Tuesday, November 19, 2024

అంతఃకరణమే ప్రమాణం

”దుర్లభం త్రయమే వైతత్‌ దైవాను గ్రహ హతుకమ్‌
మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ:”

నవ జన్మ, మోక్షాసక్తి, మహాత్ముల ఆశ్రయం అనే మూడూ దైవానుగ్ర హ కారణంగానే మిక్కిలి అరుదుగా లభిస్తాయని శాస్త్ర వచనం.
మానవజన్మ లభించినా ధర్మంగా జీవించడం కొందరికే సాధ్యం. ఎందుకంటే ధర్మం చాలా సూక్ష్మమైనది. లోకంలో ధర్మం అంటే ఇతరు లకు దానం ఇవ్వడం అనే అర్థంలో ఎక్కువగా వాడబడుతూ ఉంది. కానీ ధర్మం నిజమైన అర్థం ఆచరణ అని. అంటే ఆ పనిచేయడం అని. ఏ పనిని చేయాలి అనే ప్రశ్నకు వివిధ రకాల సమాధానాలు వస్తాయి. ”సత్యమే పలకాలి”. ఇది ధర్మం. కొన్నికొన్ని ప్రత్యేక పరిస్థితులలో అసత్యమాడటమే ధర్మం.. సత్యం పలకడం అధర్మం అవుతుంది. ఇలా చాలా సంశయాత్మకమైన స్థితి ఏర్పడే సందర్భాలు చాలా వస్తాయి.
దేశ కాల పాత్రలను బట్టి ధర్మ స్వరూపం మారుతూ ఉంటుంది. ధర్మవ్యాధుడు చెప్పినట్లుగా-
”భూత హతంబుగా పలుకు బొంకును సత్య ఫలంబునిచ్చు త
ద్భూత భయా స్పదం బగు ప్రభూతపు సత్యము బొంకునట్ల, ప్రా
ణాతురుడైనచో, పరిణయంబులయందును పల్కు బొంకు స
త్యాతిశయంబయండ్రు, మహతాత్మక! ఇట్టివి ధర్మ సూక్ష్మముల్‌”
ప్రాణులను రక్షించడం కోసం అబద్ధమాడినా అది సత్యం చెప్పి నట్లుగనే పరిగణింపబడుతుంది. ప్రాణులకు హానికలిగించే సత్యవా క్కు అబద్ధమాడినంత పాపాన్ని తలకెత్తుతుంది. ప్రాణ రక్షణ కోసం, పెండ్లి సంబంధాలు కుదర్చడం కోసం చెప్పే అబద్ధం సత్యంకన్నా విశేష మైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. వీటిని ధర్మ సూక్ష్మాలు అంటారు.
ఈ ధర్మ సూక్ష్మాలు తెలియకుండా ఏది ధర్మం, ఏది అధర్మం అని నిర్ణయించుకోలేము. తెలిసిన, నిర్ణయించగల్గిన పెద్దలు తక్కువమందే ఉంటారు. తమకే సర్వమూ తెలుసుననుకునే… కుహనా గురువులుగా చెలామణి అయ్యే లోకాయతికులు విరివిగా కనబడుతుంటారు. వీరు బావిలో కప్పలలాగా కనబడే ప్రపంచాన్ని తప్ప అంతకుమించి ఊహం చలేరు. అంతకన్నా వేరేదిలేదు. ఉండదు అని విశ్వసిస్తారు. కంటికి కన బడేదే వీరికి ప్రమాణము. పాపపుణ్యాలు, స్వర్గనరకాల వంటి వాటిని ప్రత్యక్షములు కావనే కారణంతో నమ్మరు. వీరి వాదం హతుబద్ధంగా, అర్థవంతంగా, శాస్త్రీయంగా అనిపిస్తుంది. కనుక చాలామంది వీరి ఆ కర్షణలో పడతారు ఇట్టివారిని వాల్మీకి మహర్షి ”అనర్థ కుశలురు” అని నిర్ధారించాడు. అంటే, అనర్థాన్ని, వినాశనాన్ని కొని తెచ్చుకోవడములో నేర్పరులు అని అర్థం. అంతేకాదు. వీరు బాలురవలె భ్రమ, భ్రాంతుల కు లోనయ్యేవారనీ, ”పండిత మాని న:”, అంటే తమను తామే పండి తులమని భావించుకొనేవారని వాల్మీకి అన్నారు. ఎవరిలోనైనా జ్ఞాన ము, విద్యా కౌశలము ఉన్నట్లయితే లోకం గుర్తించి, వారిని పండితు లని ప్రశంసిస్తుంది. అలాకాకుండా తన అజ్ఞానానికి తానే మురిసిపో యి, తానే గొప్ప పండితుడనని భావిస్తూ ప్రచారం చేసుకొనేవాడు ‘పండిత మాని’, ‘పండితమ్మన్యుడు’ అనబడతాడు. ఇప్పుడు మన చు ట్టూ ఇలాంటి వారు కోకొల్లలుగా కనపడతారు. వీళ్ళు తమను నమ్మిన వారిని అనర్థ పరంపర అనే నడిసముద్రంలో నిలువునా ముంచేస్తారు. ఇలాంటి వారికి ప్రతీకగా శ్రీమద్రామాయణంలో జాబాలి పాత్రను వాల్మీకి అయోధ్యకాండలోని 108, 109 సర్గలలో పరిచయం చేశారు.
అరణ్యవాసం చేయాలని కృత నిశ్చయుడై ఉన్న శ్రీరామునితో జాబాలి మ#హర్షి ఇలా అంటాడు. ”ఈలోకంలో ఎవరూ ఎవరికీ బంధు వుకాడు. ఎవరికీ ఎవరూ మిత్రుడూ కాడు. మానవుడు ఒంటరిగా పుట్టి, ఒంటరిగానే మరణిస్తాడు. బాటసారులు తమ ప్రయాణంలో అక్కడ క్కడ కొన్ని మజిలీలలో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకొనే విధంగా మన జన్మపరంపర సాగుతుంది. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు అన్నీ మజిలీలే. ఒకదానితో ఒకటి సంబంధం లేనివి. ధర్మాన్ని పట్టుకొని ప్రాకులాడేవారికి ఈ లోకంలోగానీ, అసలున్నదో లేదో తెలియని పై లోకంలోగానీ ఒరిగేదేమీ లేదు. యజ్ఞయాగాలు, శ్రాద్ధకర్మలు మొదలై నవన్నీ బూటకాలే. చనిపోయిన వానికి చేరాలని బతికి ఉన్నవానికి అన్నంపెడితే అది పైలోకానికి ఎలా చేరుతుంది? ఈలోకంలోనే ప్రక్క గ్రామములోని వానికి కూడా చేర్చలేని ప్రక్రియ కదా అది? యజ్ఞం, యాగం, మంత్రం, దానం, దీక్ష, తపస్సు, త్యాగం వంటివన్నీ మేధా వులు తమ పొట్టకోసం ఏర్పరచుకొన్న మార్గాలు. ఏది మన కంటికి కనబడుతోందో అదే సత్యం. పరలోక మన్నది లేనేలేదు. చనిపోయిన తండ్రి చేసిన వాగ్దానం కానీ, ఆయనకు నీవిచ్చిన మాటను కానీ పాటిం చాల్సిన అవసరం నీకు లేదు. చక్కగా భరతుని అనునయించి, అయో ధ్యకు రాజువై, సుఖాలననుభవించు”. ఇది ఎంత ఆకర్షణీయమైన ఉప దేశం కదా! మరొకరైతే బుట్టలో పడే వారే. కానీ జాబాలితో శ్రీరాముడు ఇలా అంటాడు. ”స్వామీ! నేను వేదాలను విశ్వసిస్తాను. అవి సత్యాన్ని ప్రబోధిస్తాయి. ఈ లోకయాత్ర అంతా సత్యం మీద ఆధారపడి ఉంది. లోభం వలన, మోహ, అజ్ఞానాల వలన సత్యాన్ని పాటించకపోతే నర కం తప్పదు. తండ్రి ఎదుట రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. నా తల్లి కైకేయి అందుకు సంతోషించింది. కనుక ఎట్టి పరిస్థితులలోనూ సత్య ప్రతిజ్ఞను తప్పను. రాజే సత్యాన్ని ఆచరిం చకపోతే ఇక లోకానికి ఎలా ధర్మాన్ని చూపగలుగుతాడు?” అంటూ తన కృత నిశ్చయాన్ని సున్నితంగా జా బాలికి తెలియజేస్తాడు. చివరకు జాబాలి శ్రీరామునితో ఏకీభవిస్తాడు.
సుఖానికి రాజమార్గంగా కనిపించే ఈ లోకాయతిక మార్గం జన ప్రియంగా ఉంటుంది. అయితే పర్యవసానం మాత్రం అతి ఘోరంగా ఉంటుంది. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది నిశ్చయించుకోవడం లోనే మానవుని విజ్ఞత ఉంటుంది. వేదము, స్మృతి, సదాచారము అనే ఈ మూడింటి వలన క్రమంగా ధర్మాధర్మములను నిశ్చయించుకో వచ్చు. ఒకవేళ ఈ మూడింటి వలన తెలుసుకోలేకపోతే దానిని నిర్ణ యించడానికి సాధనం పవిత్రమైన మనస్సే! అందుకే ‘అభిజ్ఞాన శాకుం తలం’లో మహాకవి కాళిదాసు ”సతాం హ సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంత: కరణ ప్రవృత్తయ:” అన్నాడు. అంటే ధర్మాధర్మ నిర్ణ యంలో మన అంత:కరణమే మనకు ప్రమాణము.

Advertisement

తాజా వార్తలు

Advertisement