుంచి చిన్నచిన్న చమత్కారాలు చెబుతాను నీకు. అవి కూడా నా మూడు కళ్ల గురించే. మనకు ముల్లోకాలు, ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాల సంధ్యలు, త్రిదశులు, త్రిశూలం, త్రిపురాలు, త్రిఫలాలు… ఇలా ఎన్ని ఉన్నాయో. మూడు సంఖ్యకు అంత ప్రాధాన్యత ఉంది. నేను దిగంబరుడిని. అంటే దిక్కులే అంబ రంగా కలిగినవాడినని కదా. అంటే విశ్వవాపితుడిని కదా. అటువంటప్పుడు నాకు ఈ అదనపు చక్షువు అవసరమే కదా.
పార్వతి: మరి ఆ కన్ను నన్ను చూడటానికే అన్నావు కదా.
శివుడు: అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే… కేవలం నిన్ను మాత్రమే చూడటానికి ఆ కన్నును వినియోగిస్తే ఎలా. ఆ కన్నుతో ఇంకా ఎన్నో మంచిపనులు నిర్వర్తించాలి కదా. అందుకే మూడు లోకాలను మూడు కళ్లతో చూస్తాను. త్రిశూలంలోని మూడు మొనలను మూడు కళ్లతో చూస్తాను. త్రిపురాలను మూడు కళ్లతో జయించాను. త్రికాల సంధ్యలు నా త్రినేత్రాలు. నా కళ్లు సూర్యుడు చంద్రుడు అగ్ని కదా. అంటే ఉదయ సంధ్య సూర్యనేత్రం, మధ్యా#హ్న సంధ్య అగ్ని నేత్రం, సాయం సంధ్య చంద్ర నేత్రం అన్నమాట.
పార్వతి: నీ చమత్కారాలు చాలా బావున్నాయి.
శివుడు: చమత్కారం కాదు ఉమా. వాస్తవం. మేం త్రిమూర్తులమన్న సంగతి తెలిసిందే కదా.
పార్వతి: ఈ రోజు ఈ శ్మశానానికి రావటం వలన తత్త్వం బోధపడింది. వేదాంత సముపార్జనకి, నిరాడంబర జీవితానికి ఇక్కడే పునాది పడుతుందేమో శంకరా… అని ముసిముసి నవ్వులు చిందించింది.
పార్వతీపరమేశ్వరులు ఇరువురూ ఒకరి చేతిని ఒకరు అందుకుని కైలాసానికి బయలుదేరారు.

– డా. వైజయంతి పురాణపండ

Advertisement

తాజా వార్తలు

Advertisement